ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

మాతృభాషలో ప్రాథమిక విద్య పిల్లల్లో ఆత్మగౌరవాన్ని, సృజనాత్మకతను పెంచుతుంది - ఉపరాష్ట్రపతి

• మాతృభాష పునరుత్థానం, పురోగతి కోసం ఐదు కీలక అంశాలను సూచించిన ఉపరాష్ట్రపతి

• ప్రజల భాషే పరిపాలన భాష కావాలి

• ఉన్నతమైన భాషా వారసత్వాన్ని కాపాడుకోవాలి

• బహు భాషా సిద్ధాంతం జాతీయ ఐక్యతను బలోపేతం చేస్తుంది

• ‘అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం’ సందర్భంగా అంతర్జాల సదస్సును ప్రారంభించి, ప్రసంగించిన ఉపరాష్ట్రపతి

Posted On: 21 FEB 2021 2:51PM by PIB Hyderabad

ప్రాథమిక స్థాయిలో బోధనా మాధ్యమంగా మాతృభాషకు ప్రాధాన్యత పెంచాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు  పిలుపునిచ్చారు. ఇంట్లో పెద్దలు మాట్లాడుకోని భాషలో ప్రాథమిక దశలో విద్యను నేర్చుకోవడం పిల్లల ఉన్నతికి అవరోధంగా మారుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ అధ్యయనాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రాథమిక దశలో మాతృభాషలో సాగే విద్యాబోధన పిల్లల్లో ఆత్మగౌరవాన్ని పెంచుతుందని, వారిలో సృజనాత్మకతకు బాటలు వేస్తుందన్నారు. దూరదృష్టితో తయారు చేసిన ప్రగతిశీల విధానంగా నూతన విద్యా విధానాన్ని అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, అక్షరాలను మాత్రమే గాక, మన సంస్కృతి ఆత్మను విద్యార్థులకు తెలియజేసేలా ఉందని అభిప్రాయపడ్డారు. 

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అంతర్జాల సదస్సును ప్రారంభిస్తూ, ప్రసంగించిన ఉపరాష్ట్రపతి, మాతృభాషను ప్రోత్సహించేందుకు ఐదు కీలక అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రాథమిక విద్యలో మాతృభాష వినియోగం గురించి నొక్కి చెప్పడమే కాకుండా, పరిపాలనలో, న్యాయస్థాన కార్యకలాపాల్లో స్థానిక భాషలను వినియోగించడం, వాటిల్లో తీర్పులు ఇవ్వడం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. ఉన్నత మరియు సాంకేతిక విద్యలో స్వదేశీ భాషల వాడకం క్రమంగా పెరగాలని సూచించిన ఆయన, ప్రతి ఒక్కరూ ఇళ్ళలో గర్వంగా తమ మాతృభాషలో సంభాషించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. 

వందలాది భాషల సహజీవనంతో కూడిన భాషా వైవిధ్యం మన ప్రాచీన నాగరికత మూల స్తంభాల్లో ఒకటన్న ఉపరాష్ట్రపతి, మాతృభాషలు ప్రజల్లో భావోద్వేగ ప్రతిస్పందనను రేకెత్తిస్తాయని తెలిపారు. మన సృజనాత్మక ఆలోచనలు, భావ వ్యక్తీకరణకు భాషే కీలకమన్న ఆయన, మాతృభాషల్ని రక్షించుకోవడం, ప్రోత్సహించుకోవలసిన అవసరం ఉందని తెలిపారు. 

పాలనలో మాతృభాష ప్రాధాన్యతను ఉద్ఘాటించిన ఉపరాష్ట్రపతి, ముఖ్యంగా రాష్ట్ర మరియు స్థానిక స్థాయిలో మాతృభాష వాడకాన్ని పెంచాలని సూచించారు. సమగ్ర పాలన నమూనాను సమర్థిస్తూ, ప్రజలు అర్థం చేసుకునే భాషలో సాధారణ ప్రజలకు వివిధ అంశాలను తెలియజేయడం ద్వారా, వారిని పాలనలో, అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములం చేయగలమని, పరిపాలన భాష ప్రజల భాష కావాలని తెలిపారు. భాష విషయంలో ఉన్నత స్థాయిలో మార్పులు రావాలని సూచించిన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులు 22 మాతృభాషల్లో మాట్లాడేందుకు అవకాశం కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. 

