ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం

ప్రపంచపు అతిపెద్ద టీకాల కార్యక్రమానికి నేడు భారత్ శ్రీకారం

ఈ చరిత్రాత్మక సందర్భంలో ఢిల్లీ ఎయిమ్స్ లో డాక్టర్లు,

ఆరోగ్య కార్యకర్తలతో పాలుపంచుకున్న డాక్టర్ హర్ష వర్ధన్

ఢిల్లీ ఎయిమ్స్ లో తొలి టీకా వేయించుకున్న పారిశుద్ధ్య కార్మికుడు

కోవిడ్ అంతానికి ఇది ఆరంభం: కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్ష వర్ధన్

“కోవిడ్ మీద విజయానికి సంకేతంగా టీకామందు ఒక సంజీవని వంటిది”

“ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్యశాఖామంత్రులు

ఒక జట్టుగా ఈరోజు చరిత్ర సృష్టించారు”

Posted On: 16 JAN 2021 5:25PM by PIB Hyderabad

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ టీకాల కార్యక్రమాన్ని  ప్రారంభించిన చరిత్రాత్మక సందర్భంలో భాగంగా ఢిల్లీ ఎయిమ్స్ లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్లు, ఆరోగ్య సంరక్షక సిబ్బంది కార్యకర్తలతోబాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ పాల్గొన్నారు.  

ఢిల్లీ ఎయిమ్స్ లో పారిశుద్ధ్య కార్మికుడు శ్రీ మనీశ్ కుమార్ మొత్తమొదటి కోవిడ్ టీకా తీసుకున్న సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, కోవిడ్ మీద దేశం జరిపిన పోరులో నిస్వార్థసేవలందించిన వారందరికీ ఈ సందర్భంగా మరోమారు ధన్యవాదాలు చెప్పారు.

ఏడాది కిందట మొదలైన ఈ కోవిడ్ మహమ్మారి సంక్షోభం క్లైమాక్స్ కు ఇది ఆరంభంగా ఆయన అభివర్ణించారు. ఈ సంక్షోభం ఆరంభమైనప్పటినుంచి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అడుగడుగునా దీని నిర్వహణ వ్యవహారాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవటాన్ని ఆయన గుర్తు చేశారు. కోవిడ్ టీకాను అందుబాటులోకి తీసుకురావటానికి ఐదు నెలలపాటు జరిగిన అవిశ్రాంత కృషి ఈరోజుకు పూర్తయిందని కూడా అన్నారు.

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 10.30 కి  కోవిడ్ టీకాల కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

అతి తక్కువ సమయంలో టీకా మందు తయారు చేయటం, ప్రపంచపు అతిపెద్ద టీకాల కార్యక్రమాన్ని ఆరంభించటం  ఒక అద్భుతమని మంత్రి అభివర్ణించారు. ఈరోజు ఏకకాలంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 3006 ప్రదేశాలలో ఒక్కొ చోట సుమారు 100 మంది లబ్ధిదారులకు టీకాలిచ్చే కార్యక్రమం ఇది అని చెప్పారు. 138 కోట్ల జనాభా ఉన్న దేశంలో సార్వత్రిక టీకాల కార్యక్రమం అమలు చేయటమన్నది చాలా గొప్ప విషయమన్నారు. టీకాల ద్వారా నివారించగలిగే పన్నెండు వ్యాధులకు టీకాలిచ్చిన ఘనత భారతదేశానికుందన్నారు. ప్రపంచదేశాలన్నిటికీ ఆ విఉధంగా ఆదర్శంగా నిలిచామన్నారు.  మశూచీ, పోలియో తరువాత ఇప్పుడు కోవిడ్ వంతు వచ్చిందని చెప్పారు. అత్యంత మారుమూల, చేరుకోనలవి గాని  ప్రాంతాలతోబాటు పట్టణప్రాంత మురికివాడలు, గిరిజన తాండాలు కూడా ఈరోజు టీకాల కార్యక్రమంలో భాగమయ్యాయన్నారు.

ఈ భారీ కార్యక్రమం చేపట్టటానికి ముందు జరిగిన ఏర్పాట్లను డాక్టర్ హర్ష వర్ధన్ వివరించారు. “ లక్షమందికి పైగా టీకాలిచ్చేవాళ్లకు శిక్షణ ఇచ్చాం. నమూనా టీకాల కార్యక్రమాలు అనేకం చేపట్టాం.  మధ్యలో అవాంతరాలు ఏర్పడే అవకాశాలను బేరీజు వేయటానికి దేశవ్యాప్తంగా నమూనా కార్యక్రమాలు నిర్వహించాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వాడుకోవటానికి ఈ-విన్ వేదికను కో-విన్ వేదికగా మార్పులు చేశాం. ఈ రోజు జరిగే టీకాల కార్యక్రమం గురించి రెండు రోజుల ముందుగానే టీకాలు తీసుకునే లబ్ధిదారులకు ఎస్ ఎం ఎస్ ద్వారా తెలియజేశాం. నిర్దిష్ట వ్యవధిలో మళ్లీ మళ్ళీ పంపుతూ గుర్తు చేశాం. అదే విధంగా లబ్ధిదారులందరికీ రెండో విడత గురించి కూడా సందేశాలు పంపే ఏర్పాటు చేశాం” అన్నారు. 

