ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆత్మ నిర్భర్ భారత్ సాధనలో యువత కీలకపాత్ర పోషించాలి
వినూత్న ఆవిష్కరణలు, పేటెంట్లు,ఉత్పత్తి ద్వారానే సాధ్యం
శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ 94వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఉద్ఘాటన
Posted On:
03 FEB 2021 2:10PM by PIB Hyderabad
దేశంలో విద్యాప్రమాణాలు మెరుగుపర్చడానికి ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని కేంద్ర ఆరోగ్యకుటుంబసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. కేంద్రప్రభుత్వం యువతకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి చెప్పారు. శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ 94వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ హర్షవర్ధన్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానం రానున్న రోజుల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి దోహదపడుతుందని అన్నారు. సమాజ అభివృద్ధికి గీటురాయిగా నిలిచే విద్యలో ప్రమాణాలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో కేంద్రం ఉందని అన్నారు. విద్యాప్రమాణాలు మెరుగు పరచి తిరిగి విశ్వ గురు స్థానాన్ని భారతదేశం కైవశం చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి వున్నారని ఆయన చెప్పారు. ప్రపంచ అగ్ర రాజ్యాల సరసన భారతదేశాన్ని నిలబెట్టడానికి చేస్తున్న కృషిలో భాగంగా ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం లక్ష్యాల మేరకు అమలు జరుగుతున్నదని మంత్రి చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ సాధన కోసం యువతను అన్ని విధాలా ప్రోత్సహించవలసి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. మరింత వేగంగా అభివృద్ధి సాధించడానికి వినూత్న ఆవిష్కరణలు, పేటెంట్ల సాధన, ఉత్పత్తి మెరుగుదలకు యువతను ప్రోత్సహించాలని ఆయన చెప్పారు.
కోవిడ్ నుంచి దేశాన్ని రక్షించే అంశంలో యువత చేసిన కృషిని డాక్టర్ హర్షవర్ధన్ ప్రశంసించారు. కోవిడ్ వల్ల దేశాభివృద్ధి కుంటుపడిందని దీనితో అనేక రంగాలలో సాధించిన అభివృద్ధి వృధా అయ్యిందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ఈ పరిస్థితి నుంచి బయట పడడానికి సరైన వ్యూహాలను సమర్ధ నాయకత్వంతో విస్తృత ప్రచారం ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో మాత్రమే సాధ్యమవుతుందని గుర్తించిన ప్రభుత్వం ర్ దిశలో ప్రణాళికలను రూపొందించి అమలు చేసి విజయం సాధించిందని మంత్రి అన్నారు. ఈ సమయంలో యువత కీలక పాత్ర పోషించి తమలో వున్నా శక్తిసామర్ధ్యాలను ప్రదర్శించి అంకిత భావంతో దేశ శ్రేయస్సులో తనవంతు పాత్రను పోషించిందని డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. కొవిడ్ వాక్సిన్ కార్యక్రమం కూడా విజయవంతం అయ్యేలా యువత సహకరించాలని ఆయన కోరారు.
కోవిడ్ వ్యాప్తిని అరికట్టే అంశంలో శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తల కృషిని ప్రశంసించిన మంత్రి క్లిష్ట సమయంలో వీరు అంకిత భావతో పని చేసి తమ సత్తాను చాటారని అన్నారు. కొవిడ్ వారియర్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షిస్తే శాస్త్రవేత్తలు కోవిద్ వాక్సిన్ కు రూపకల్పన చేశారని మంత్రి అన్నారు. 135 కోట్ల ప్రజలకు వాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలను తీసుకుంటుందని మంత్రి అన్నారు.
డిజిటల్ విధానంలో సమావేశంలో పాల్గొన్న హర్షవర్ధన్ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ సాధించిన ప్రగతిని అభినందించారు. విద్యార్థులను తీర్చి దిద్దడానికి యాజమాన్యం, సిబ్బంది కృషి చేస్తున్నారని అన్నారు. అత్యుత్తమ అధ్యాపక సిబ్బందిని కలిగి వున్న సంస్థ ఉత్తమ కామర్స్ కళాశాలల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని ఆయన అన్నారు.
స్వామి వివేకానంద బోధనలకు అనుగుణంగా పనిచేసి భవిష్యత్ లో మరింత ప్రగతిని సాధించాలని ఆయన అన్నారు.
***
(Release ID: 1694845)
Visitor Counter : 161