ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

పర్యాటక సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భారతదేశ ఉదాత్త శక్తి (సాఫ్ట్ పవర్)ని ప్రపంచానికి చాటాలి - ఉపరాష్ట్రపతి

• పర్యాటక పరిశ్రమ పునరుజ్జీవం కోసం “దేశీయ యాత్ర”లు చేయాలన్న ప్రజల ఆసక్తిని అవకాశంగా మలచుకోవాలి

• పర్యాటకుల విశ్వాసాన్ని పొందేందుకు ఆరోగ్య నిబంధలను అనుసరించాలని ఆతిథ్య పరిశ్రమకు ఉపరాష్ట్రపతి సూచన

• పర్యాటకుల హృదయాల్లో గోవాకు ప్రత్యేక స్థానం ఉంది – ఉపరాష్ట్రపతి

• గోవాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ లో ఉపరాష్ట్రపతి ప్రసంగం

Posted On: 12 JAN 2021 1:39PM by PIB Hyderabad

భారతదేశ ఉదాత్త శక్తిని ప్రపంచ యవనిక మీద చాటి చెప్పేందుకు పర్యాటక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని భారతీయ ఆతిథ్య పరిశ్రమకు ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. అతిథి దేవో భవ అనే భారతీయ భావనను ప్రస్తావించిన ఆయన, మన సంస్కృతి, వంటకాలు, వీదేశీయుల పట్ల సానుకూల వైఖరి లాంటివి భారతదేశం ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షించడంలో సహాయపడతాయని తెలిపారు.

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానందునికి నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి, ఆ మహనీయుని ఆదర్శాల నుంచి ప్రేరణ పొంది, ఆయన చూపిన బాటలో యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. 

గోవాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ (ఐ.హెచ్.ఎం)లో మాట్లాడిన ఉపరాష్ట్రపతి, ఉపాధి కల్పన ద్వారానే గాక ఆర్థిక వ్యవస్థకు బాసటగా నిలుస్తున్న పర్యాటక రంగ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ పరిశ్రమ 87.5 మిలియన్ల మందికి ఉపాధి కల్పించిందన్న ఆయన, ఇది 2018-19 లో 12.75% ఉపాధి వాటాకు సమానమని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా రాకపోకలు తగ్గిపోవడం, ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోవడం  లాంటి అంశాలు ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బ తీశాయన్న ఉపరాష్ట్రపతి, ఈ తరహా మందగమనం తాత్కాలికమైనదేనని, ఆతిథ్య పరిశ్రమ తిరిగి పునర్వైభవాన్ని సంతరించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ప్రజలు ప్రయాణాల పట్ల ఆసక్తి చూపే అవకాశం ఉందన్న ఉపరాష్ట్రపతి, అంతర్జాతీయ పర్యాటకుల మీద మాత్రమే ఆధారపడిన అనేక ఇతర దేశాలతో పోల్చి చూస్తే, దేశీయ పర్యాటకం కూడా ఉన్న భారతదేశం మీద ప్రతికూల ప్రభావం తగ్గుతుందని తెలిపారు. కోవిడ్ -19 నేపథ్యంలో దేశీయ ప్రయాణాల పట్ల ప్రజల ఆసక్తి ఓ గొప్ప అవకాశమన్న ఉపరాష్ట్రపతి, స్వదేశీ దర్శన్ మరియు ప్రసాద్ (PRASAD) లాంటి పథకాలతో పెరుగుతున్న మార్కెట్ ను అందిపుచ్చుకోవాలని సూచించారు. 

దేశీయ పర్యాటక ప్రదేశాలను సందర్శించడం ప్రజలు తమ పొరుగు రాష్ట్రాలతో ప్రారంభించి, ఇతర రాష్ట్రాలకు సైతం ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన ఉపరాష్ట్రపతి, భారతదేశ అపారమైన సహజ మరియు సాంస్కృతిక సౌందర్యాన్ని ప్రస్తావించారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్, అండమాన్ లోని సెల్యులార్ జైలు, గుజరాత్ లోని ఐక్యతా ప్రతిమలకు తప్పక సందర్శించాలని తెలిపిన ఆయన పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ...  "బాహర్ జానే సే పెహలే, దేఖో అప్నా దేశ్" అని పిలుపునిచ్చారు.

