ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఫిక్కీ నిర్వహించిన "మాస్క్రేడ్-2021" 7వ ఎడిషన్ను ప్రారంభించిన - డాక్టర్ హర్ష వర్ధన్
"అక్రమ రవాణా మరియు నకిలీ వాణిజ్యం - పురోగతిని అడ్డుకుంటాయి, ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి మరియు వినియోగదారులకు భద్రతా ప్రమాదాలను సృష్టిస్తాయి"
అక్రమ వాణిజ్యానికి వ్యతిరేకంగా మన పోరాటంలో ‘వోకల్-ఫర్-లోకల్’ చాలా శక్తివంతమైన సాధనం : డాక్టర్ హర్ష వర్ధన్
Posted On:
21 JAN 2021 4:38PM by PIB Hyderabad
ఫిక్కీ క్యాస్కేడ్ నిర్వహించిన - అక్రమ రవాణా మరియు నకిలీ వాణిజ్యానికి వ్యతిరేకంగా ఉద్యమం “ మాస్క్రేడ్ -2021” 7వ ఎడిషన్ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రసంగిస్తూ, నకిలీ, అక్రమ రవాణాతో పాటు, నకిలీ ఉత్పత్తులు సృష్టించే ఆటుపోట్లను తిప్పికొట్టగల చర్య, వినూత్న విధాన పరిష్కారాలను, మాస్క్రేడ్ 7వ ఎడిషన్ లో - విస్తృతంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
కోవిడ్-19 మహమ్మారితో పాటు అక్రమ ఔషధాల సవాళ్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, "కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన గందరగోళం, దాని వ్యాప్తిని అరికట్టడానికి రూపొందించిన వివిధ విధాన ప్రతిస్పందనల మధ్య, దేశ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ప్రజల భద్రతకు గణనీయమైన నష్టం కలిగించే విధంగా, కొంతమంది మోసగాళ్ళు, ఈ మహమ్మారిని వారి దుర్మార్గపు కార్యకలాపాలను పెంచుకోడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే." అని ఆవేదన వ్యక్తం చేశారు.
డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ, "కోవిడ్ అనంతర కాలంలో, నకిలీ మరియు అక్రమ రవాణా యొక్క సవాళ్లను తగ్గించడానికి వీలుగా నూతన, ఆచరణాత్మక వ్యూహాలపై ఆరోగ్యకరమైన చర్చను ప్రోత్సహించడం, ఈ మాస్క్రేడ్-2021 యొక్క ప్రధాన లక్ష్యం కాగా, అన్నింటికంటే ముందుగా, ప్రజల్లో అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలి. కోవిడ్-19 మహమ్మారి మన ఆరోగ్య వ్యవస్థపై అసాధారణమైన డిమాండ్లను సృష్టించింది. రోగులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణనందజేయడానికి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు ఇప్పటికే ఉన్న సేవల విధానాలను తిరిగి ఆవిష్కరిస్తున్నారు.” అని వివరించారు.
నకిలీ మందుల ముప్పును ఎప్పటికప్పుడు తనిఖీ చేయడానికి, ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలను ఆయన ప్రశంసిస్తూ, "నకిలీ మందుల ముప్పును తనిఖీ చేయడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఔషదాలు, సౌందర్య సాధనాల సవరణ చట్టం-2008 కింద, ఔషదాలు, సౌందర్య సాధనాల చట్టం-1940 ని సవరించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం, ఏదైనా ఒక ఔషధం కల్తీ లేదా నకిలీగా భావిస్తే, దానికి బాధ్యుడైన వ్యక్తి లేదా అపరాధికి పదేళ్ల కంటే తక్కువ కాకుండా జైలు శిక్ష కానీ లేదా దాన్ని జీవిత ఖైదుగా కూడా పొడిగించవచ్చు. ఔషధాలు, సౌదర్యసాధనాల చట్టం కింద నేరాల విచారణ, సత్వర పరిష్కారం కోసం, ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది. బాగా అభివృద్ధి చెందిన చట్టపరమైన వ్యవస్థతో పాటు, ముఖ్యమైన విద్యా ప్రయత్నాలతో, ప్రమాదకరమైన నకిలీ మరియు అక్రమ రవాణా నుండి వినియోగదారుల ఆరోగ్యం, భద్రతలను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.” అని తెలియజేశారు.
