ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

విశ్వైక’ తత్వంతో భారతదేశం ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలదు - ఉపరాష్ట్రపతి

• ప్రజాస్వామ్య భావనా కాంతులు భారతీయ జీవన విధానంలో కనిపిస్తాయి

• ఆధునిక భారతదేశంలోని అత్యంత ప్రభావ వంతమైన ఆధ్యాత్మికవేత్త శ్రీ నారాయణ గురుకు ఉపరాష్ట్రపతి నివాళి

• సామరస్యం, శాంతియుత సహజీవనం, వైవిధ్యం పట్ల గౌరవం గురించి భారతదేశ దృష్టికోణాన్ని నారాయణ గురు ప్రచారం చేశారు

• భారతీయ సాంస్కృతిక మూలాల మీద దృష్టి కేంద్రీకరించాలని యువతకు పిలుపు

• శ్రీ నారాయణ గురు రచించిన పద్య సంపుటి ‘నాట్ మెనీ బట్ వన్’ పుస్తకాలను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

Posted On: 22 JAN 2021 5:55PM by PIB Hyderabad

‘వసుధైవ కుటుంబకం’ అనే భారతీయ సనాతన భావన ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యలకు పరిష్కారాల దిశగా మార్గనిర్దేశం చేయగలదని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. విద్వేషం, హింస, మతోన్మాదం, సాంఘిక దురభిమానం వంటి విభిన్న ధోరణుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మరియు సమాజాల సామాజిక ఐక్యత క్షీణిస్తున్న తరుణంలో సనాతన భారతీయ తాత్విక కోణమైన విశ్వైక భావన ప్రత్యేక ఔచిత్యాన్ని కలిగి ఉందని అభిప్రాయపడ్డారు. 

భారతీయ జీవన విధానంలోనే ప్రజాస్వామ్య భావ కాంతులు ఉన్నాయని తెలిపిన ఉపరాష్ట్రపతి, ఇక్కడి జీవన వైవిధ్యంలో ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉందని తెలిపారు. మన నాగరిక విలువలు మానవుల్లోని శక్తివంతమైన సచేతన వైవిధ్యాన్ని గుర్తించాయని, మనం ఒకే దివ్యత్వంలో భాగమైనందున ఈ వైవిధ్యంలో స్వాభావిక సంఘర్షణ లేదని తెలిపారు. అటువంటి ప్రపంచ దృక్పథం, పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనంతో పాటు స్థిరమైన, సమగ్రమైన పురోగతిని సాధించే దిశగా సమిష్టి ప్రయత్నాలు కొనసాగించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

ప్రొ. జి.కె. శశిధరన్ ఆంగ్లంలోకి అనువదించిన శ్రీ నారాయణ గురు పద్య సంపుటి ‘నాట్ మెనీ, బట్ వన్’ పుస్తకాలను హైదరాబాద్ నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ నారాయణ గురు ఆధునిక భారతదేశాన్ని ప్రభావితం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్న ఆయన, వారు బహుముఖ ప్రజ్ఞాశీలి మాత్రమే గాక గొప్ప మహర్షి, అద్వైత తత్వ ప్రతిపాదకులు, ప్రభావవంతమైన కవి, గొప్ప తాత్వికవేత్త అని కొనియాడారు.

విశేషమైన సంఘ సంస్కర్తగా శ్రీ నారాయణ గురు పోషించిన పాత్రను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, అంటరానితనం లాంటి సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని ముందుండి నడిపారని తెలిపారు. శివలింగాన్ని అపవిత్రం చేస్తున్నారన్న ఛాందస వాదుల నిరసనల మధ్య  వైకోం ఆందోళనలకు ప్రేరణిచ్చి మహాత్మ గాంధీ సహా దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించారని తెలిపారు. శివగిరి తీర్థయాత్రలో భాగంగా పరిశుభ్రత, విద్య, వ్యవసాయం, వాణిజ్యం, హస్తకళలు, సాంకేతిక శిక్షణ వంటి ఆదర్శాల సాధనను శ్రీ నారాయణ గురు ప్రచారం చేశారని పేర్కొన్నారు.

