ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

సౌందర్యం కంటే సౌకర్యానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి: ఉపరాష్ట్రపతి

• పట్టణాల గృహ నిర్మాణాల్లో గాలి, సూర్యరశ్మి పుష్కలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

• నగరాలను సమగ్రంగా, సుస్థిరంగా అందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలి: ఉపరాష్ట్రపతి

• నివాసయోగ్యంగా ఉండేలా చూడడమే గాక, ప్రజలు ఆనందంగా జీవించేలా నగర ప్రణాళిక అధికారులు చర్యలు చేపట్టాలి

• పట్టణ పేదలకు నగరంలో సరైన చోటు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

• పట్టణ ప్రణాళికలో స్థానిక సంప్రదాయాలకు సరైన గౌరవం కల్పించాలి

• ఆయా నగరాల్లోని చారిత్రక ప్రదేశాలను, ప్రత్యేకమైన అంశాలను సంరక్షించాలని సూచన

• పౌర సౌకర్యాల నిర్వహణకు స్వీయ ఆర్థిక విధానాలను ప్రోత్సహించే దిశగా పౌర సంస్థలు కృషిచేయాలి

• లైబ్రరీలు, పార్కుల కోసం స్థల కేటాయింపులు, నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి• పర్యావరణ పరిరక్షణకు సరైన ప్రాధాన్యం కల్పించాలి

• ‘ఎ టెక్స్ట్‌బుక్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ జాగ్రఫీ’ పుస్తకాన్ని ఆన్‌లైన్ వేదిక ద్వారా ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

Posted On: 20 JAN 2021 7:30PM by PIB Hyderabad

సమగ్రత, సుస్థిరతతోపాటు అందరికీ అందుబాటులో ఉండేలా నగరాలను తీర్చిదిద్దేలా పట్టణ ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన అవసరముందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రజలు ఆనందంగా జీవించడంతోపాటు నివాస యోగ్యమైన అంశాలను పొందుపరిచేందుకు దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సీఈవో, డైరెక్టర్ జనరల్ డాక్టర్ సమీర్ శర్మ రాసిన ‘ఎ  టెక్స్ట్ బుక్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ జాగ్రఫీ’ పుస్తకాన్ని అంతర్జాల వేదిక ద్వారా ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి, నగరాల్లో పట్టణ పేదలకు సరైన చోటు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగరం కొందరిది మాత్రమే కాదన్న ఆయన, నగర ప్రణాళికలో సమగ్రత ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.

నగర ప్రణాళికలో ప్రతి అంశానికీ సరైన ప్రాధాన్యత లభించాలని సూచించిన ఉపరాష్ట్రపతి, పౌర సేవలకు అవసరమైన నిధుల సేకరణ, హరిత భవనాలను ప్రోత్సహించడం, చెత్తను పునర్వినియోగంలోకి తీసుకురావడం, వర్షపు నీటిని సంరక్షించుకోవడం, ప్రజారవాణాను ప్రోత్సహించడం వంటి అంశాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆక్రమణలు పెరిగి కాంక్రీట్ నిర్మాణాలు పెరిగినందుకు ఇటీవల మెట్రో నగరాల్లో వరదలు సృష్టిస్తున్న బీభత్సాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ప్రకృతితో మమేకమై జీవించాల్సిన అవసరాన్ని వరుస ఘటనలు గుర్తుచేస్తున్నాయన్నారు. చెరువుల ఆక్రమణ కారణంగానే వరదలు పెరుగుతున్నాయని, అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు.

వాహనాల కాలుష్యాన్ని తగ్గించాల్సిన అంశాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ప్రజారవాణాను ప్రోత్సహించడంతోపాటు, కార్ పూలింగ్, సీఎన్జీ వాహనాలు, విద్యుత్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడం దిశగా మరింత కృషి జరగాలని  సూచించారు. ఈ దిశగా నగర పౌరులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. సైక్లింగ్‌ను ప్రోత్సహించే దిశగా ప్రజాఉద్యమాన్ని నిర్మించడం ద్వారా ఆరోగ్య సంరక్షణతో పాటు కాలుష్యం  పెరుగుదలను నివారించవచ్చని ఉపరాష్ట్రపతి అన్నారు.

