శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

గ్రామీణ మహిళల కలలకు రెక్కలు!

స్వావలంబన సాధన దిశగా మహిళా టెక్నాలజీ పార్కులు
గత ఐదేళ్లలో 10వేలమంది గ్రామీణ మహిళలకు ప్రయోజనం

Posted On: 08 MAR 2021 9:09AM by PIB Hyderabad

ఫోకస్ : అంతర్దాతీయ మహళా దినోత్సవం:

 డాక్టర్ నీలూ ఆహుజా,..కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆమె ఒక ప్రొఫెసర్. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లోని యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యు.పి.ఇ.ఎస్.)లో పనిచేస్తున్నారు. గ్రామీణ మహిళలు, సమాజంలో అవకాశాలకు నోచుకోని ఇతర వర్గాల జీవితాల్లో మార్పును తీసుకురాగలిగే కార్యక్రమాలన్నా, అలాంటి పథకాలన్నా ఆమెకు ఎంతో మక్కువ. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గ్రామీణ మహిళల ఆదాయ సృష్టిలో శాస్త్రవిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం ప్రముఖ పాత్ర పోషిస్తాయని ఆమెకు నమ్మకం, విశ్వాసం. ఉత్తరాఖండ్ లో 20ఏళ్లుగా వృత్తిజీవితం సాగిస్తున్న నీలూ ఆహుజాకు ఆ రాష్ట్రంతో ఎంతో ప్రగాఢమైన అనుబంధం కూడా ఉంది.

   తన విశ్వాసంతో ముడివడిన కార్యక్రమాన్ని, తన కలలను నిజం చేసుకునేందుకు ఆమె అనేక ఇళ్ల తలుపుతు తట్టారు. పలువురిని స్వయంగా కలుసుకున్నారు. చివరకు,.. మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్రప్రభుత్వ అధీనంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించే మహిళా టెక్నాలజీ పార్కల (డబ్ల్యు.టి.పి.) పథకాన్ని ఆమె ఎంపిక చేసుకున్నారు.  ఈ పథకం ద్వారా డెహ్రాడూన్ లోని 280మందికిపైగా గ్రామీణ మహిళల జీవితాలను మార్చగలుగుతున్నారు. తమ జీవనోపాధికి తగినట్టుగా డబ్బు సంపాదించుకునేలా వివిధ నైపుణ్యాల్లో వారికి శిక్షణ అందించడం ద్వారా ఆమె తన లక్ష్యాన్ని సాధించారు. వివిధ రకాల వస్తువులు, ఉత్పాదనల తయారు చేయడం విక్రయించడం ద్వారా వారు ఆదాయం పొందేలా అవసరమైన శిక్షణను వారికి ఇప్పించారు. ఈ ప్రాజెక్టుకింద శిక్షణ పొందిన మొత్తం 480మందిలో ఎక్కువ ప్రతిభ కనబరిచిన ఔత్సాహిక మహిళలుగా వారు నిలిచారు. సాంకేతిక పరిజ్ఞానపరమైన శిక్షణ పొంది,. స్థానికంగా అందుబాటులో ఉన్న వెదురు, జనపనార, ఖర్జూరం ఆకులు వంటి వాటితో ఆభరణాలు, తదితర అలంకరణ వస్తువులను తయారు చేయడంలో వారు నైపుణ్యం సాధించారు. చెత్తనుంచి సంపదను సృష్టించగలిగారు. వార్తాపత్రికల కాగితంతో పెన్సిల్స్ తయారు చేయడం, ఔషధ మెక్కలు సాగుచేయడం తదితర రంగాల్లో వారు నైపుణ్యం సంపాదించారు.

 “క్రమం తప్పకుండా ఆదాయం రావడం వారిలో ఎంతో ఆత్మవిశ్వాసం నింపింది. ఇపుడు తమ ఆదాయాన్ని పెంచుకునే మరిన్ని మార్గాలను అన్వేషించాలన్నది వారిక కోరిక” అని డాక్టర్ ఆహుజా అన్నారు.

