ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి రాజ్య సభ లో ఇచ్చిన సమాధానం
Posted On:
08 FEB 2021 12:50PM by PIB Hyderabad
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు రాజ్య సభ లో సమాధానమిచ్చారు. చర్చ లో పాలుపంచుకొన్నందుకు, చర్చ లో తోడ్పాటు ను అందించినందుకు ఎగువ సభ సభ్యుల కు ఆయన ధన్యవాదాలు పలికారు. కఠినమైనటువంటి సవాళ్ళ ను ఎదుర్కొంటున్న ప్రపంచం లో రాష్ట్రపతి ప్రసంగం ఆశ ను, నమ్మకాన్ని నింపింది అని ప్రధాన మంత్రి అన్నారు.
భారతదేశం ప్రస్తుతం అవకాశాల గని గా ఉంది, ప్రపంచం దృష్టి భారతదేశం మీద ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం మీద అంచనాలు ఉన్నాయి, మన ప్రపంచం శ్రేయస్సు కు భారతదేశం తోడ్పాటు ను అందిస్తుందన్న విశ్వాసం ఉంది అని ఆయన అన్నారు. భారతదేశం స్వాతంత్య్రం సంపాదించుకొని 75వ సంవత్సరం లో అడుగుపెట్టే దశ లో మనం ఈ సందర్భాన్ని ఒక ప్రేరణాత్మక ఉత్సవం గా జరుపుకోవడానికి ప్రయత్నించాలి, 2047వ సంవత్సరం లో స్వతంత్ర భారతదేశం ఒక శతాబ్ది కాలాన్ని చేరుకొనేసరికల్లా మనం మన దార్శనికత తాలూకు ప్రతిజ్ఞల సాధన కు మనలను మనం పునరంకితం చేసుకోవాలి అని ఆయన అన్నారు.
కోవిడ్ మహమ్మారి ని సమర్ధం గా సంబాళించిన తీరు ఏ ఒక్క పార్టీ, లేదా ఏ ఒక్క వ్యక్తి సాధించిన విజయమో కాదు, అది దేశ ప్రజలు సాధించిన సాఫల్యం, దానిని ఆ రకంగానే వేడుక గా జరుపుకోవాలి అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం పోలియో, ఆటలమ్మ వంటి పెద్ద ముప్పుల ను చూసింది. భారతదేశానికి ఒక టీకామందు అందుతుందా అని గానీ, ఆ టీకామందు ను ఎంత మంది ప్రజలు వేయించుకొంటారు అని గానీ ఎవరికీ తెలియదు. ఆ కాలం నుంచి, ప్రస్తుతం మనం ప్రపంచం కోసం మన దేశం టీకా మందులను అభివృద్ధి చేస్తున్న దశ కు చేరింది, ప్రపంచం లోనే అత్యంత భారీ స్థాయి లో టీకామందు ను ఇప్పించే స్థాయి కి ఎదిగింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందన్నారు. కోవిడ్-19 కాలం మన సమాఖ్య స్వరూపానికి, సహకారాత్మక సమాఖ్య వాదం భావన కు కొత్త బలాన్ని జోడించింది అని ఆయన అన్నారు.