నగరాల్లో ఇళ్లులేని పేదల ప్రయోజనాలను గుర్తిస్తూ, ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వస్తున్న వారి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, జీవనానుకూల సూచి (ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్) ర్యాంకింగ్స్ లో మెరుగుదలే భారతదేశంలోని నగరాల లక్ష్యం కావాలని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్ల విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

నగరాలు, పట్టణాలను నివాసయోగ్యంగా మార్చడం ఒక్కటే పట్టణ ప్రణాళిక అధికారులు లక్ష్యంగా పెట్టుకోకుండా, అక్కడి ప్రజల జీవితాలను ఆనందమయంగా మార్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఉపరాష్ట్రపతి అన్నారు. పట్టణ ప్రణాళికలో స్థానిక సంప్రదాయాలకు, స్థానికంగా ఉండే అంశాలకు సరైన ప్రాధాన్యత కల్పించాలన్న ఆయన, ‘పశ్చిమదేశాలను గుడ్డిగా అనుకరించే ప్రయత్నంలో భాగంగా, నగరాలను నిర్మించుకుంటూ పోతున్నామే తప్ప, అక్కడి చారిత్రక అంశాలను స్పృశించడం లేదన్నారు. మన గతాన్ని, మన చరిత్రను స్ఫురించలేని నగరాలకు సరైన భవిష్యత్తు ఉండదని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఆయా నగరాలకున్న చారిత్రక ప్రాధాన్యాన్ని, సంప్రదాయాలను కచ్చితంగా సరైన గౌరవం కల్పించాలన్నారు.

ఆధునిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి నగరాలను మూలస్తంభాలుగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, నగరాలు భారతదేశ వైవిధ్యానికి, మన భిన్న సంస్కృతులకు ప్రతిబింబాలని అన్నారు. కాలానుగుణంగా ఒక్కో నగరం తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చాయన్నారు. అలాంటి ప్రత్యేకతను కాపాడుతూ, తర్వాతి తరాలకు అందించాల్సి అవసరం ఉందని తెలిపారు.

పట్ణణ ప్రణాళికలో భారతదేశ ప్రాచీన విధానాలను గుర్తుచేసుకున్న ఉపరాష్ట్రపతి, హరప్పా, మొహెంజోదారో, ఇంద్రప్రస్థ, మధురై, కాంచీపురం తదితర నగరాలు నాటి భారతీయ పట్టణ ప్రణాళికకు అద్దం పడతాయన్నారు.

పెరుగుతున్న పట్టణీకరణ మీద దృష్టి సారించాలని సూచించిన ఉపరాష్ట్రపతి, భారతదేశంలో 2050 నాటికి పట్టణ జనాభా 60 శాతానికి పెరుగుతుందని తెలిపారు. ఈ వేగవంతమైన పట్టణీకరణ, అవకాశాలతో పాటు సవాళ్ళను కూడా సృష్టిందన్న ఆయన పరిమిత భూమి, నీరు, గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు, నగర మౌలిక సదుపాయాల విషయంలో ఎదురయ్యే సమస్యలకు సరైన పరిష్కారాలతో సిద్ధం కావాలని సూచించారు. వీటి నిర్వహణలో ఎంత చాకచక్యం చూపుతామనే అంశమే నగరాల భవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలిపారు. 

రవాణా, గృహనిర్మాణం, నీరు, గ్యాస్, వ్యర్థ పదార్థాల నిర్వహణ వంటి పౌర సదుపాయాల కల్పన విషయంలో ప్రాప్యత ఉండేలా చూడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి, ప్రజా వినియోగాల నిర్వహణను ఆచరణీయంగా చేసే స్వీయ ఫైనాన్సింగ్ నమూనాలను పౌర సంస్థలు అవలంబించాలని సూచించారు. పౌరులు సౌకర్యాలను వినియోగించుకున్న సమయంలో కనీసం నామ మాత్రపు రుసుము చెల్లించినప్పుడే, వినియోగదారుల్లో యాజమాన్య బాధ్యత పెరుగుతుందన్న ఆయన, భారతదేశంతో పాటు అనేక ఇతర ప్రాంతాల్లో ఇది విజయం సాధించిన పద్దతని తెలిపారు.