   ఉత్తరాఖండ్ కు సుదూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరో మహిళా టెక్నాలజీ పార్కు దాదాపు 350మందిదాకా గ్రామీణ మహిళలకు శిక్షణ అందించింది. మూళికా ఉత్పాదనలనుంచి ఆహార ఉత్పత్తులు, సౌందర్య వస్తువుల వరకూ వివిధ ఉత్పత్తులను తయారు చేయడంలో వారికి తగిన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ ఎ. జ్యోతి భాగస్వామ్యం వహించారు. వివిధ జిల్లాల్లో ఉన్న గ్రామీణ మహిళల్లోనూ, పాఠశాలల, కళాశాలల బాలికల్లోనూ ఔత్సాహికులను గుర్తించేందుకు, డబ్ల్యు.టి.పి. బృందం సభ్యులు ఇంటింటి సర్వే ఎలా నిర్వహించారో డాక్టర్ జ్యోతి వివరించారు. తమ పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, సైన్స్ టెక్నాలజీ వినియోగం ద్వారా మరింత ఎక్కువ ఆదాయం ఆర్జించే మార్గాలపై శిక్షణ ఇవ్వాల్సిన వారిని ఎంపిక చేసేందుకు ఈ సర్వే జరిపినట్టు ఆమె తెలిపారు. 

 “వివిధ రకాల ఆహార, సౌందర్య ఉత్పత్తులతో సహా మొత్తం 30రకాల ఉత్పాదనలను మేం రూపొందించాం. ప్రదర్శన, శిక్షణతో కూడిన కార్యక్రమం ద్వారా మహిళలకు తగిన తర్ఫీదు ఇచ్చాం. వారిలో చాలా మంది వివిధరకాల ఉత్పత్తులను తయారు చేస్తూ ఆదాయం సంపాదిస్తున్నారు.” అని డాక్టర్ జ్యోతి చెప్పారు.

   గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ, నగర ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ఇతర ప్రాంతాల్లోను ఈ మహిళా టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి వ్యవసాధార వర్గాలకు చెందిన మహిళలకు, మహిళా సమూహాలకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మహిళా టెక్నాలజీ పార్కులను అమలు చేశారు. తగిన సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులను అమలులోకి తేవడం, సమర్థవంతమైవిగా రుజువైన సాంకేతిక పరిజ్ఞానాలను బదిలీ చేయడం, జీవనోపాధి కల్పనా వ్యవస్థకు ఉపయుక్తమైన సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించడం వంటి కార్యకలాపాలను చేపట్టేందుకు ఈ కేంద్రాలు దోహదపడుతున్నాయి. మహిళా గ్రూపులు తమ పనిప్రదేశంలో అమలు చేయదగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పర్యవేక్షక సంస్థలకు చెందిన శాస్త్రవేత్తల, సాంకేతిక పరిజ్ఞాన నిపుణులు సిఫార్సు చేయడానికి వీలైన వాతావరణాన్ని కూడా ఈ శిక్షణాకేంద్రాలు ఏర్పాటు చేస్తాయి. వ్యర్థకాగితాలను ముక్కలు చేసే మెషీన్లను వినియోగించడం, రీసైక్లింగ్.లో కొన్ని ఎంపికచేసిన ఈ-వ్యర్థాల భాగాల వినియోగం, సి.ఎన్.సి. హాట్ వైర్ కట్టర్, త్రీడీ చాకొలేట్ ప్రింటింగ్ మెషీన్ వినియోగం తదితర నైపుణ్యాల్లో మహిళలకు శిక్షణ అందిస్తున్నారు. సులభంగా పాడైపోయే వివిధ రకాల పంటలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, గుడ్లు, చేపలు, వర్జిన్ కోకనట్ ఆయిల్, కోకనట్ వెనిగర్, కొబ్బరి చాపలు, మూళికా సౌందర్య ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలను నిల్వఉంచే పదార్థాలు, చీజ్, పాల ఆధారిత పానీయాలు, మాంసం, చేపలతో తయారీ చేసే చిరుతిండ్లు వంటి ఉత్పాదనలకోసం లఘు పరిశ్రమల స్థాయి ప్రాసెసింగ్ ప్రక్రియకు సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడా ఈ శిక్షణలో అందిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వివిధ ఉత్పాదనలకు విలువను జోడించే ఈ శిక్షణా కార్యక్రమాలతో వివిధ వస్తువులపై ఆదాయం పెరగడమే కాకుండా, ఆయా వస్తువుల, ఉత్పాదనల మన్నిక కూడా పెరుగుతుంది.