భారతదేశ ప్రజాస్వామ్యం పై విమర్శల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, భారతదేశ ప్రజాస్వామ్యం పాశ్చాత్య సంస్థ ఏమీ కాదు, అది ఒక మానవత్వాన్ని కలిగివున్నటువంటి సంస్థ అని పేర్కొన్నారు. భారతదేశ జాతీయవాదం పై అన్ని వైపుల నుంచి జరుగుతున్న దాడి ని గురించి దేశ ప్రజల ను అప్రమత్తం చేయవలసి ఉందని ఆయన అన్నారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మాటల ను ప్రధాన మంత్రి ఉట్టంకిస్తూ, భారతదేశ జాతీయవాదం సంకుచితమైంది కాదు, అలాగని స్వార్ధపరత్వం తో కూడుకొన్నది కాదు, అది దురాక్రమణ వాది కూడా కాదు, అది ‘సత్యం, శివం, సుందరం’ అనే సంకల్పం పైన ఆధారపడింది అన్నారు. ‘‘భారతదేశం ప్రపంచం లో అతి పెద్ద ప్రజాస్వామ్యమొక్కటే కాదు, భారతదేశం ప్రజాస్వామ్యాని కి మాతృమూర్తి గా ఉంది, అదే మన మర్యాద. మన దేశ ప్రజల వ్యక్తిత్వం ప్రజాస్వామికమైంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
కరోనా కాలం లో అనేక దేశాలు విదేశీ పెట్టుబడి ని అందుకోలేకపోయాయి, కాగా భారతదేశం రికార్డు స్థాయి పెట్టుబడి ని అందుకొంది అని శ్రీ మోదీ అన్నారు. విదేశీ కరెన్సీ, ఎఫ్‌డిఐ, ఇంటర్ నెట్ వ్యాప్తి, అన్ని వర్గాల కు ఆర్థికపరమైన సేవలు, డిజిటల్ మాధ్యమం అందుబాటు లోకి రావడం, టాయిలెట్ సౌకర్యం విస్తరించడం, తక్కువ ఖర్చు లో గృహ నిర్మాణం, ఎల్‌పిజి లభ్యత, ఉచితం గా వైద్యపరమైన చికిత్స సదుపాయం వంటి వాటిని గురించి శ్రీ మోదీ ఒక్కొటొక్కటిగా వివరించారు. సవాళ్ళు అనేవి ఉన్నాయి, మరి మనం సమస్య లో ఒక భాగం గా ఉండాలి అని కోరుకుంటున్నామా లేక పరిష్కారం లో ఒక భాగం అవ్వాలి అని కోరుకుంటున్నామా అనేది నిర్ణయించుకోవలసివుంది అని ఆయన అన్నారు.
2014వ సంవత్సరం మొదలుకొని రైతు కు సాధికారిత ను కల్పించే ధ్యేయం తో వ్యవసాయ రంగం లో మార్పుల ను ప్రభుత్వం ఆరంభించింది అని ప్రధాన మంత్రి అన్నారు. పంట బీమా పథకం లో మార్పులు చేసి, ఆ పథకాన్ని రైతుకు మరింత స్నేహపూర్వకం గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. పిఎమ్- కిసాన్ పథకాన్ని కూడా తీసుకు రావడం జరిగిందన్నారు. ప్రభుత్వం చిన్న రైతుల కోసం కృషి చేస్తోంది అని శ్రీ మోదీ నొక్కి చెప్పారు. రైతులు పిఎమ్ఎఫ్ బివై లో భాగం గా 90,000 కోట్ల రూపాయల విలువైన క్లెయిమును అందుకొన్నారని ఆయన తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు, భూమి స్వస్థత కార్డు, సమ్మాన్ నిధి ల తాలూకు ప్రయోజనాల ను కూడా రైతులు పొందారు అని ఆయన అన్నారు. పిఎమ్ గ్రామీణ్ సడక్ యోజన లో భాగం గా రహదారి సంధానం మెరుగుపడిందా అంటే అప్పుడు అది రైతుల ఉత్పత్తి దూర ప్రాంతాల కు చేరుకొనేందుకు వీలు కల్పిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. కిసాన్ రైల్, కిసాన్ ఉడాన్ ల వంటి ప్రయాస లు కూడా ఉన్నాయి అని ఆయన గుర్తు కు తెచ్చారు. చిన్న రైతుల జీవితాల ను మెరుగుపర్చడం తక్షణావసరం అని ప్రధాన మంత్రి అన్నారు. వారికి ప్రైవేటు రంగం తో లేదా సహకార రంగం తో కలసి పని చేసేందుకు పాడి రంగం మాదిరి గానే అదే విధమైనటువంటి స్వేచ్ఛ ఎందుకు ఉండకూడదు? అని ప్రధాన మంత్రి అడిగారు.
