ఉప రాష్ట్రపతి సచివాలయం
పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక వివక్ష లేని సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలి - ఉపరాష్ట్రపతి
• ప్రతి పౌరుడు సమాన అవకాశాలు పొందే దిశగా నవ భారతాన్ని నిర్మాణం జరగాలి
• నేతాజీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి
• నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దివస్ గా ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయం
• నేతాజీ ప్రజాస్వామ్య ఆదర్శాలు బలిదానం, త్యాగనిరతి అనే సూత్రాల ఆధారంగా సాగాయి
• నేతాజీ స్వరాజ్య ఉద్యమం దిశగా యువతను నడిపించిన ప్రేరణాత్మక శక్తి, వారి జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలి
• ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని అవలంబించాలని యువతకు సూచన
• హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణలో ఉన్న అధికారులను ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి
Posted On:
23 JAN 2021 1:25PM by PIB Hyderabad
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక మరియు లింగవివక్ష, కులతత్వం, మతతత్వం వంటి సామాజిక దురాచారాలు లేని సమాజ నిర్మాణం దిశగా యువత కృషి చేయాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125వ జయంతిని పురస్కరించుకుని, పరాక్రమ దివస్ నేపథ్యంలో హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని (ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ) సందర్శించి. ఈ కేంద్రంలో శిక్షణ పొందుతున్న అధికారులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. కార్యక్రమానికి ముందు నేతాజీ చిత్ర పటానికి ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు.
భారతదేశ జనాభాలో 65 శాతం మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉన్నారని పేర్కొన్న ఉపరాష్ట్రపతి ప్రతి పౌరుడు సమాన అవకాశాలను పొందే, వివక్షకు తావు లేని సంతోషకరమైన, సుసంపన్నమైన నవభారత నిర్మాణంలో పాలు పంచుకునే దిశగా ముందుకు రావాలని సూచించారు.
నేతాజీ వ్యక్తిత్వంలో పరాక్రమం ప్రతిబింబిస్తుందని అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, వారి జయంతిని దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలించే విధంగా పరాక్రమ దివస్ గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. నేతాజీ అత్యంత ప్రజాదరణ కలిగి నాయకుడన్న ఉపరాష్ట్రపతి, స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పోషించిన పాత్ర నిరుపమానమైనదని కొనియాడారు. కులం, మతం, ప్రాంతం, భాష లాంటి ఇతర గుర్తింపులకు అతీతంగా మనమంతా భారతీయులమని బోస్ ప్రగాఢంగా విశ్వసించారన్న ఆయన, నిజమైన నాయకత్వ విలువలకు నిదర్శంగా నిలిచారని తెలిపారు.
కుల వ్యవస్థ లేని భారతదేశాన్ని నేతాజీ ఆకాంక్షించారని నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి, 1940ల్లోనే అన్ని కులాలు, మతాలకు చెందిన సైనికులంతా కలిసి ఒకే రకమైన వంటలతో సహపంక్తి భోజనాలు చేసే దిశగా ఆయన స్ఫూర్తిని రగిలించారన్నారు. అట్టడుగువర్గాల అభ్యున్నతితోనే భారతదేశ ప్రగతి సాధ్యమని విశ్వసించిన నేతాజీ, ఆ దిశగా తొలి అడుగు వేశారని పేర్కొన్నారు. పాఠశాల రోజుల నుంచి అన్యాయానికి వ్యతిరేకంగా నేతాజీ పోరాడిన విషయాన్ని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, నేతాజీ జీవితం మీద రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అరబిందోల బోధనల ప్రభావాన్ని ప్రస్తావించారు. ఈ ఆధ్యాత్మిక శక్తి నేతాజీలో అంతర్లీన శక్తిగా మారిందన్న ఉపరాష్ట్రపతి, ఆధ్యాతిక మార్గ లక్ష్యం సమాజానికి మేలు చేయడమేనని తెలిపారు.
