ప్రధాన మంత్రి కార్యాలయం

గత కొన్నేళ్లుగా భారత రైల్వే ఆధునీకరణకు అసాధారణ కృషి : ప్రధానమంత్రి శ్రీ మోదీ

Posted On: 17 JAN 2021 2:19PM by PIB Hyderabad

ఇటీవల కాలంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి దృక్పథంలో చోటు చేసుకున్న మార్పులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ మార్పుల కారణంగా భారత రైల్వే ఆధునీకరణలో అసాధారణ పురోగతి చోటు చేసుకుందని ఆయన అన్నారు. గుజరాత్ లోని కెవాడియాకు దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి నిరంతర అనుసంధానం కల్పించే ఎనిమిది రైళ్లకు పచ్చజెండా ఊపడంతో పాటు గుజరాత్ లో పలు రైల్వే ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో ప్రారంభించిన అనంతరం శ్రీ మోదీ మాట్లాడారు.
 
గతంలో ఎప్పుడూ పాతబడిపోయిన మౌలిక వసతులతోనే సరిపెట్టుకునే వారని. కొత్త టెక్నాలజీల కోసం కృషి చేయడం గాని, కొత్త ఆలోచనా ధోరణి అనుసరించడం గాని చేయలేదని ప్రధానమంత్రి అన్నారు. ఆ వైఖరిని మార్చడం తప్పనిసరి అయిందని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో మొత్తం రైల్వే వ్యవస్థను సమగ్ర స్థాయిలో పరివర్తనం చేసేందుకు ఎంతో కృషి జరిగిందని, రైల్వే బడ్జెట్ లో మార్పులు చేయడమే కాకుండా కొత్త రైళ్లను కూడా ప్రకటించడం జరిగిందని ఆయన అన్నారు. కెవాడియాను అనుసంధానం చేసేందుకు బహుముఖీన దృక్పథం ఆచరించడంతో పాటు రికార్డు సమయంలో దాన్ని పూర్తి చేయడం ఇందుకు చక్కని ఉదాహరణ అని ఆయన చెప్పారు. 

పాత వైఖరులు మారాయనేందుకు ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ను కూడా ఉదాహరణగా ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇటీవల ప్రధానమంత్రి తూర్పు, పడమర కారిడాలర్లను జాతికి అంకితం చేశారు. 2006-2014 సంవత్సరాల మధ్య కాలంలో ఈ కారిడార్ పని అంతా కాగితాలకే పరిమితం అయిందని, కనీసం ఒక్క కిలోమీటరు రైలు మార్గం కూడా నిర్మించలేదని వివరిస్తూ ఇటీవల కాలంలో ఆ ప్రాజెక్టులో పురోగతి చోటు చేసుకుందని ప్రధానమంత్రి చెప్పారు.  రాబోయే కొద్ది రోజుల్లో 1100 కిలోమీటర్ల రైలుమార్గం పూర్తి కానున్నట్టు ఆయన తెలిపారు.
 

***(Release ID: 1689625) Visitor Counter : 79