వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

కాకినాడ డీప్ వాట‌ర్ పోర్ట్ నుండి బియ్యం రవాణా ప్రారంభం


Posted On: 14 FEB 2021 10:43AM by PIB Hyderabad

భారత దేశపు బియ్యం ఎగుమతి సామర్థ్యానికి ప్రధాన ప్రోత్సాహకంగా ఉండేలా కాకినాడ లోతైన నీటి ఓడరేవు నుండి సరుకు రవాణా కార్య‌క్ర‌మం మొద‌లైంది. ప్ర‌స్తుత యాంక‌రేజ్ పోర్ట్‌లో విఫ‌రీత‌మైన ర‌ద్దీ కార‌ణంగా బియ్యం ర‌వాణా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న కార‌ణంగా.. డీప్ వాట‌ర్ పోర్ట్‌ను ఉప‌యోగించి బియ్యం ఎగుమ‌తులు జ‌రిపేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడా) సభ్యుడు ఎగుమతిదారైన‌ మెస్స‌ర్స్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఛత్తీస్‌గ‌ఢ్‌లో ఉత్పత్తి, మూలం మరియు ప్రాసెస్ చేయబడింది) కాకినాడ లోతైన నీటి ఓడరేవు నుండి శుక్ర‌వారం (12 ఫిబ్ర‌వ‌రి, 2021) బియ్యాన్ని రవాణా చేసింది. కాకినాడ నౌకాశ్రయంలో ఏర్పాటు చేసిన ఈ బియ్యం ఎగుమ‌తి ప్రారంభ కార్య‌క్ర‌మంలో అపెడా చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ డి మురళీధర్ రెడ్డి, తూర్పు గోదావరి జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీషా, కాకినాడ సీ పోర్ట్ సీఈఓ శ్రీ ఎం.మురళీధర్‌తో పాటు అపెడా జనరల్ మేనేజర్ ఎస్ఎస్ నయ్యర్, మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమతి వినితా సుధాన్షు, డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ & ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ అధికారులు, పోర్ట్ ఆఫీసర్, పీక్యూ అధికారి, వాణిజ్య మరియు కార్మిక విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో బియ్యం ఎగుమతులు నమోదు చేసి పర్యవేక్షించే అపెడా సంస్థ బియ్యం ఎగుమతిదారులు కాకినాడ డీప్ వాటర్ పోర్టును స‌రుకు ఎగుమ‌తికి ఉపయోగించుకునేలా అనుమతినివ్వాల‌ని ప్రభుత్వాన్ని కోరింది. ఆంధ్ర ప్రదేశ్ మారిటైమ్ బోర్డు నియంత్రణలోని కాకినాడ డీప్-వాటర్ పోర్టును రైస్ ఎగుమ‌తికి

ఉపయోగంలోకి తేవ‌డం భారతదేశ బియ్యం ఎగుమతి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. కాకినాడలోని ప్ర‌స్తుత‌ యాంకరేజ్ నౌకాశ్రయం రద్దీ సమస్య ఎదుర్కొంటోంది ముఖ్యంగా బియ్యం ర‌వాణా కార‌ణంగా ఈ స‌మ‌స్య మ‌రింత‌గా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) భారతదేశం నుండి బియ్యం ఎగుమ‌తుల‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాకినాడలో ఉన్న‌ రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ కూడా బియ్యం ఎగుమ‌తుల‌కు త‌గిన అనుమ‌తులు ఇవ్వాల‌ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్య‌ర్ధించాయి. ప్ర‌స్తుత (2020-21) ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాలలో భారతదేశం ధాన్యాల ఎగుమతులు - బియ్యం, గోధుమ, ముతక తృణధాన్యాల ఎగుమ‌తుల్లో మేటి వృద్ధిని న‌మోదు చేశాయి. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం  ఏప్రిల్-డిసెంబర్ మధ్య అందుబాటులో ఉన్న స‌మాచారం ప్రకారం, తృణధాన్యాల ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.32,591 కోట్ల (4581 US $ మిలియన్) నుండి రూ.49,832 కోట్ల రూపాయలకు పెరిగాయి. తృణ ధాన్యాల ఎగుమతులు రూపాయిల‌ విలువతో పోలిస్తే ‌52.90 శాతం, అమెరికా డాలర్‌తో పోలిస్తే 45.81 శాతం మేర పెరిగాయి.