ఈ కార్యక్రమానికి ముందు హైదరాబాద్ ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి, ఉన్నత విద్యలో సైతం మాతృభాషను వినియోగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సామాన్యులకు అర్థమయ్యే భాషలో న్యాయస్థానాల్లో మాతృభాష వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. 

కొన్ని భాషలు అంతరించిపోయే స్థితిలో ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ప్రపంచీకరణ మరియు సజాతీయీకరణల వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ప్రతి రెండు వారాలకు ఒక భాష అంతరించిపోతోందన్న ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను గుర్తు చేశారు. అంతరించిపోతున్న వాటిలో ప్రపంచంలో అత్యధికంగా 196 భాషలు భారతదేశానివే అని తెలిపారు. అంతరించి పోతున్న భాషల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అంతరించిపోతున్న భాషల పరిరక్షణ మరియు సంరక్షణ పథకాన్ని (ఎస్.పి.పి.ఈ.ఎల్) ను ఉపరాష్ట్రపతి అభినందించారు.

బహుభాషా విధానం ప్రాముఖ్యత గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రతి ఒక్కరూ మాతృభాషలో బలమైన పునాదిని ఏర్పరచుకోవడంతో పాటు, సాధ్యమైనన్ని ఎక్కువ భాషలను నేర్చుకోవాలని సూచించారు. పిల్లలకు వారి మాతృభాషలో నైపుణ్యాన్ని పెంపొందించడమే గాక, ప్రపంచ భాషలు నేర్చుకునే దిశగా ప్రోత్సాహం అందించాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలకు పిలుపునిచ్చారు. ఇలాంటి భాషా నైపుణ్యాలు పిల్లల్లో ఉన్నత అభిజ్ఞా వికాసానికి మార్గం సుగమం చేస్తాయన్న వివిధ అధ్యయనాలను ఉపరాష్ట్రపతి ఉదహరించారు. 

ఇతర భాషలను నేర్చుకునే ప్రక్రియ ద్వారా సాంస్కృతిక వంతెనలు నిర్మించడం మరియు అనుభవాల నవ్య ప్రపంచం దిశగా మార్గాన్ని సుగమం చేయడానికి సహాయపడుతుందన్న ఉపరాష్ట్రపతి, ఒకరికొకరు భాషలపై ఆరోగ్యకరమైన గౌరవం మరియు ఆసక్తితో జాతీయ ఐక్యతను పెంపొందించుకోవచ్చని, తద్వారా ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తి ఆవిష్కృతమౌతుందని అభిప్రాయపడ్డారు.  

ఈ సందర్భంగా బహుభాషా సమాజం కోసం ప్రభుత్వం చొరవ తీసుకుని ఏర్పాటు చేస్తున్న జాతీయ అనువాద మిషన్, భారత్ వాణి ప్రాజెక్టు, భారతీయ భాషా విశ్వవిద్యాలయం (బి.బి.వి), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ లేషన్ అండ్ ఇంటర్ ప్రిటేషన్ (ఐ.ఐ.టి.టి) వంటి కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. 

భాషలు వాడుకలో ఉండడం ద్వారానే భాషాభివృద్ధి జరుగుతుందని, ప్రతిరోజునూ మాతృభాషా దినోత్సవంగానే చూడాలని సూచించారు. మాతృభాష పునర్వైభవం కోసం ఇళ్ళు, ఆఫీసులు, సంఘాలు, సమావేశాలు, పరిపాలను ఎవరి మాతృభాషను వారు  గర్వంగా వినియోగించుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. 

ఈ సందర్భంగా అంతర్జాతీయ అంతర్జాల కాలిగ్రాఫి ఎగ్జిబిషన్ ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. గౌరవ విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ ఫోఖ్రియాల్, గౌరవ సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, గౌరవ విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే, ఐ.జి.ఎన్.సి.ఎ. కార్యదర్శి డా. సచ్చిదానంద జోషి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

****



(Release ID: 1699794) Visitor Counter : 699