భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

లక్షద్వీప్‌, పుదుచ్చేరిలో 'సముద్ర ప్రాదేశిక ప్రణాళిక' నిర్వహణకు భారత్‌, నార్వే అంగీకారం

Posted On: 03 MAR 2021 12:01PM by PIB Hyderabad

వచ్చే ఐదేళ్లపాటు, సముద్ర రంగంలో 'సముద్ర ప్రాదేశిక ప్రణాళిక' (ఎంఎస్‌పీ)లో కలిసి పని చేయడానికి భారత్‌, నార్వే అంగీకరించాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల ప్రతినిధులతో కూడిన 'ప్రాజెక్టు క్రియాశీలక సంఘం' తొలి సమావేశం ఇటీవలే వర్చువల్‌ పద్ధతిలో జరిగింది. ఇంధనం, రవాణా, మత్స్య, ఆక్వా, పర్యాటకం వంటివాటికి సంబంధించి సముద్ర రంగంలో చేపట్టే మానవ కార్యకలాపాలు సమర్థవంతంగా, సురక్షితంగా, స్థిరంగా సాగేలా రెండు దేశాలు ప్రణాళిక రూపొందించాయి. రెండు దేశాల మధ్య 2019లో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కింద చేపట్టిన 'ఇండో-నార్వే సమీకృత సముద్ర కార్యక్రమం'లో ఇది ఒక భాగం. ఈ ప్రాజెక్టు కోసం నమూనా ప్రాంతాలుగా లక్షద్వీప్‌, పుదుచ్చేరిని ఎంచుకున్నారు.
    
    తీర ప్రాంతాల్లో ఆధునిక ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం సముద్ర వనరుల స్థిర వినియోగానికి మద్దతు పెంచాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఈ కార్యక్రమానికి 'సముద్ర ప్రాదేశిక ప్రణాళిక'గా పేరు ఖరారు చేశాయి. మన దేశం కోసం, జాతీయ తీర పరిశోధన కేంద్రం (ఎన్‌సీసీఆర్‌) ద్వారా కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ దీనిని అమలు చేస్తుంది. ప్రాథమిక దశలో, పుదుచ్చేరి, లక్షద్వీప్‌ కోసం సముద్ర ప్రాదేశిక ప్రణాళిక విధానాన్ని ఎన్‌సీసీఆర్‌ రూపొందిస్తుంది. విభిన్న రంగాల్లో అభివృద్ధికి (పరిశ్రమలు, మత్స్య, పర్యాటకం వంటివి) ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేకమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాలను నమూనాలుగా ఎంచుకున్నారు. అధ్యయనాలు, పరిశోధనల కోసం ఏడాదికి రూ.8-10 కోట్లను భారత ప్రభుత్వం ప్రాథమిక పెట్టుబడిగా అందిస్తుందని అంచనా. ఇక్కడ అమలు చేసిన ప్రణాళికను భవిష్యత్తులో దేశంలోని ఇతర ప్రాంతాలకూ వర్తింపజేస్తారు. ప్రపంచ బ్యాంకు, ఐరాస పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) కూడా ఎంఎస్‌పీ అమలుకు భారత ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు ఆసక్తి కనబరిచాయి.

    నార్వే విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా భారత భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ, నార్వేజియన్‌ పర్యావరణ ఏజెన్సీ కలిసి ఎంఎస్‌పీని అమలు చేస్తాయి. ఇంతకముందు, చెన్నై, గోవా, గల్ఫ్‌ ఆఫ్‌ కచ్‌ కోసం సముద్ర తీర నిర్వహణ ప్రణాళికలను ఎన్‌సీసీఆర్‌ రూపొందించగా, అవి విజయవంతమయ్యాయి. ఇప్పుడు, దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న తీర ప్రాంతాల్లోని వివిధ ఆర్థిక రంగాలు, సంబంధిత వర్గాల అభివృద్ధికి ఎంఎస్‌పీ సాయం చేస్తుంది.

    భూ శాస్త్ర మంత్రిత్వ శాఖతోపాటు; పర్యావణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ; విదేశీ వ్యవహారాల శాఖ; సముద్రయాన శాఖ; వర్తకం, పరిశ్రమలు, మత్స్య శాఖ; మత్స్య, పశు సంవర్దక, పాడి పరిశ్రమల శాఖ; పర్యాటక శాఖ; తమిళనాడు, లక్షద్వీప్‌ ప్రభుత్వాలు 'ప్రాజెక్టు క్రియాశీలక సంఘం' తొలి సమావేశంలో పాల్గొన్నాయి.

    దేశాభివృద్ధికి ఉన్న పది కోణాల్లో సముద్ర రంగ ఆర్థిక వ్యవస్థ ఒకటిగా '2030 నాటికి నవ భారతదేశం' కార్యక్రమం పేర్కొంటోంది. సుస్థిర, సమగ్ర సముద్ర రంగ నిర్వహణకు ఎంఎస్‌పీని ఒక సాధనంగా ప్రపంచం ఇప్పటికే గుర్తించింది. కేంద్ర భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ రూపొందించిన భారతదేశ సముద్ర రంగ ఆర్థిక విధానం (ముసాయిదా)లోనూ ఇది ఒక ముఖ్యాంశం.

 

****



(Release ID: 1702221) Visitor Counter : 233