ఈ విశ్వంలో ప్రతి మానవుడు పరమాత్మ స్వరూపమేనని, ఒకే విశ్వాత్మ ప్రపంచమంతా విస్తరించిందని శ్రీ నారాయణగురు నమ్మారన్న ఉపరాష్ట్రపతి, భారతీయత సారాన్ని తన పద్యాల్లో ఆవిష్కరించారని తెలిపారు. ప్రపంచంలోని స్పష్టమైన వైవిధ్యాన్ని ఐక్యతను నొక్కిచెప్పిన నారాయణగురు ‘ఒకే కులం, ఒకే మతం, అందరికీ ఒకే దేవుడు (ఒరు జాతి, ఒరు మాథం, ఒరు దైవం మనుష్యాను)’ అని ప్రవచించారని తెలిపారు. ఈ తత్వమే ఆయన సంస్కరణలకు, ఉద్యమాలకు ఆధారం అయ్యిందని, ఇది అసమానతలు, సామాజిక వివక్షను సమూలంగా రూపు మాపే ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు. 

ఆధునిక భారతదేశ మీద అత్యంత ప్రభావాన్ని చూపిన ఆధ్యాత్మిక మార్గదర్శకుల్లో శ్రీ నారాయణగురు ఒకరని అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, వారు సామరస్యం, శాంతియుత సహజీవనం మరియు వైవిధ్యం పట్ల భారతదేశ ప్రత్యేకమైన దృష్టి కోణాన్ని ప్రచారం చేశారని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల పట్ల వారికున్న ఆపారమైన అవగాహన గురించి తెలియజేసిన ఉపరాష్ట్రపతి, తన రచనల ద్వారా విశ్వంలోని మూలాలను అన్వేషించే ఆధ్యాత్మికవేత్తగా తత్వజ్ఞానాన్ని (మెటా ఫిజిక్స్) ఆవిష్కరించారని, వారి ఆధ్యాత్మిక అంతర్ దృష్టికి సంబంధించిన ఉదాహరణలను ఉటంకించారు. 

ఈ రెండు సంపుటాలను రూపొందించేందుకు రచయిత, ప్రచురణకర్త చేసిన ప్రయత్నాలను అభినందించిన ఉపరాష్ట్రపతి, ఇలాంటి పుస్తకాలు భారతదేశ నాగరిక విలువల యొక్క మూలాలను లోతుగా అర్థం చేసుకోవడానికి దోహదపడతాయని తెలిపారు. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాఠకులకు అసాధారణ విశ్వవ్యాపిత తత్వం మరియు భారతీయ దృష్టి యొక్క సంగ్రహ అవలోకనాన్ని అందిస్తుందని తెలిపారు.

భారత సాంస్కృతిక వాజ్ఞ్మయ నిధిలో ఇలాంటి అనేక రత్నాలను అన్వేషించాల్సి ఉందని అభిప్రాయపడిన ఉపరాష్ట్రపతి, ఇదో నిరంతర ప్రక్రియ అని, ఈ క్రమంలో యువతరం భారతీయ సాంస్కృతిక మూలాలను అన్వేషించి, భారతీయ వారసత్వం గురించి మరింత అవగాహన పెంచుకోవచ్చని సూచించారు. 

ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత ప్రొ. జి.కె.శశిధరన్, టాటా ట్రస్టుల ధర్మకర్త శ్రీ ఆర్.కె. కృష్ణకుమార్, సి.ఈ.ఓ. శ్రీ ఎన్. శ్రీనాథ్, పెంగ్విన్ రాండమ్ హౌస్ నుంచి శ్రీ అనిల్ ధార్కర్ తదితరులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

***



(Release ID: 1691290) Visitor Counter : 217