వ్యవసాయ సంబంధిత సమస్యల ను పరిష్కరించవలసిందే. మరి ఈ దిశ లో కృషి చేయవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. రైతుల సంక్షేమం కోసం ముందుకు రావాలి అంటూ అన్ని పక్షాల ను ప్రధాన మంత్రి ఆహ్వానించారు. కనీస మద్దతు ధర ను (ఎమ్ఎస్‌పి) గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘ఎమ్ఎస్‌పి అనేది ఇప్పుడు ఉంది, ఎమ్ఎస్‌పి అనేది ఒకప్పుడు ఉండింది. ఎమ్ఎస్‌పి భవిష్యత్తు లో కూడాను ఉంటుంది. పేదల కు తక్కువ ఖర్చు లో ఆహారం సరఫరా కొనసాగుతుంది. మండీల ను ఆధునీకరించడం జరుగుతుంది’’ అని పునరుద్ఘాటించారు. రైతుల సంక్షేమం కోసం, మనం రాజకీయాల లెక్కల కంటే మిన్న గా ఆలోచించవలసిన అవసరం ఉంది అని ఆయన అన్నారు.
దేశాన్ని అస్థిర పరచడానికి ప్రయత్నిస్తున్న వర్గాల విషయం లో జాగ్రత్త గా ఉండాలి అంటూ ప్రధాన మంత్రి సూచన చేశారు. సిఖ్ఖు ల తోడ్పాటు ను చూసుకొని భారతదేశం చాలా గర్వపడుతోంది అని ఆయన అన్నారు. ఈ సముదాయం దేశ ప్రజల కోసం చేసిందెంతో ఉంది. గురు సాహిబ్ ల పలుకులు మరియు దీవెనలు అమూల్యమైనవి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు ప్రయత్నం జరగాలి అని కూడా ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.
యువ శక్తి కి గల ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. యువత ను బలపరచడం కోసం చేసే ప్రయత్నాలు దేశ ఉజ్వల భవిత దిశ లో గొప్ప గా ఉపయోగపడతాయి అని ఆయన అన్నారు. ‘జాతీయ విద్య విధానాని’ కి సత్వర ఆమోదాన్ని కట్టబెట్టినందుకు ఆయన అభినందనలు వ్యక్తం చేశారు.
ఆర్థిక వ్యవస్థ పుంజుకొని, వృద్ధి చెందాలి అంటే ఎమ్ఎస్ఎమ్ఇ కీలకం అని ప్రధాన మంత్రి అన్నారు. భారీ ఉపాధి అవకాశాలు ఉన్నది ఆ రంగం లోనే అని కూడా ఆయన అన్నారు. ఈ కారణంగానే కరోనా కాలం లో ప్రకటించిన ఉద్దీపన పథకాల లో అవి ప్రత్యేక శ్రద్ధ కు నోచుకొన్నాయన్నారు.
‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ సంకల్పాన్ని గురించి ప్రస్తావిస్తూ, నక్సల్ ప్రభావిత ప్రాంతాల లో, ఈశాన్య ప్రాంతం లో సాధారణ స్థితి ని ఏర్పరచడం కోసం తీసుకొన్న చర్యల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు. అక్కడ పరిస్థితి మెరుగు పడుతోంది, ఆ ప్రాంతాల లో కొత్త అవకాశాలు అందివస్తున్నాయి అని ఆయన అన్నారు. రాబోయే కాలం లో తూర్పు ప్రాంతాలు దేశం అభివృద్ధి ప్రస్తానం లో ఒక ప్రధాన పాత్ర ను పోషిస్తాయనే ఆశ ను ఆయన వ్యక్తం చేశారు.
*******
(Release ID: 1696248)
Visitor Counter : 234
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam