వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఫిక్కీ ఉన్నత విద్య సదస్సులో ప్రసంగించిన శ్రీ పియూష్ గోయల్
జాతీయ విద్యా విధానం భారతదేశాన్ని ప్రపంచ జ్ఞాన రాజధానిగా మారుస్తుందన్న గోయల్
Posted On:
26 FEB 2021 2:02PM by PIB Hyderabad
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, నైపుణ్య అభివృద్ధిలపై దృష్టి సారించిందని రైల్వే, వాణిజ్య, పరిశ్రమ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్ అన్నారు. ఫిక్కీ ఉన్నత విద్యా సదస్సులో ప్రసంగించిన ఆయన జాతీయ విద్యా విధానం మన పిల్లలకు విద్యను అందించే విధానాన్నే మారుస్తుందని అన్నారు. విద్య, జ్ఞానాన్ని విస్తరించాలనే తపన మన భారతావనిని ప్రపంచ జ్ఞాన మూలధనంగా మార్చేందుకు.. కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. ఎన్ఈపీ దేశంలో ప్రతి బిడ్డకు సమ నాణ్యత కలిగిన విద్యను పొందే హక్కు కల్పిస్తుంది.. ఇది మాకు ఎంతో గర్వకారణంగా అనిపిస్తోందని శ్రీ గోయల్ వివరించారు. విజ్ఞానం అనేది ఇతరులతో పంచుకుంటే అద్భుత నిధిగా ఉంటుందని.. అలా ఉపయోగించకుండా పోతే అది క్రమంగా క్షీణించి కనుమరుగవుతుంది అని అన్నారు. మన జీవితంలో ప్రతి క్షణం కొత్త అంశాలను నేర్చుకోవడానికి, మన జ్ఞానాన్ని పెంచడానికి, మనకున్న జ్ఞానాన్ని సమాజంలోని ఇతరులతో పంచుకోవడానికేనని అన్నారు. ఈ కొత్త విద్యా విధానం మన విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాలలో మరింత సృజనాత్మకంగా మారేందుకు వీలు కల్పిస్తుందని మంత్రి చెప్పారు. విస్తృతమైన సంప్రదింపుల తరువాత ఈ విధానాన్ని రూపొందించామని, అందువల్ల విస్తృతంగా ఆమోదించబడిందని ఆయన అన్నారు. వ్యక్తిత్వపు వికాసంపై తగిన దృష్టి సారిస్తూనే బాధ్యతలు, నైతిక శాస్త్రాలను నేర్పి మేటి పౌరులుగా మారడానికి, వారిలో జాతీయత యొక్క స్ఫూర్తిని పెంపొందించడం, పఠన అలవాటును పెంపొందించేలా ఈ విద్యా విధానం పిల్లలకు విద్యను అందించే విధానాన్ని పునర్నిర్వచించగలదని మంత్రి అన్నారు. ఐఐటీలు, ఐఐఎంలు కాకుండా ఇతర సంస్థలలో ఉన్నత విద్యాభ్యాసం కోసం అభివృద్ధి చెందిన దేశాల విద్యార్థులు వచ్చే స్థాయికి భారతీయ విద్యా వ్యవస్థ చేరుకోవాలని ఆయన అన్నారు. సమిష్టిగా ఉంటే ఈ దేశం అద్భుతాలు చేయగలదని తెలిపారు. విద్యా రంగంలో ప్రజలను ఏకత్వంతో కలిసి పనిచేస్తూ ప్రపంచంలోని 7 వందల కోట్ల పౌరులకు రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో, భవిష్యత్తును ఎదుర్కోవటానికి, పేదరిక నిర్మూలనకు మన పాఠశాలలు మరియు ఉపాధ్యాయుల అందిస్తున్న సహకారాన్ని మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. విద్య గొప్ప సమకర్త అని, ఇది అందరికీ శక్తినిస్తుందని మంత్రి అన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుందని వివరించారు.
***
(Release ID: 1701223)
Visitor Counter : 127