అపెడా షెడ్యూల్ చేసిన ఉత్పత్తుల మొత్తం ఎగుమతిలో ధాన్యపు ఎగుమతుల విలువ మొత్తం వాటా రూపాయి విలువ పరంగా 48.61 శాతంగా నిలిచింది. అందుబాటులోని స‌మాచారం మేర‌కు 2020 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో బాస్మతి బియ్యం ఎగుమతి రూ.22,038 కోట్ల‌కు (2947 US $ మిలియన్లు) చేరింది. గ‌త ఏడాది ఇదే కాలంలో బాస్మ‌తి బియ్యం ఎగుమ‌తులు రూ.20,926 కోట్లుగా (2936 US $ మిలియన్లు) నమోదయ్యాయి. సుగంధ మరియు పొడువు- బియ్యం ఎగుమతులు రూపాయి పరంగా 5.31 శాతం మేర డాలర్ల ప‌రంగా చూస్తే 0.36 శాతం వృద్ధిని సాధించాయి. 2020-21 ఏడాది మొదటి మూడు త్రైమాసికాలలో, బాస్మతియేతర బియ్యం రవాణా ఆకర్షణీయంగా పెరిగింది. 2020 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో బాస్మతియేతర బియ్యం ఎగుమతులు రూ.22,856 కోట్లుగా (3068 US $ మిలియన్లు) నిలిచాయి. అంత‌కు ముందు 2019 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో.. ఇవి దాదాపు రూ.10268 కోట్లుగా (1448 US $ మిలియన్లు) ఉన్నాయి. బాస్మతియేతర ఎగుమతులు రూపాయి పరంగా 122.61% మరియు డాల‌ర్ల ప‌రంగా 111.81 శాతం మేర వృద్ధిని సాధించాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆఫ్రికన్ మరియు ఆసియా దేశాల నుండి బాస్మతియేతర బియ్యం కోసం డిమాండ్ పెర‌గ‌డం ఎగుమ‌తులు పెర‌గ‌డానికి ముఖ్య కార‌ణం. అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేలా చాలా దేశాలు త‌మ వ‌ద్ద బియ్యం నిల్వలను  సృష్టించుకొనే ప్ర‌య‌త్నం చేయ‌డంతో డిమాండ్ పెరిగింది. భారతదేశం యొక్క బాస్మతియేత‌ర‌ బియ్యం ఎగుమతులకు సహాయపడిన మరో అంశం థాయిలాండ్. భారతదేశం తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు ఈ దేశం. థాయ్‌లాండ్ గత సంవత్సరం కరువును ఎదుర్కొంది. ఇది ఉత్పత్తిని ప్రభావితం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌-19 మ‌హమ్మారి అనేక వస్తువుల సరఫరాకు అంతరాయం కలిగించింది. ఇది ఒక దశలో మ‌న బియ్యం ఎగుమతుల్లో పదునైన వృద్ధికి దారితీసింది. కోవిడ్‌-19కు సంబంధించిన‌ భద్రతా జాగ్రత్తలు తీసుకుంటూనే బియ్యం ఎగుమతులను నిర్ధారించడానికి ప్రభుత్వం అవ‌స‌ర‌మైన అన్ని సత్వర చర్యలు తీసుకుంది. దీంతో మెరుగైన ఎగుమ‌తులు న‌మోదయ్యాయి.

                                *****


(Release ID: 1697894) Visitor Counter : 277