ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రపంచ ఆరోగ్య సంస్థ 148వ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ హర్షవర్ధన్ ' 2020లో శాస్త్రీయ పరిజ్ఞాన అంశాలు అమలు జరిగాయి'
2021సంవత్సరం ప్రపంచ ఐక్యత మనుగడకు తార్కాణంగా నిలిచి కార్యాచరణ దశాబ్దంగా గుర్తింపు పొందుతుంది'
Posted On:
18 JAN 2021 4:22PM by PIB Hyderabad
డిజిటల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 148వ సదస్సుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. 2020లో చోటు చేసుకున్న సంఘటనలను వీటిని ఎదుర్కోడానికి అమలు జరిగిన చర్యలను, 2021లో ప్రపంచ మానవాళి మనుగడకు అమలు చేయవలసిన చర్యలను డాక్టర్ హర్షవర్ధన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. సమావేశానికి హాజరైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు,సంస్థ డైరెక్టర్ జనరల్ ఇతర ప్రతినిధులకు స్వాగతం పలికిన డాక్టర్ హర్షవర్ధన్ 2020లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 2021లో మరింత అభివృద్ధిని సాధించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిద్ధంగా వుండాలని పిలుపు ఇచ్చారు. వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున ఆయన సంతాపం తెలిపారు. సవాళ్ళను ఎదుర్కొంటూ శక్తివంచన లేకుండా కృషి చేసిన వైద్య నిపుణులు,పరిశోధకులు,శాస్త్రవేత్తలు సిబ్బందిని ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున అభినందించారు. 2020ని శాస్త్ర సంవత్సరంగా వర్ణించిన డాక్టర్ హర్షవర్ధన్
2020లో ప్రపంచం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నదని అన్నారు. శాస్త్రీయ పరిజ్ఞాన ఫలాలతో పెను సవాల్ ను ఎదుర్కొన్నామని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ఇదివరకు ఎన్నడూ ఎదురవని వ్యాధిని గుర్తించి, దాని వ్యాప్తిని నివారించి అదుపు చేయడానికి 12 నెలల అతి తక్కువ సమయంలో పరిశోధనలు సాగించి, మందులను కనిపెట్టి వాటిని పరీక్షించి వినియోగానికి సిద్ధం చేసిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. చరిత్రలో అత్యంత తక్కువ వ్యవధిలో వాక్సిన్ ను సిద్ధం చేసిన శాస్త్రవేత్తలు తమ ప్రతిభ ద్వారా ప్రపంచ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించారని డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. 2021లో ఐక్యత ద్వారా మనుగడ సాధించడానికి కృషి జరగాల్సి ఉంటుందని అన్నారు.
కోవిడ్ ను నివారించడానికి ప్రపంచవ్యాపితంగా వ్యాధి నిరోధక టీకాలు సిద్ధం అవుతున్నాయని ఇవి భవిషత్ పై ఆశను కలిగిస్తున్నాయని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. కోవిడ్ -19 రూపంలో ఎదురైన ,మహమ్మారిని ప్రపంచ దేశాలు కలసికట్టుగా ఆధునిక సాంకేతికతను వినియోగించి తరిమి కొట్టాయని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. కోవిడ్ -19 నివారణకు రూపొందిన టీకాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చినప్పుడు మాత్రమే పరిశోధనలకు అర్ధం ఉంటుందని అన్నారు. కరోనా ప్రభావం పేదలపై ఎక్కువగా పడుతుందని గుర్తించాలని అన్నారు. దీని ప్రభావం వల్ల ఇంతవరకు సాధించిన అభివృద్ధి వృధాగా పోయే ప్రమాదం ఉందని గుర్తించాలని స్పష్టం చేశారు. సుస్థిర అభివృద్ధిని కొనసాగించి ప్రగతి పధంలో నడవడానికి కోవిడ్ వాక్సిన్ ను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురాక తప్పదని ఆయన స్పష్టం చేశారు. కొవిడ్ నివారణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్యమైన పాత్రను పోషించిందని అన్న డాక్టర్ హర్షవర్ధన్ అంకిత భావంతో సంస్థ ఉద్యోగులు ప్రపంచ దేశాలను పెను ప్రమాదం నుంచి తప్పించారని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఏడు దశాబ్దాల అనుభవంతో కోవిడ్-19 ను సమర్ధంగా ఎదుర్కొన్నదని అన్నారు.
ఆరోగ్య రంగంలో పెట్టుబడుల ఆవశ్యకతను గుర్తుచేసిందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. పరిస్థితిని ఎదుర్కోడానికి ప్రపంచదేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు మరిన్ని నిధులను కేటాయించవలసిన అవసరం ఉందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. కోవిడ్ వల్ల అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. అయితే, ఇదే సమయంలో ఆరోగ్య రంగ ప్రాధాన్యతను ప్రపంచ దేశాలు గుర్తించి ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షించదగ్గ అంశమని అన్నారు. కోవిడ్ వల్ల ఆరోగ్య రంగంలో ఉన్న లోటుపాట్లను గుర్తించి వాటిని సవరించడానికి అవకాశం కలిగిందని అన్నారు. ప్రపంచ దేశాల మనుగడకు ఆరోగ్య రంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్యం లేనిదే సంపద లేదని గుర్తించి వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాడానికి సమిష్టి కృషి అవసరమని అన్నారు. సవాళ్ళను కలసి కట్టుగా ఎదుర్కొని విజయం సాధించామని ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అన్నారు. సవాళ్ళను ఎదుర్కొంటూ భవిషత్ పై దృష్టి సారించి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని ఆయన ప్రపంచ ఆరోగ్యసంస్థకు పిలుపు ఇచ్చారు. 2021 సంవత్సరం సానుకూల వాతావరణంలో ప్రారంభం అయ్యిందని అన్న డాక్టర్ హర్షవర్ధన్ వాక్సిన్ వచ్చిందన్న ధీమాకు పోకుండా జాగ్రత్తగా వుండాలని అన్నారు. ఇప్పటికీ కొత్తగా కరోనా కేసులు బయటపడుతున్నాయని గుర్తించాలని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో సమర్ధంగా పనిచేసిందని గుర్తు చేసిన డాక్టర్ హర్షవర్ధన్ ఇకపై కూడా ఇదే స్పూర్తితో పనిచేయాలని అన్నారు. ప్రపంచ దేశాలు పరస్పర సహకారంతో కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించి సుస్థిర అభివృద్ధి సాధనకు కృషి చేయాలని ఆయన కోరారు. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య రంగానికి సంబంధించిన ప్రణాలికను రూపొందిస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
***
(Release ID: 1689908)
Visitor Counter : 191