ఉప రాష్ట్రపతి సచివాలయం
ఆదివాసీల ప్రత్యేక గుర్తింపును కాపాడేలా అభివృద్ధి జరగాలి: ఉపరాష్ట్రపతి
- వారి ఉత్పత్తులకు సరైన ప్రాధాన్యత కల్పిస్తూ.. ఆదాయాన్ని పెంచుకునేలా ప్రోత్సాహం అందించాలి
- ఆదివాసీల సంస్కృతే వారి అస్తిత్వమన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
- సేంద్రియ ఉత్పత్తుల డిమాండ్‌కు అనుగుణంగా అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ట్రైఫెడ్‌కు సూచన
- ‘ఢిల్లీ హాట్’లో ఆది మహోత్సవ్‌ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
Posted On:
01 FEB 2021 6:56PM by PIB Hyderabad
ఆదివాసీలకు సరైన గుర్తింపును కల్పిస్తూ.. ప్రత్యేకమైన అభివృద్ధి నమూనాలతో వీరిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివాసీల సంస్కృతే వారి అస్తిత్వమన్న ఆయన.. వారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ.. ప్రధాన జీవన స్రవంతితో అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
ఢిల్లీహాట్‌లో జాతీయ గిరిజనోత్సవం ‘ఆది మహోత్సవ్’ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీల సంస్కృతికి ఏమాత్రం భంగం వాటిల్లినా అది మానవాళికే తీరని లోటు అవుతుందన్నారు. ఆదీవాసీల అభివృద్ధికి సంబంధించి ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ.. వారి విషయంలో ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తోందని ఉపరాష్ట్రపతి అన్నారు.
అభివృద్ధి విషయంలో ఆదీవాసీలకు చాలా విషయాలను నేర్పించాల్సి ఉంటుందని పట్టణాల్లో ఉండే వాళ్లు అనుకుంటారని.. నిజానికి ఆదీవాసీల నుంచే పట్టణాల్లో ఉండే వారు నేర్చుకోవాల్సింది చాలా ఉందనే విషయాన్ని మనం మరిచిపోతున్నామని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆదీవాసీలతో మాట్లాడుతున్నప్పుడు, వారితో పనిచేస్తున్నప్పుడు ఉదారమైన చిత్తంతో వ్యవహరించాలి. వినయంగా, అణకువతో ఉండాలని సూచించారు.
ఆదివాసీలంటే మూలవాసులని అర్థమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. వారి జీవితం.. మన సనాతన విధానాలైన సత్యం, నైతిక విలువలు, నిరాడంబరతను ప్రతిబింబిస్తుందన్నారు. నాటినుంచి ఇప్పటికీ సనాతన పద్ధతులను పాటిస్తూ నిరాడంబరంగా జీవించడమే ఆదివాసీల గొప్పదనం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. వారి కళాఖండాలు, హస్తకళలు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయని.. భూమితో, మట్టితో, ప్రకృతితో మమేకమై జీవించేవారి హస్తకళలు మన మూల విలువలను, ప్రాథమికతను గుర్తుచేస్తాయన్నారు. ఆదివాసీల సంగీతం, నృత్యరూపాల్లోనూ వీటిని మనం గమనించవచ్చని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
ఆదివాసీల హస్తకళల విస్తృత శ్రేణి గురించి వివరిస్తూ.. వారిలోని సహజమైన నైపుణ్యాలను వెలికితీస్తూ.. వాటి ద్వారా ఆదివాసీల ఆదాయాన్న మరింత పెంచే దిశగా మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీ కళాకారులను ప్రధాన స్రవంతిలోని పలు సంస్థలతో అనుసంధానం చేయడం ద్వారా.. ఆదివాసీ ఉత్పత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఆదివాసీల, భారతీయ ఉత్పత్తులకు ప్రపంచస్థాయి గుర్తింపును లభించేందుకు వీలవుతుందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
ఆదివాసీల ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో ఇప్పటికే మంచి డిమాండ్ ఉందన్న ఉపరాష్ట్రపతి.. వీటిని మరింత ప్రోత్సహించే దిశగా ఆది మహోత్సవ్ వంటి కార్యక్రమాలు కీలకభూమిక పోషిస్తాయన్నారు. ఈ దిశగా ట్రైఫెడ్ గణనీయమైన కృషిచేస్తోందని ఉపరాష్ట్రపతి అభినందించారు. స్థానిక గిరిజన సంఘాలను ప్రోత్సహిస్తూ.. ఈ-కామర్స్, డిజిటల్ ప్లాట్‌ఫామ్ ల ద్వారా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తోందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో ఈ మార్కెట్‌పై ట్రైఫెడ్ మరింత కేంద్రీకరించాల్సిన అవసరముందన్నారు. ఈ మార్కెటింగ్ ద్వారా వచ్చే లాభంలో అధిక ప్రయోజనం ఆదివాసీలకు చేరేలా చూడాల్సిన బాధ్యత కూడా ట్రైఫెడ్ మీద ఉందన్నారాయన.
భారతదేశ జనాభాలో ఆదీవాసీల సంఖ్య 8శాతంగా (అంటే దాదాపు 10కోట్లు) ఉందన్న ఉపరాష్ట్రపతి.. సమగ్రాభివృద్ధి (సబ్‌కా వికాస్) అనే జాతీయ లక్ష్యంలో ఆదీవాసీల అభివృద్ధి కూడా ఓ కీలకాంశం అన్నారు. ఆదివాసీ సోదర, సోదరీమణుల ప్రత్యేక అవసరాలను గుర్తించి వాటిని తీర్చాల్సిన బాధ్యతను కూడా రాజ్యాంగం.. ప్రభుత్వాలకు అప్పగించిందన్నారు.
ఆది మహోత్సవ్ ఏర్పాటుకు చొరవతీసుకున్న కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖను, ట్రైఫెడ్‌ను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఆదివాసీ కళాకారులు, వన్ ధన్ సరఫరాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి ఢిల్లీ హాట్‌లో ఏర్పాటుచేసి స్టాళ్లను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా, సహాయ మంత్రి శ్రీమతి రేణుకా సింగ్, కేంద్ర మంత్రి శ్రీ ఫగన్ సింగ్ కులస్తే, ట్రైఫెడ్ చైర్మన్ శ్రీ రమేశ్ చంద్ మీనా, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఆర్. సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
***
(Release ID: 1694261)
Visitor Counter : 183