ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఢిల్లీ ఎయిమ్స్ లో కొత్తగా నిర్మించిన బర్న్స్ ప్లాస్టిక్ సర్జరీ బ్లాకును ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్ ' ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు సుశ్రుతకు బ్లాకు అంకితం

' ఆరోగ్య రక్షణలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలన్నది భారత్ లక్ష్యం'

Posted On: 18 JAN 2021 3:53PM by PIB Hyderabad

న్యూఢిల్లీ ఎయిమ్స్ లో కొత్తగా నిర్మించిన బర్న్స్ ప్లాస్టిక్ సర్జరీ బ్లాకును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు. దీనిని ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు సుశ్రుతకు అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ప్రత్యేకంగా కాలిన గాయాలు ప్లాస్టిక్ సర్జరీకి ఒక బ్లాక్ ను ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకతను వివరించారు. ' కాలిన గాయాల వల్ల భారతదేశం అత్యధికంగా కార్మిక శక్తిని కోల్పోతున్నది. అధివృద్ది చెందుతున్న ఆర్థికవ్యవస్థను కలిగి ఉన్న భారతదేశంలో ఇది ఆందోళన కలిగించే అంశం. ఏడాదికి సరాసరిన భారతదేశంలో 70 లక్షల మంది కాలిన గాయాల బారిన పడుతున్నారు. వీరిలో 1. 4 లక్షల మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇంతేకాకుండా మరో 2. 4 లక్షల మంది తీవ్ర అంగవైకల్యాలకు గురవుతున్నారు. గాయపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో కాలిన గాయాలకు చికిత్స అందిస్తున్న కేంద్రాలపై భారం పడుతోంది. ఇంతేకాకుండా వీటిలో ఆధునిక చికిత్స అందించడానికి తగినన్ని సౌకర్యాలు లేవు. కాలిన గాయాలతో వస్తున్న వారికి తగిన చికిత్స అందించాలన్న లక్ష్యంతో ఎయిమ్స్ లో బుర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ బ్లాకును ఏర్పాటు చేసాం.'అని మంత్రి వివరించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చికిత్సా సౌకర్యాల కొరత తీరుతుందని అన్నారు. 'మూడు లక్ష్యాలతో బుర్న్స అండ్ ప్లాస్టిక్ సర్జరీ బ్లాకును ఏర్పాటు చేయడం జరిగింది.దీనిలో మొదటిది కాలిన గాయాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్యను తగ్గించడం. ప్రస్తుతం కాలిన గాయాలతో ఏటా 1. 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఆందోళన కలిగించే విధంగా ఉంది.' అని మంత్రి అన్నారు. కాలిన గాయాలతో చికిత్స కోసం వస్తున్న వారికి ఇన్ఫెక్షన్లు సోకడంతో వారు మరణిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇన్ఫెక్షన్ల నివారణకు చికిత్స అందించడానికి ఐసీయూ లో 30 ప్రైవేటుగా మరో 10 ప్రత్యేక గదులను ఏర్పాటు చేశామని తెలిపారు. కాలిన గాయాల వల్ల అంగ వైకల్యం కలగకుండా చూడాలన్న రెండో లక్ష్యంతో ఇక్కడ ఆధునిక చికిత్సను అందుబాటులోకి తెచ్చామన్నారు. తక్కువ ఖర్చుతో చికిత్సను అందించాలన్నది బర్న్స్ ప్లాస్టిక్ సర్జరీ బ్లాకు మూడవ లక్ష్యమని మంత్రి వివరించారు. కాలిన గాయాలకు చికిత్స పొందడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. వైద్యం కోసం చేసే ఖర్చు ప్రత్యక్ష ఖర్చుగా ఉంటుందని అన్న మంత్రి గాయాల వల్ల ఉపాధి, వేతనాలు కోల్పోవడం ఉత్పత్తి తగ్గడం లాంటివి పరోక్ష నష్టాలు కష్టాలుగా వుంటాయని అన్నారు.

' బర్న్స్ ప్లాస్టిక్ సర్జరీ బ్లాకులో ఉన్నాయి ఏడాదికి 15,000 మందికి అత్యవసర చికిత్సను అందించడానికి, 5,000 మందిని చేర్చుకుని చికిత్స అందించడానికి సౌకర్యాలు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో రోగులు వచ్చే ప్రాంతాన్ని వార్డుగా మార్చి తక్షణ చికిత్స అందించడానికి సౌకర్యాలు ఉన్నాయి. బర్న్స్ ప్లాస్టిక్ సర్జరీ బ్లాకును గాయాల కేంద్రంతో అనుసంధానం చేయడం వల్ల వెంటనే స్పందించడానికి వైద్యులకు అవకాశం కలుగుతుంది. దీనివల్ల మరణాలు తగ్గడమే కాకుండా అంగ వైకల్య శాతం కూడా తగ్గుతుంది.' అని డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు.

' పురాతన కాలంలో కాలిన గాయాలకు అందించిన చికిత్సా విధానాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఆయుష్ తో పాటు ఇతర ఆధునిక చికిత్సా విధానాలను అందించడానికి తగిన ఏర్పాట్లను చేసాము. వాక్, హైపర్ బరిక్ ఆక్సిజన్ ఛాంబర్ లాంటి సౌకర్యాలు కలిగివున్న ఈ కేంద్రంలో చికిత్సా విధానాలలో శిక్షణ ఇవ్వడానికి సౌకర్యాలు కలిగి వుంది' అని మంత్రి వివరించారు. ఈ కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రందీప్ గులేరియా, డీజీహెచ్ఎస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీల్ కుమార్, ప్లాస్టిక్ విభాఘాధిపతి డాక్టర్ మనీష్ సింఘాల్ ఎయిమ్స్ ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు ఎయిమ్స్ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

***

​​

 

 (Release ID: 1689706) Visitor Counter : 184