ప్రధాన మంత్రి కార్యాలయం

డిజిటల్ విప్ల‌వానికి, నూత‌న త‌ర ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఈ శ‌తాబ్ద‌మే సాక్షి: ప‌్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ

ఈ శ‌తాబ్దాన్ని ఆసియా శ‌తాబ్దంగా తీర్చిదిద్ద‌డానికిగాను కృషి చేయాల‌ని బిమ్ స్టెక్ దేశాల‌కు పిలుపునిచ్చిన ప్ర‌ధాని శ్రీన‌రేంద్ర మోదీ

బిమ్ స్టెక్ దేశాల్లో స్టార్ట‌ప్ రంగంలో జ‌రుగుతున్న కృషిని ప్ర‌శంసించిన ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 16 JAN 2021 8:55PM by PIB Hyderabad

జ‌నాభాలో ఐదో వంతు బిమ్ స్టెక్ దేశాల్లో వుంద‌ని, ఈ దేశాల జిడిపి 3.8 ట్రిలియ‌న్ డాల‌ర్లుగా వుంది కాబ‌ట్టి ఈ శ‌తాబ్దాన్ని ఆసియా శ‌తాబ్దంగా మార్చ‌గ‌లిగే శ‌క్తి బిమ్ స్టెక్ దేశాల‌కే వుంద‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. "ప్రారంభ్: స‌్టార్ట‌ప్ ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ స‌మ్మిట్" పేరు మీద ఏర్పాటు చేసిన స‌మావేశాన్ని వీడియా కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించిన త‌ర్వాత ప్ర‌ధాని ప్ర‌సంగించారు. 


బంగ్లాదేశ్ , భూటాన్‌, భార‌త దేశం, నేపాల్‌, శ్రీలంక‌, మైన్మార్, థాయిల్యాండ్ దేశాల్లో స్టార్ట‌ప్ రంగం ఎంతో ఉజ్వ‌లంగా విస్త‌రించి వుంద‌ని ప్ర‌ధాని అన్నారు. ఈ శ‌తాబ్దం డిజిట‌ల్ విప్ల‌వానికి, నూత‌న త‌ర ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ప్ర‌తీక‌గా నిలుస్తోంద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. కాబ‌ట్టి ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వినిపిస్తున్న డిమాండ్ ప్ర‌కారం భ‌విష్య‌త్తు సాంకేతిక‌త‌, దానికి సంబంధించిన వ్యాపార‌వేత్త‌లు ఇదే ప్రాంతంనుంచి రావాలని ఆయ‌న ఆకాంక్షించారు. ఇందుకోసం ఐక‌మ‌త్యంగా, భాగ‌స్వామ్యంతో ప‌ని చేయాల‌ని కోరుకుంటున్న ఆసియా దేశాలు ముందుకు వ‌చ్చి బాధ్య‌త తీసుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. మ‌న దేశాల మ‌ధ్య‌న ఉమ్మ‌డి సంస్కృతి, నాగ‌రిక‌త‌, సంబంధ‌బాంధ‌వ్యాలున్నాయ‌ని ఆయ‌న గుర్తు చేశారు. మ‌నం మ‌న ఆలోచ‌న‌ల్ని, భావ‌న‌ల్ని, మంచి చెడ్డ‌ల్ని ఒక‌రితో మ‌రొక‌రం చెప్పుకుంటున్నామ‌ని, కాబ‌ట్టి ఈ సంద‌ర్భంగా విజ‌యాల‌ను కూడా పంచుకోవాల్సి వుంద‌ని ఆయ‌న అన్నారు. ప్రపంచ జ‌నాభాలో ఐదో భాగం వున్న మ‌న బిమ్ స్టెక్ దేశాలపైన స‌హ‌జంగానే బాధ్య‌త‌లు కూడా వున్నాయ‌ని ఆయ‌న అన్నారు. బిమ్ స్టెక్ దేశాల్లోని యువ‌త శ‌క్తియుక్తుల సామ‌ర్థ్యాల‌ను ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీ గుర్తించారు. బిమ్ స్టెక్ స‌మావేశం 2018 స‌మ‌యంలో  ఈ అంశంపైన మాట్లాడిన ప్ర‌ధాని శ్రీ మోదీ సాంకేతిక‌త‌, ఆవిష్క‌ర‌ణ రంగాల్లో భాగ‌స్వామ్యం కోసం నాడు పిలుపునిచ్చారు. బిమ్ స్టెక్ స్టార్ట‌ప్ స‌మావేశంకోసం ఆ రోజున ఆయ‌న ప్ర‌తిపాదన చేశారు. ఆ రోజున క‌న‌బ‌రిచిన‌ ఆకాంక్షమేర‌కు రూపొందిన‌దే నేటి స్టార్ట‌ప్ ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ స‌మావేశ‌మ‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ గుర్తు చేశారు. 
ఈ ప్రాంతంలోని దేశాల మ‌ధ్య‌న వ్యాపార సంబంధాల‌ను, క‌నెక్టివిటీని పెంపొందించ‌డానికిగాను చేప‌డుతున్న చ‌ర్య‌ల గురించి ప్ర‌ధాని వివ‌రించారు. డిజిట‌ల్ క‌నెక్టివిటీని ప్రోత్స‌హించ‌డంకోసం 2018లో బిమ్ స్టెక్ మంత్రులు పాల్గొన్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ గురించి ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. అదే విధంగా రక్ష‌ణ‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ‌, అంత‌రిక్షం, వ్యవ‌సాయం, వ్యాపార రంగాల్లోని భాగ‌స్వామ్యాల గురించి వివ‌రించారు. ఈ రంగాల్లో దేశాల మ‌ధ్య‌న ఏర్ప‌డే బ‌ల‌మైన సంబంధాల కార‌ణంగా స్టార్ట‌ప్ కంపెనీలు ల‌బ్ధి పొందుతాయ‌ని ప్ర‌ధాని అన్నారు. త‌ద్వారా ప్రాధ‌మిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌, వ్య‌వ‌సాయ‌, వ్యాపార రంగాల్లో పొత్తులు బ‌లోపేత‌మై నూత‌న అవ‌కాశాలు ఏర్ప‌డ‌తాయ‌ని ఆయ‌న అన్నారు. అది తిరిగి మ‌ర‌లా ఈ రంగాల వృద్ధికే దోహ‌దం చేస్తుంద‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ స్ప‌ష్టం చేశారు. 

 

***



(Release ID: 1689552) Visitor Counter : 70