బలిదానం, త్యాగనిరతి అనే సూత్రాల మీద నేతాజీ ప్రజా స్వామ్య ఆదర్శాలు ఆధారపడి ఉన్నాయన్న ఉపరాష్ట్రపతి, స్వేచ్ఛా భారరతంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా క్రమశిక్షణ, బాధ్యత, సేవ, దేశభక్తి వంటి విలువలను పౌరులు స్వీకరించాలని బోస్ భావించినట్లు తెలిపారు. భారతదేశ నాగరిక విలువలు, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గర్వకారణమన్న ఉపరాష్ట్రపతి, ఇది మన జాతి ఉన్నతికి, సమష్టి ఆత్మ విశ్వాసానికి మూలమని అభిప్రాయపడ్డారు. రాజకీయ బంధనాల నుంచి స్వరాజ్యాన్ని మాత్రమే కాకుండా అందరికీ సమానంగా సంపద పంపిణి, కుల అడ్డంకుల నిర్మూలన, సామాజిక అసమానతలకు తావులేని సమాజాన్ని నేతాజీ ఆకాంక్షించారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
నేతాజీ స్ఫూర్తిదాయక లక్షణాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, యుద్ధ ఖైదీలుగా ఉన్న సైనికులను ఉత్సాహపరచి, వారిలో స్ఫూర్తిని రగిలించి స్వాతంత్ర్య సమరయోధులుగా మలచారని, నేతాజీ లాంటి నాయకుడి కోసం వారంతా స్వరాజ్య సాధన కోసం తుది శ్వాస వరకూ పోరాడేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. నాయకత్వం ద్వారా వచ్చే గౌరవం అడిగి తీసుకునేది కాదని, వారి క్యారక్టర్ (గుణం), కెపాసిటీ (సామర్థ్యం), క్యాలిబర్ (యోగ్యత), కాండక్ట్(నడత) ఆధారంగా సమాజమే గౌరవాన్ని ఇస్తుందని తెలిపారు. ఆజాద్ హింద్ ఫౌజ్ పట్ల ప్రజల్లో ఉన్న సానుకూల అభిప్రాయం, యువతలో పెరుగుతున్న ఆకర్షణ కారణంగా బ్రిటీష్ పాలకులు సైతం ఐ.ఎన్.ఎ. ఖైదీలకు విధించిన శిక్షలను సైతం రద్దు చేసే దిశగా నాటి కోర్టుల మీద ఒత్తిడి తీసుకొచ్చారని ఉపరాష్ట్రపతి తెలిపారు.
సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలకు సమాన అవకాశాల కల్పనను నేతాజీ ప్రోత్సహించారన్న ఉపరాష్ట్రపతి, రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ పేరుతో ఐ.ఎన్.ఏ. మహిళా దళాన్ని బోస్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సాయుధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ ను అందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ సందర్భంగా అభినందించారు. వ్యక్తిత్వ నిర్మాణానికి, మానవ జీవన సర్వతో ముఖాభివృద్ధికి విద్య అత్యంత ఆవశ్యకమని నేతాజీ నమ్మారన్న ఉపరాష్ట్రపతి, అర్థవంతమైన విద్య కోసం బోధన, బోధనా విధానాలను పునరుద్ధరించాలని, భారతదేశం విద్యా కేంద్రంగా, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
వృత్తి జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం మీద కూడా దృష్టి పెట్టాలని శిక్షణలో ఉన్న అధికారులకు సూచించిన ఉపరాష్ట్రపతి, మంచి ఆరోగ్య విధానాలను అవలంబించాలని సూచించారు. శారీరక ఆరోగ్యం ద్వారా మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందన్న ఆయన, ప్రతి రోజు కొంత సమయాన్ని యోగ సహా ఇతర వ్యాయామాలకు కేటాయించాలని సూచించారు. అనారోగ్యకరమైన కొంత మంది యువత ఆహారపు అలవాట్ల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, మన వాతావరణ పరిస్థితులకు తగిన విధంగా పోషకాహారాన్ని తీసుకోవాలని, భారతీయ సంప్రదాయ ఆహారంలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.
భారతీయుల సంప్రదాయాల్లో ఆరోగ్య విలువలు దాగి ఉన్నాయన్న ఉపరాష్ట్రపతి, ఇటీవల కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందాయని చెప్పుకుంటున్న అనేక దేశాలతో పోలిస్తే భారతదేశం ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ముందు వరుసలో కృషి చేసిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, శాస్త్రవేత్తలు, పోలీసులు, మీడియాకు అభినందలు తెలియజేశారు. వీరితో ఆహార ఉత్పత్తిని పెంచేందుకు అన్నదాతల కృషి ప్రశంసనీయమని తెలిపారు. గ్రామీణ వాతావరణం ఉండే వారు కరోనా ప్రభావానికి అతి తక్కువ లోనయ్యారన్న ఆయన, చక్కని గాలి, వెలుతురు ఉండే పరిసరాలే అందుకు కారణమని పట్టణాల్లో సైతం ఈ తరహా సంస్కృతి పెరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ శ్రీ హర్ ప్రీత్ సింగ్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ బెన్‌హుర్ మహేష్ దత్ ఎక్కా సహా అధ్యాపక సిబ్బంది, శిక్షణ పొందుతున్న అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
***
(Release ID: 1691662)
Visitor Counter : 183