రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

గణతంత్ర దినోత్సవం-2021 పురస్కారాలను ప్రదానం చేసిన యువజన వ్యవహారాలు&క్రీడల శాఖ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి శ్రీ కిరెన్‌ రిజిజు

అత్యుత్తమంగా నిలిచిన ఉత్తరప్రదేశ్‌ అయోధ్య ఆలయ నమూనా శకటం

మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో తొలిస్థానం దక్కించుకున్న బయోటెక్నాలజీ విభాగం

Posted On: 28 JAN 2021 4:20PM by PIB Hyderabad

యువజన వ్యవహారాలు&క్రీడల శాఖ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి శ్రీ కిరెన్‌ రిజిజు, గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రాల శకటాలకు దిల్లీలో అవార్డులు, బహుమతులు అందజేశారు. మన దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం, ఆర్థిక ప్రగతి, రక్షణ పరాక్రమాలను వివరిస్తూ, గణతంత్ర దినోత్సవం నాడు సాగిన కవాతులో పాల్గొన్న 32 శకటాల్లో (17- రాష్ట్రాలు&కేంద్ర పాలిత ప్రాంతాలు, 9- మంత్రిత్వ శాఖలు/విభాగాలు, పారామిలిటరీ దళాలు, 6- రక్షణ మంత్రిత్వ శాఖ‌) ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. "అయోధ్య: ఉత్తరప్రదేశ్‌ సాంస్కృతిక వారసత్వం" అంశంతో అయోధ్య రామాలయం నమూనాను ఆ రాష్ట్రం ప్రదర్శించింది. 

    శకటాల విభాగంలో త్రిపురకు రెండో స్థానం లభించింది. "సామాజిక-ఆర్థిక కొలమానాల్లో స్వావలంబన (ఆత్మనిర్భర్) సాధించేందుకు పర్యావరణహిత సంప్రదాయానికి ప్రోత్సాహం" అంశంతో ఆ రాష్ట్రం ప్రదర్శనలో పాల్గొంది. ఈ ఈశాన్య రాష్ట్రంలో 19 గిరిజన తెగలున్నాయి. 21 రకాల వెదురు సంపద పుష్కలంగా ఉంది. వెదురు రకాలు, గిరిజన వస్త్రధారణ, వెదురుతో తయారు చేసిన మాస్కులు, వెదురు ఉత్పత్తులను ఆ శకటంపై ప్రదర్శించారు.

    దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్‌ శకటానికి మూడో బహుమతి దక్కింది. శకటం ముందువైపు కస్తూరి జింక ప్రతిమను ఉంచారు. ఆ రాష్ట్ర పక్షి మోనాల్‌, కేదార్‌ఖండ్‌తోపాటు ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో కనిపించే రాష్ట్ర పుష్పం బ్రహ్మకమలంను కూడా శకటంపై ప్రదర్శించారు. శకటం మధ్యభాగంలో నంది విగ్రహాన్ని ఉంచారు. ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాల్లో ఒకటైన కేదార్‌ ఆలయం నమూనాను శకటం చివరి భాగంలో ఏర్పాటు చేశారు. 2013 వరదలకు అడ్డుగా నిలిచి, ఆలయాన్ని కాపాడిన "దివ్య శిల"ను ఆలయ నమూనా వెనుకవైపు ఏర్పాటు చేశారు. 

    వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు, పారామిలిటరీ దళాలు 9 శకటాలను, రక్షణ మంత్రిత్వ శాఖ 6 శకటాలను ప్రదర్శించగా, బయోటెక్నాలజీ విభాగం రూపొందించిన శకటానికి మొదటి బహుమతి లభించింది. వివిధ పద్ధతుల్లో కొవిడ్‌ టీకా అభివృద్ధిని వివరిస్తూ "ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌: కొవిడ్‌" అంశంతో ఈ శకటం రూపొందింది. సామాజిక ప్రయోజనంతో, సృజనాత్మక ఉత్పత్తుల తయారీని వేగవంతం చేసే వ్యవస్థను రూపొందించడంపై ఈ విభాగం దృష్టి పెట్టింది. పరిశోధన వనరుల స్థాపన, సేవలను అందించేందుకు సాంప్రదాయ జ్ఞానం ఆధారంగా స్వదేశీ టీకాలు, విశ్లేషణలు, చికిత్స సూత్రాలను రూపొందించడాన్ని వివరించారు.

    విధి నిర్వహణలో అమరులైన సైనికులకు నివాళులు అర్పిస్తూ కేంద్ర ప్రజాపనుల విభాగం ప్రదర్శించిన "అమర్‌ జవాన్‌" శకటానికి ప్రత్యేక బహుమతి లభించింది. భారత సైనిక దళాల గౌరవార్ధం,"నేషనల్‌ వార్‌ మెమోరియల్‌" నమూనాను శకటం ముందు భాగంలో రూపొందించారు. రెండు పక్కల చేసిన ఏర్పాట్లు సైనికుల చైతన్యాన్ని ప్రతిబింబించాయి. కళ్లకు ఇంపైన సహజ రంగులతో, తాజా పుష్పాలతో శకటం ఆకట్టుకుంది.

    దిల్లీలోని మౌంట్‌ అబు పబ్లిక్‌ స్కూల్‌, విద్యాభారతి పాఠశాల విద్యార్థులకు అత్యుత్తమ సాంస్క్రృతిక ప్రదర్శన పురస్కారం దక్కింది. "ఆత్మనిర్భర్‌ భారత్‌, ది విజన్‌ ఫర్‌ ఏ సెల్ఫ్‌-రిలయంట్‌ ఇండియా" అంశంతో వీరు ప్రదర్శన ఇచ్చారు. 38 మంది బాలలు, 54 మంది బాలికలు కలిసి, మన కలల ఆత్మనిర్భర్‌ భారత్‌ నిర్మాణానికి రాజ్‌పథ్‌ నుంచి యావద్దేశాన్ని ఆహ్వానించారు. ఆర్థికాభిద్ధి, సాంకేతిక ప్రగతి, కొత్త విద్యావిధానం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారతను తమ అద్భుత నృత్యరూపకం ద్వారా వారు ప్రదర్శించారు.

    "దిల్లీ తమిళ్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్స్‌" విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతి దక్కింది. తరాలుగా వారసత్వంగా వస్తున్న జానపద కళలు, చేతివృత్తుల నైపుణ్యాలను ఈ చిన్నారులు ప్రదర్శించారు. ఆలయ వేడుకలు, సామాజిక కార్యక్రమాల్లో ప్రజలకు ఉల్లాసాన్ని కలిగించేందుకు జానపద నృత్యాలను ప్రదర్శిస్తారు. రంగురంగుల వేషధారణల్లో ఉన్న చిన్నారులు వారి నైపుణ్యంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు.

    రక్షణ శాఖ సహా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల సీనియర్‌ అధికారులు, కళాకారులు, వేడుకలో పాల్గొన్న విద్యార్థులు అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యారు. కళాకారులు, విద్యార్థులతో మాట్లాడిన శ్రీ కిరెన్‌ రిజిజు, వారి నైపుణ్యాలను అభినందించారు.

 

***



(Release ID: 1693047) Visitor Counter : 264