ఒక బృందంగా కలసి కట్టుగా చేసిన కృషికి తోడు రాజకీయ అంకితభావం కూడా ఈ భారీ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచిందన్నారు.  ప్రధానితోబాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖామంత్రులు ఉమ్మడిగా కృషి చేసి ఈ రోజును చరిత్రాత్మకం చేసారని డాక్టర్ హర్ష వర్ధన్ అభివర్ణించారు.

  ( ఫొటో: తొలి కోవిడ్ టీకా ఇస్తుండగా చూస్తున్న డాక్టర్ హర్షవర్ధన్ )

 నిరుడు కోవిడ్ మీద పోరులో కీలకమైన మైలురాళ్లను డాక్టర్ హర్ష వర్ధన్ ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేశారు. వ్యాధి తీరుకు తగినట్టుగా స్పందిస్తూ తీసుకున్న చర్యలు, అనుసరించిన నిర్వహణా విధానం, పర్యవేక్షణ, తగిన చికిత్స అందించటం ద్వారా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగకుండా నివారించగలగటాన్ని ప్రస్తావించారు. 96% పైగా కోలుకున్నవారుండటంతో ప్రపంచదేశాల్లో అత్యధికంగా కోలుకున్నవారున్న దేశంగా భారత్ నిలిచిందన్నారు. అదే విధంగా ప్రపంచంలో అత్యల్పంగా 1.5% మాత్రమే మరణాలు నమోదు చేసుకున్న దేశంగా కూడా భారత నిలిచిందన్నారు. టీకాలను విజయపథం గా అభివర్ణిస్తూ కోవిడ్ మీద పొరులో ఇవి సంజీవనిగా చిరకాలం ప్రజలకు గుర్తుండిపోతాయన్నారు.

ప్రాణాలకు సైతం తెగించి ఇతరుల ప్రాణాలు కాపాడిన కొవిడ్ యోధులను డాక్టర్ హర్ష వర్ధన్ ఈ సందర్భంగా మరోమారు గుర్తు చేసుకున్నారు. అందుకే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని ఆరోగ్య సిబ్బందికే తొలి వాక్సిన్ ఇవ్వాలన్న నిర్ణయం  జరిగిందన్నారు.  టీకాల  ట్రయల్స్ లో పాల్గొని విజయవంతం కావటానికి సహకరించిన సామాన్య ప్రజల ఔన్నత్యాన్ని కూడా మంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.

కోవిడ్ టీకాలమీద అనవసరమైన పుకార్లు సృష్టిస్తున్నవారి వైఖరిని ఖండించాల్సిన అవసరముందన్నారు. అలాంటి దుష్ప్రచారాలను, పుకార్లను నమ్మవద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.  కేవలం విశ్వసనీయమైన, అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరారు. ప్రజాజీవితం మళ్లీ యధాపూర్వ స్థితికి రావాలని  యావత్ ప్రజానీకం కోరుకుంటున్నదన్నారు. కొంతమంది తమ దగ్గరి వాళ్ళను కోల్పోయారని, ఈ క్రమంలో ఈ మొత్తం ప్రక్రియ సమగ్రతనే ప్రశ్నించటమంటే, సమాజ భవిష్యత్ కోసం  త్యాగం చేసినవారిని అవమానించటమేనని మంత్రి వ్యాఖ్యానించారు.  

ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్య రంగం), కోవిడ్ టీకా పంపిణీమీద జాతీయ నిపుణుల బృందం అధ్యక్షుడు అయిన  డాక్టర్ వికె పాల్ కూడా ఈరోజు ఎయిమ్స్ లో టీకాలు వేయించుకున్నారు. 

న్యూ ఢిల్లీ ఎయిమ్స్ కు వెళ్ళిన తరువాత కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్ష వర్ధన్,  గంగారాం ఆస్పత్రిలో టీకాల కేంద్రాన్ని కూడా సందర్శించారు. అక్కడి ఆరోగ్య సిబ్బంది తో మాట్లాడి, దేశసేవలో వారందించిన స్ఫూర్తికి చేతులెత్తి నమస్కరించారు. “ నెలల తరబడి మీరందించిన నిస్వార్థ సేవలవల్లనే ఈ  రోజు మేమంతా సురక్షితంగా ఉన్నాం” అన్నారు.    

***



(Release ID: 1689234) Visitor Counter : 220