ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ఆర్థిక వ్యవస్థ త్వరలోనే గాడిలో పడుతుంది: ఉపరాష్ట్రపతి ఆశాభావం

-     కరోనాపై పోరాటంతోపాటు ఆర్థిక వ్యవస్థ పునరుత్థానం దిశగా భారత్ గణనీయమైన ప్రగతిని సాధిస్తోందని వెల్లడి

-     దేశ ఆర్థికాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భారతీయ కార్పొరేట్ రంగం మరింత చొరవతీసుకోవాలని సూచన

-     కంపెనీ సెక్రటరీలు ఉత్తమ పద్ధతులనుపాటిస్తూ.. కార్పొరేట్ కంపెనీల్లో పారదర్శకతకు పెద్దపీటవేయాలి

-     ఇనిస్టిట్యూట్ ఆప్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఈ-స్నాతకోత్సవం సందర్భంగా గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

Posted On: 18 JAN 2021 1:23PM by PIB Hyderabad

కరోనా మహమ్మారి కారణంగా కాస్త వెనక్కు తగ్గినట్లు కనిపించిన భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే మళ్లీ ప్రగతిబాట పడుతుందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రగతిపథంలో భారత కార్పొరేట్ రంగం మరింత చొరవతీసుకోవాల్సిన అవసరముందని ఆయన సూచించారు.

 

సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) జాతీయ ఈ-స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పెను ప్రభావాన్ని చూపించినప్పటికీ.. భారతదేశం సమిష్టిగా ఈ మహమ్మారిని అడ్డుకోవడంలో కొంతమేర విజయం సాధించిందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా చాలా ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తుచేస్తూ.. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా  కేంద్రప్రభుత్వంతీవ్రంగాకృషిచేస్తోందన్నారు.

కరోనాను ఎదుర్కోవడంతోపాటు ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ.. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ శ్రీమతి క్రిస్టాలినా జార్జీవా ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉపరాష్ట్రపతి ఉటంకించారు.

ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను మరింత ప్రభావవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు భాగస్వామ్య పక్షాలన్నీ ఒకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు.  ఐసీఎస్ఐవంటిసంస్థలుఉత్తమకార్పొరేట్పాలనాపద్ధతులనుఅవలంబిస్తూ.. మరింతకృషిచేయాలనిఆయనసూచించారు.

ఏ సంస్థ పురోగతైనా.. ఆ సంస్థలో అనుసరించే పద్ధతులపైనే ఆధారపడి ఉంటుందని.. ఆయా సంస్థల్లో పారదర్శకత, సమగ్రత, నిజాయితీ వ్యవస్థను నెలకొల్పడంతోపాటు నైతికతకు పెద్దపీట వేయడంలో కంపెనీ సెక్రటరీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదంతో ముందుకెళ్తున్న దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో కంపెనీ సెక్రటరీల పాత్ర చాలా కీలకమన్నారు.

ప్రొఫెషనల్‌గా ఉండటంతోపాటు చట్టబద్ధంగా కంపెనీలు పనిచేయడంపైనా దృష్టిపెట్టాలన్నారు. ఇందుకోసం ఉత్తమ పద్ధతులను అవలంబించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. నియమాలను, విలువలు, ప్రమాణాలు పాటించేలా కంపెనీ యాజమాన్యాలకు మార్గదర్శనం చేయాలని.. కంపెనీ సెక్రటరీలకు సూచించారు. 

భారతదేశ వ్యవసాయ రంగాన్ని సుస్థిరం చేసేందుకు జరుగుతున్న విధానపర నిర్ణయాల అమల్లో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ముందుకెళ్లాలన్నారు. కరోనా సమయంలో అన్ని రంగాలు కాస్త ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ.. ఒక్క వ్యవసాయరంగమే.. ఉత్పత్తితోపాటు సాగు కూడాను పెంచి భారతదేశ ఆహారభద్రతను సునిశ్చితం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

భారతదేశంలో యువశక్తికి కొదువలేదని.. కావాల్సిందల్లా ఆ శక్తికి నైపుణ్యాన్ని అందించి ఆత్మనిర్భర భారత నిర్మాణానికి సిద్ధం చేయడంలో వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు కృషిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

ఏ రంగంలో ఉన్నవారైనా మన పురాణేతిహాసాలను చదివి అందులోని నైతిక విలువలు, మన బాధ్యతలను అవగతం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. దీంతోపాటుగా.. వైభవోపేతమైన భారతదేశ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. జాతీయవాదాన్ని అలవర్చుకుని.. ప్రతి అడుగులోనే దేశ శ్రేయస్సును నింపుకుని పనిచేయాలని కూడా ఉపరాష్ట్రపతి సూచించారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో, ఆ తర్వాత ఆధునిక భారత నిర్మాణం కోసం శ్రమించిన సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహానుభావుల గురించి అధ్యయనం చేయాలని కూడా ఉపరాష్ట్రపతి సూచించారు.

శారీరక దారుఢ్యంతోనే మానసిక ఆరోగ్యం సాధ్యమవుతుందన్న ఉపరాష్ట్రపతి.. కంపెనీ సెక్రటరీలు తీవ్రమైన పని ఒత్తిడిలో పనిచేస్తున్నప్పటికీ.. యోగ, ధ్యానం వంటి వాటి ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని సూచించారు.

భారత్‌తోపాటు దుబాయ్, అమెరికా, బ్రిటన్, సింగపూర్‌ల్లోనూ ఐసీఎస్ఐ కార్యకలాపాలు ప్రారంభవడాన్ని ఉపరాష్ట్రపతి హృదయపూర్వకంగా అభినందించారు.

పర్యావరణ పరిరక్షణ పైనా కంపెనీ సెక్రటరీలు ప్రత్యేక దృష్టి సారించాలని.. తమ దైనందిన కార్యకలాపాల్లో ఈ అంశానికి ప్రాధాన్యతనిస్తూ.. భాగస్వామ్యపక్షాలందరిలో పర్యావరణ స్పృహను పెంచడంతోపాటు.. వ్యాపార కేంద్రాలు, పరిశ్రమల వద్ద ప్రకృతి పరిరక్షణ జరిగేలా చొరవతీసుకోవాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి శ్రీ మహ్మద్ మహమూద్ అలీ,ఐసీఎస్ఐ అధ్యక్షుడు శ్రీ ఆశిష్ గార్గ్, సంస్థ కార్యదర్శి శ్రీ ఆశిష్ మోహన్, సహకార్యదర్శి శ్రీ అంకుర్ యాదవ్‌తోపాటు కంపెనీ సెక్రటరీలు, కంపెనీ సెక్రటరీ పట్టభద్రులు ప్రత్యక్షంగా, దేశంలోని నాలుగు ప్రధాన కేంద్రాలనుంచి ఆన్‌లైన్ వేదిక ద్వారా పాల్గొన్నారు.

***



(Release ID: 1689634) Visitor Counter : 139