నకిలీ, అక్రమ రవాణా వల్ల పెరుగుతున్న ప్రమాదాలను పరిష్కరించడానికి, అందరూ కలిసి ముందుకు రావాలని డాక్టర్ హర్ష వర్ధన్, పిలుపునిచ్చారు. ఇదే విషయం గురించి ఆయన మాట్లాడుతూ, "వినియోగదారులను సురక్షితంగా ఉంచాలనే అంతిమ లక్ష్యంతో పెరుగుతున్న ఈ ముప్పును ఎదుర్కోవడంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలు కలిసి ముందుకు వచ్చి, ప్రభుత్వంతో భాగస్వాములు కావాలి. నకిలీ, మిస్-బ్రాండెడ్, కల్తీ మందులు పంపిణీ ఛానెల్ లోకి ప్రవేశించే పద్ధతులు చాలా క్లిష్టంగా మారాయి. అయితే, ఔషధ ఉత్పత్తుల పంపిణీ ప్రక్రియలలో ఉన్న లోపాలు, అటువంటి ఉత్పత్తులను సరఫరా వ్యవస్థలో ప్రవేశపెట్టడానికి ఒక మార్గాన్ని కలుగజేస్తాయి. ఈ లోపాలను గుర్తించి, సరిచేయడానికి పరిశ్రమ వర్గాలు చురుకైన పాత్ర పోషించవలసిన అవసరం ఉంది.” అని సూచించారు.
గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇచ్చిన న ‘వోకల్-ఫర్-లోకల్’ పిలుపు గురించి ఆయన పునరుద్ఘాటిస్తూ, "ఆత్మ నిర్భర్ భారత్ మరియు వోకల్-ఫర్-లోకల్" నినాదాలు నిజంగా మన ముందు ఉన్న సవాళ్ళకు సరైన పరిష్కారాలను అందిస్తాయి. భారతదేశం బలమైన దేశీయ బ్రాండ్లను ఉత్పత్తి చేయటం ప్రారంభించి, క్రమంగా విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుండటంతో, అక్రమ రవాణా దారులు, నకిలీ వస్తువుల ద్వారా లాభం పొందే వారి కార్యకలాపాలు త్వరలో పరిమితం అవుతాయి. నకిలీ వస్తువుల ఉత్పత్తిదారులను గుర్తించడంలో, విచారణ చేయడంలో, చట్టపరమైన చర్యలు మరింత ప్రభావవంతంగా మారతాయి. అందువల్ల, అక్రమ వాణిజ్యానికి వ్యతిరేకంగా మన పోరాటంలో ‘వోకల్-ఫర్-లోకల్’ చాలా శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది.”, అని వివరించారు.
మరింత శ్రద్ధ అవసరమైన ప్రాంతాల గురించి డాక్టర్ హర్ష వర్ధన్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, "అక్రమ రవాణా, నకిలీ మరియు పైరసీకి సంబంధించిన ప్రస్తుత నిబంధనలను సమీక్షించడం; భద్రతా దళాలు మరియు అమలు సంస్థలకు సహాయం చేయడానికి తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం; ఈ నేరానికి పాల్పడినవారికి జరిమానాలను పెంచడం; ఈ చర్యలను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి వీలుగా, మరింత ఆర్థిక, మానవ వనరులను కేటాయించడం; మొదలైనవి, మరింత దృష్టి కేంద్రీకరించవలసిన కొన్ని ప్రాంతాలు." అని వివరించారు.
ఫిక్కీ "మాస్క్రేడ్" యొక్క ప్రయత్నాలను, కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రశంసిస్తూ, నకిలీ మరియు అక్రమ రవాణాను నివారించడంలోనూ, అదేవిధంగా అక్రమ రవాణా నిరోధానికి, నకిలీ నిరోధానికీ రూపొందించిన చట్టాల అమలులోనూ చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా, ఆయా చట్టాలను అమలు చేసే సంస్థలలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులను ప్రతి సంవత్సరం సత్కరిస్తున్నందుకు "ఫిక్కీ మాస్క్రేడ్" ను నేను ఎంతో అభినందిస్తున్నాను." అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో - పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ మన్మోహన్ సరిన్; జమ్మూ-కశ్మీర్ హైకోర్టు గౌరవ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ కునియో మికురియా; ప్రపంచ కస్టమ్స్ సంస్థ సెక్రటరీ జనరల్ శ్రీ ఉదయ్ శంకర్ తో పాటు, ఫిక్కీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.
*****
(Release ID: 1691066)
Visitor Counter : 189