ప్రధాన మంత్రి కార్యాలయం

ఆర్థిక సేవల సంబంధిత బడ్జెట్ నిర్దేశాలను కట్టుదిట్టంగా అమలు చేయడంపై వెబ్‌ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

డిపాజిటర్లు.. పెట్టుబడిదారులలో నమ్మకం...పారదర్శకతకు భరోసాయే మా ప్రాథమ్యం: ప్రధానమంత్రి;

పారదర్శకత లేని రుణ సంస్కృతి నుంచి దేశాన్నివిముక్తం చేసేందుకు చర్యలు చేపట్టాం: ప్రధానమంత్రి;

ఆర్థిక సార్వజనీనత తర్వాత ఆర్థిక సాధికారత వైపుదేశం వేగంగా పురోగమిస్తోంది: ప్రధానమంత్రి

Posted On: 26 FEB 2021 1:55PM by PIB Hyderabad

ఆర్థిక సేవలకు సంబంధించిన బడ్జెట్ నిర్దేశాలను కట్టుదిట్టంగా అమలు చేయడంపై నిర్వహించిన వెబ్‌ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు.

   ప్రభుత్వరంగ సంస్థల బలోపేతం, ప్రైవేట్‌ రంగం భాగస్వామ్య విస్తరణ ఎలా చేపట్టాలన్నదానిపై స్పష్టమైన మార్గప్రణాళికను కేంద్ర బడ్జెట్‌ నిర్దేశించిందని ఈ సదస్సులో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ ఆర్థిక రంగంపై ప్రభుత్వ దృష్టికోణం సుస్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. అటు పెట్టుబడిదారులు, ఇటు డిపాజిటర్లలో నమ్మకం, పారదర్శకతకు భరోసా ఇవ్వడమే తమ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. ఆ మేరకు బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర రంగాల్లో పాత విధానాలు, వ్యవస్థలు మార్చబడుతున్నాయన్నారు.

   చురుకైన రుణ విధానం పేరిట దేశంలో 10-12 ఏళ్లకు పూర్వమే బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాలకు తీవ్ర హాని వాటిల్లిందని ప్రధానమంత్రి చెప్పారు. పారదర్శకత లేని ఈ రుణ సంస్కృతినుంచి దేశ విముక్తికి ఒకదాని తర్వాత మరొకటిగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిరర్ధక ఆస్తులను అటకెక్కించే పద్ధతికి బదులుగా నేడు ఒకరోజు నిరర్ధక ఆస్తిని కూడా నివేదించడం తప్పనిసరి చేయబడిందని ఆయన వివరించారు.

   వ్యాపారంలో అనిశ్చిత పరిస్థితులు ప్రభుత్వానికి తెలుసునని, ప్రతి వ్యాపార నిర్ణయం వెనుక దురుద్దేశాలు ఉండవని గుర్తిస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పష్టమైన అవగాహనతో తీసుకున్న వ్యాపార నిర్ణయాలకు మద్దతునివ్వడం ప్రభుత్వ బాధ్యతని చెప్పారు. ఇప్పుడు ఇదే ప్రక్రియ నడుస్తున్నదని, ఇకముందు కూడా కొనసాగుతుందని తెలిపారు. తదనుగుణంగా ‘ఆర్థిక అశక్తత, దివాలా స్మృతి’ అటు రుణదాతలకు, ఇటు రుణగ్రహీతలకు భరోసా ఇస్తున్నదని పేర్కొన్నారు.

  ఈ సందర్భంగా సామాన్య పౌరుల ఆదాయ పరిరక్షణ, పేదలకు ప్రభుత్వ ప్రయోజనాలు సమర్థంగా, అవినీతిరహితంగా చేరవేయడం, దేశాభివృద్ధి కోసం మౌలిక వసతులలో పెట్టుబడులకు ప్రోత్సాహం తదితర ప్రభుత్వ ప్రాథమ్యాల జాబితాను ప్రధానమంత్రి వివరించారు. కొన్నేళ్లుగా ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలన్నీ ఈ ప్రాథమ్యాలను ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. భారత ఆర్థిక రంగం బలోపేతానికి ఉద్దేశించిన ఈ దార్శనికతను కేంద్ర బడ్జెట్‌ మరింత ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. ఇటీవల ప్రకటించిన నవ్య ప్రభుత్వరంగ విధానంలో ఆర్థిక రంగం కూడా ఉందని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్‌, బీమా రంగాలకు ఎంతో సామర్థ్యం ఉందన్నారు. ఈ అవకాశాల దృష్ట్యా అనేక వినూత్న చర్యలను ఈ బడ్జెట్‌లో ప్రకటించినట్లు పేర్కొన్నారు. రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి 74 శాతానికి పెంపు, జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి)లో వాటాల బహిరంగ విక్రయం వగైరాలు ఇందులో భాగంగా ఉన్నాయన్నారు.

   వీలైన ప్రతిచోటా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తున్నామని, అయినప్పటికీ బ్యాంకింగ్, బీమా రంగాల్లో ప్రభుత్వరంగ సంస్థల సమర్థ భాగస్వామ్యం దేశానికి ఇంకా అవసరమేనని ప్రధానమంత్రి చెప్పారు.

  ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా వాటా మూలధనం సమకూర్చడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో బ్యాంకుల నిరర్ధక ఆస్తుల పర్యవేక్షణతోపాటు నిశిత దృష్టితో రుణాల నిర్వహణ కోసం కొత్త ‘ఆస్తుల పునర్నిర్మాణ’ (ఏఆర్‌సీ) వ్యవస్థను సృష్టిస్తున్నట్లు చెప్పారు. ఇది ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేస్తుందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టుల దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం ఓ కొత్త ‘అభివృద్ధి ఆర్థిక సహాయ సంస్థ’ గురించి కూడా ఆయన వివరించారు. అంతేకాకుండా సార్వత్రిక సంపద నిధి, పెన్షన్‌ నిధి తదితరాలతోపాటు మౌలిక సదుపాయాల రంగంలో బీమా కంపెనీల పెట్టుబడులను ప్రోత్సహించడం గురించి కూడా శ్రీ మోదీ ప్రస్తావించారు.

  పెద్ద పరిశ్రమలు, నగరాలతో మాత్రమే స్వయం సమృద్ధ భారతం సిద్ధించబోదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సామాన్య ప్రజానీకం, చిన్న వ్యాపారవేత్తల కఠోర కృషితో స్వయం సమృద్ధ భారతం గ్రామాల్లోనే రూపుదాల్చగలదని చెప్పారు. అలాగే రైతులు, మెరుగైన వ్యవసాయ ఉత్పత్తుల తయారీ యూనిట్లే స్వయం సమృద్ధ భారతాన్ని సాకారం చేస్తాయన్నారు. మన సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లు, అంకుర సంస్థలతోనే స్వయం సమృద్ధ భారతం నిర్మితం కాగలదన్నారు. అందుకే కరోనా సమయంలో ‘ఎంఎస్‌ఎంఈ’ల కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని గుర్తుచేశారు. ఈ సానుకూలతను సద్వినియోగం చేసుకుంటూ దేశంలోని సుమారు 90 లక్షల సంస్థలు రూ.2.4 లక్షల కోట్ల రుణాలు పొందాయన్నారు. ఈ చర్యల్లో భాగంగా ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టడమేగాక వ్యవసాయం, బొగ్గు, అంతరిక్షం వంటి రంగాల్లో ‘ఎంఎస్‌ఎంఈ’లకు అవకాశాలు కల్పించిందన్నారు.

  మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరిగేకొద్దీ రుణప్రవాహంలోనూ వేగవంతమైన పెరుగుదల ప్రారంభం కావడం కూడా అంతే ముఖ్యమని ప్రధానమంత్రి చెప్పారు. కొత్త అంకుర సంస్థల కోసం, ఈ రంగంలో తమకుగల ప్రతి అవకాశాన్నీ అన్వేషించడం కోసం సరికొత్త ఆర్థిక ఉత్పత్తుల సృష్టిలో దేశంలోని ఆర్థిక-సాంకేతిక అంకుర సంస్థలు అద్భుతంగా కృషి చేస్తున్నాయని ఆయన కొనియాడారు. ఆ మేరకు కరోనా సమయంలో అనేక అంకుర సంస్థల ఒప్పందాలలో ఆర్థిక-సాంకేతిక అంకుర సంస్థలకు అత్యధిక భాగస్వామ్యం ఉందన్నారు. భారతదేశంలో ఆర్థిక రంగానికి మరింత ఊపు లభించనుందన్న నిపుణుల అంచనాలున ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