   మహిళా టెక్నాలజీ పార్కుల ద్వారా శిక్షణ పొందే మహిళలు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి,..సూక్ష్మ స్థాయిలో సొంత సంస్థలను ఏర్పాటు చేసుకుని, ఆర్థికపరంగా స్వావలంబన సాధించవచ్చు.  గ్రామీణ మహిళలు తాము తయారు చేసే ఉత్పాదనలకు తగిన మార్కెట్ సదుపాయాలు కల్పించడంలో  మహిళా టెక్నాలజీ పార్కులు ఎంతో కృషి చేస్తాయి. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్), జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వంటి సంస్థలతో అనుసంధానం ఏర్పాటు చేసి, జిల్లాస్థాయిలో, గ్రామ పంచాయతీ స్థాయి కార్యక్రమాలతో రాష్ట్ర గామీణ జీవనోపాధి పథకం వంటి ప్రభుత్వ కార్యక్రమాలతో సంబంధబాంధవ్యాలు కల్పించడంలో కూడా మహిళా టెక్నాలజీ పార్కులు కీలకపాత్ర పోషిస్తాయి.

  మహిళా సాధికారత కల్పనలో మహిళా టెక్నాలజీ పార్కు అందచేస్తున్న సేవలను ఇటీవల మహిళా సాధికారితా పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో ఎంతగానో ప్రశంసించింది. “ప్రభుత్వ అజమాయిషీలో ఏర్పాటైన మహిళా టెక్నాలజీ పార్కులు గ్రామీణ పేదలకు గొప్ప వరాలుగా పరిణమించబోతున్నాయి. వివిధ ప్రాజెక్టుల ఫలితాలపై సమాచారాన్ని, టెక్నాలజీల బదిలీని పరిశీలించినపుడు, మహిళా టెక్నాలజీ పార్కులు గ్రామీణ మహిళల జీవన ప్రమాణాలను పూర్తిగా మెరుగుపరచగలవని నమ్మకం కలుగుతోంది. అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని, పరిజ్ఞానాన్ని ఇవి మహిళలకు అందిస్తూ వస్తున్నాయి.” అని పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో అభినందించింది.

   గత ఐదేళ్లలో ఈ పథకం ద్వారా, దాదాపు పదివేల మంది గ్రామీణ మహిళలు ప్రయోజనం పొందారు. ఇప్పటి వరకూ, 28 మహిళా టెక్నాలజీ పార్కుల ఏర్పాటు విజయవంతంగా పూర్తయింది. వీటిలో కొన్ని తమంతట తాముగా నిలదొక్కుకుంటున్నాయి. 12 మహిళా టెక్నాలజీ పార్కులను దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పార్కులను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం సంకల్పించింది. దీనితో సమాజ స్థాయిలో స్వావలంబనతో కూడిన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో మహిళా టెక్నాలజీ పార్కులు ఎంతో గొప్ప పాత్రను పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

https://ci3.googleusercontent.com/proxy/mlEC-5sn_gDWljDUzAriMaiKA2Q1c3FiAyWdNecw1zpvBRX_NLp9gKy95bsC7Yy2_zBcuPm21QZd8cD_x3HAFOYDtDgme5-ay91_cY1Z_gRATAB44ZSzDOOb6g=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0015KMZ.jpg

https://ci5.googleusercontent.com/proxy/b7YtM1_3UQmc_h4lfl1g3n9yTU73Hvgum7te-WadZE287Q12JrMPYXQbXPlI7kfAZlSyzev8X6nzd0jWiY3YF1jGj4Zk0lOm3cUpuzopTCCxGHMLYP_rb9bkLw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00269YP.jpg

https://ci3.googleusercontent.com/proxy/3JhsLJcOnTh32o3ASMbj2RxovQZ82EJszZRvW_V9IZCX1-b0AA8mLKZ2Z7qIrgN8MpfRok_yv7SH9jyWcELoXg5OC4VvrgxmPVhWWviYibB1iaPDbR-5f6SToA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030VMT.jpg

 

******************


(Release ID: 1703194) Visitor Counter : 237