నగరాల్లో అపార్ట్ మెంట్లు మాత్రమే కాకుండా, తప్పని సరిగా పార్కుల వంటి ప్రజోపయోగ సౌకర్యాలు ఉండాలన్న ఉపరాష్ట్రపతి, అందరూ కలిసి పని చేస్తే ఓ అభివృద్ధి చెందిన నగరం రూపు దిద్దుకుంటుందని తెలిపారు. ఇది ఒకప్పటి నాగరికతలో ఓ లక్షణంగా ఉండేదని, ఫలితంగా ప్రజలంతా కలిసి మాట్లాడుకుని, ముందుకు సాగేవారని, ప్రస్తుతం ఈ సమైక్యత భావన సమాజంలో తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో వివిధ కుటుంబాల వారు క్రమం తప్పకుండా సంభాషించడం, కలిసి పంచుకోవడం, ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకోవడం లాంటి వాటి ద్వారా సామాజిక బంధం పెరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలు, పౌర ఉద్యానవనాలు, వస్తు ప్రదర్శన శాలల వంటి ప్రజా సౌకర్యాల నిర్మాణానికి ముందుకు రావాలని, అదే సమయంలో సాంస్కృతిక ప్రదర్శనలు, ఆడిటోరియంలు మరియు ప్రజా వినోద కేంద్రాల ద్వారా ప్రజలను ఒకే వేదిక మీదకు తీసుకురావడానికి, ఆలోచనల మార్పిడికి ప్రణాళికలు తయారు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

నిర్మాణ రంగంలో ఉంటున్న వారు గాలి, సూర్యరశ్మి పుష్కలంగా ప్రవేశించే విధంగా మన పట్టణాల గృహాల రూపకల్పన జరగాలని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. ఆరోగ్యకరమైన  జీవితానికి ఇవి కూడా చాలా ముఖ్యమని.. పట్టణీకరణ కారణంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో.. సౌందర్యం (ఇళ్ల నిర్మాణాన్ని అందంగా చేపట్టడం) కంటే సౌకర్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కరోనా మహమ్మారి గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ప్రభావాన్ని చూపేందుకు కారణం.. వారంతా సమృద్ధిగా గాలి, వెలుతురు వచ్చే విధంగా జీవనాన్ని కొనసాగించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. 

కోవిడ్ -19 మహమ్మారి ప్రకృతితో కలిసి జీవించాల్సిన ప్రాధాన్యతను నేర్పించిందన్న ఉపరాష్ట్రపతి, ఆధునిక జీవనశైలి దిశగా పరిగెడుతూ, నగరవాసులు ప్రకృతితో తమకున్న సంబంధాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరాల్లో ఉద్యానవనాలు, ఆటస్థలాలు వంటివి నిర్మించడం ద్వారా సౌకర్యవంతమైన స్థలాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన, పెద్ద పెద్ద పట్టణాలు వరద సమయంలో మునిగి పోవడానికి ఇది కూడా ఓ కారణమని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు పెరుగుతున్న వలసలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ వలసలు పెరిగేందుకు గల మూలకారణాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. కనీస వసతుల్లేకపోవడం, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలని తేడాలేకుండా ప్రజల జీవనప్రమాణాలను పెంచేందుకు కృషి జరగాలన్నారు.

పట్టణ ప్రణాళికకు సంబంధించి చక్కటి పుస్తకాన్ని తీసుకొచ్చిన రచయిత డాక్టర్ సమీర్ శర్మ, పబ్లిషర్ లను ఉపరాష్ట్రపతి అభినందించారు. అద్భుతమైన పట్టణ ప్రణాళిక, ప్రస్తుత సమస్యలకు స్వదేశీ తరహాలో పరిష్కారాలను పుస్తకంలో పేర్కొన్నారన్నారు. కరోనా మహమ్మారి అనంతరం పట్టణీకరణలో రావాల్సిన మార్పులకు సంబంధించి సరైన సమయంలో వచ్చిన సరైన పుస్తకమని ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత శ్రీ సమీర్ శర్మ, పుస్తకం పబ్లిషర్స్ శ్రీ అశోక్ ఘోష్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ డైరెక్టర్ శ్రీ హితేశ్ వైద్య తో పాటు వివిధ రంగాల ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***



(Release ID: 1690612) Visitor Counter : 189