  దేశ ఆర్థిక సార్వజనీనతలో సాంకేతిక పరిజ్ఞాన సద్వినియోగంసహా కొత్త వ్యవస్థల సృష్టి కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా నేడు 130 కోట్ల మందికి ఆధార్ కార్డు, 41 కోట్ల మందికిపైగా పౌరులకు జన్‌ధన్‌ ఖాతా ఉన్నాయని ఆయన వివరించారు. ఈ జన్‌ధన్‌ ఖాతాల్లో 55 శాతం మహిళలకు చెందినవి కాగా, ఆ ఖాతాల్లో రూ.లక్షన్నర కోట్లు జమ అయ్యాయని చెప్పారు. ఇక ఒక్క ‘ముద్ర’ పథకంతో చిన్న పారిశ్రామికవేత్తలకు దాదాపు రూ.15 లక్షల కోట్లదాకా రుణాలు అందాయని తెలిపారు. వీరిలోనూ మహిళలు 70 శాతం కాగా, 50 శాతానికిపైగా దళిత, అణగారిన, గిరిజన, వెనుకబడిన వర్గాలవారున్నారని పేర్కొన్నారు.

  ఇక ‘పీఎం-కిసాన్‌ స్వానిధి పథకం’ కింద దాదాపు 11 కోట్ల రైతు కుటుంబాలకు రూ.1.15 లక్షల కోట్లు అందగా, ఈ సొమ్ము నేరుగా వారి ఖాతాల్లో జమ అయిందని ప్రధానమంత్రి తెలిపారు. మరోవైపు వీధి వర్తకులకోసం ప్రవేశపెట్టిన ‘పీఎం-‌స్వానిధి’ వారిని తొలిసారి ఆర్థిక సార్వజనీనత పరిధిలోకి తెచ్చిందన్నారు. ఈ మేరకు తలా రూ.10వేల వంతున సుమారు 15 లక్షల మంది వర్తకులకు రుణం మంజూరైనట్లు చెప్పారు. అలాగే ‘ట్రెడ్స్‌, పీఎస్‌బీ డిజిటల్‌ రుణ వేదిక’లు ఎంఎస్‌ఎంఈలకు సులభ రుణాలను అందుబాటులోకి తెచ్చాయన్నారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డులతో చిన్న రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు వడ్డీ వ్యాపారుల కోరలనుంచి విముక్తి పొందారని పేర్కొన్నారు. ఈ వర్గాలవారి కోసం వినూత్న ఆర్థిక ఉత్పత్తులను సృష్టించాల్సిందిగా ఆర్థిక రంగానికి ప్రధానమంత్రి సూచించారు. మరోవైపు ‘స్వయం సహాయ బృందాలు’ (ఎస్‌హెచ్‌జి)ల సామర్థ్యం సేవల నుంచి తయారీ రంగానికి విస్తరించిందని, వారి ద్రవ్య క్రమశిక్షణ గ్రామీణ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులకు ఈ సంఘాలు అనువైన మార్గం కాగలవన్నారు. ఇది కేవలం సంక్షేమానికి సంబంధించిన అంశం కాదని, ఇదొక గొప్ప వ్యాపార నమూనా అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

  ఆర్థిక సార్వజనీనత అనంతరం ఆర్థిక సాధికారతవైపు దేశం వేగంగా పయనిస్తున్నదని ప్రధాని చెప్పారు. భారతదేశంలో రానున్న ఐదేళ్లలోనే ఆర్థిక-సాంకేతికత మార్కెట్‌ రూ.6 లక్షల కోట్ల స్థాయికి చేరగలదన్న అంచనాల నేపథ్యంలో ‘(IFSC) ఐఎఫ్‌ఎస్‌సి గిఫ్ట్‌ (GIFT) సిటీ’లో ప్రపంచ స్థాయి ఆర్థిక కూడలి నిర్మాణంలో ఉందన్నారు. భారతదేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన మన ఆకాంక్ష మాత్రమే కాదని, స్వయం సమృద్ధ భారతం కోసం ఇదెంతో అవసరమని ఆయన చెప్పారు. అందుకే ఈ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలకు సంబంధించి సాహసోపేత లక్ష్యాలను నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ఈ లక్ష్యాల సాధనలో పెట్టుబడుల ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. ఆ మేరకు పెట్టుబడులను సమకూర్చే దిశగా అన్నివిధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక రంగం మొత్తం చురుగ్గా మద్దతిస్తేనే ఈ లక్ష్యాలను చేరగలమని ఆయన స్పష్టం చేశారు. మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా బ్యాంకింగ్‌ రంగాన్ని శక్తిమంతం చేయడంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఆ మేరకు ఇప్పటిదాకా బ్యాంకింగ్‌ సంస్కరణలు చేపట్టిందని, అవి ఇంకా కొనసాగుతాయని ప్రకటించారు.

***



(Release ID: 1701221) Visitor Counter : 127