పర్యాటక రంగాన్ని తిరిగి ప్రారంభించడంలో భాగంగా అన్ని రకాల ఆరోగ్య భద్రతా నియమ నిబంధనలను అనుసరించడం ద్వారా పర్యాటకుల విశ్వాసాన్ని నమ్మకాన్ని పొందాలని సూచించిన ఉపరాష్ట్రపతి, ఆతిథ్య పరిశ్రమకు ఇది మరింత ముఖ్యమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి కోవిడ్ -19 భద్రత మరియు పరిశుభ్రతకు సంబంధించిన పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క సమ్మతి వ్యవస్థ, సిస్టమ్ ఫర్ అసెస్ మెంట్, అవేర్ నేస్ అండ్ ట్రైనింగ్ ఇన్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ (సాతి)ని ఆయన ప్రస్తావించారు.  బాధ్యతా యుతమైన ఆతిథ్య కేంద్రాలుగా అతిథి భవనాల పేరు ప్రఖ్యాతల్ని ఇనుమడింపజేయడంతో పాటు సురక్షిత కార్యకలాపాలను కొనసాగించేందుకు, ఆతిథులు విశ్వాసాన్ని పెంచేందుకు సాథి లాంటి కార్యక్రమాలు సహాయపడతాయని తెలిపారు. 

ఈ సందర్భంగా విద్యార్థులతో సంభాషించిన ఉపరాష్ట్రపతి, ఆతిథ్య రంగంలో విజయాన్ని సాధించడంలో సానుకూల వైఖరి మరియు చిరునవ్వుతో కూడిన పలకరింపు అభివృద్ధిని అందిస్తాయని, మాతృభాషను మరచిపోకుండా, తమ రంగంలో బాగా అభివృద్ధి చెందడానికి వీలైనంత ఎక్కువ భాషలను నేర్చుకోవాలని ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. 

తన వ్యక్తిగత జీవితంలోని సందర్భాలను సైతం వారితో పంచుకున్న ఉపరాష్ట్రపతి, విజయాన్ని సాధించేందుకు క్రమశిక్షణతో కష్టపడి పనిచేయాలనే వైఖరితో రాణించాలనే ఆశయంతో పాటు విద్యార్థులు ఒత్తిడితో కాకుండా పనిని ఆస్వాదిస్తూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. 

ప్రధాన పర్యాటక కేంద్రంగా గోవా ప్రాధాన్యతను తెలియజేసిన ఉపరాష్ట్రపతి, గోవా యొక్క సహజ సాందర్యమే గాక కళలు, నిర్మాణ కౌశలం, ఉత్సవాల వంటివి పర్యాటకులకు గొప్ప అనుభూతుల్ని పంచుతాయని, అందుకే దేశీయ పర్యాటకుల హృదయాల్లో గోవాకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమంలో భాగంగా గోవా మరియు జార్ఖండ్ మధ్య సాంస్కృతిక సంబంధాన్ని ప్రదర్శిస్తూ, ఈ సంస్థ తీసుకున్న చొరవను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఈ వినూత్న మార్గం ఇరు రాష్ట్రాల మధ్య బంధాన్ని పెంచడమే గాక, భారతదేశ ఐక్యత మరియు సమగ్రతలను బలోపేతం చేస్తుందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో గోవా ప్రోటోకాల్ మంత్రి శ్రీ మౌవిన్ గోడిన్హో, గోవా పర్యాటక మంత్రిత్వ శాఖ డైరక్టర్ జనరల్ శ్రీమతి మీనాక్షి శర్మ, పర్యాటక మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు శ్రీ జ్ఞాన్ భూషణ్, గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ ఛైర్మన్ శ్రీ జె. అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

***



(Release ID: 1688004) Visitor Counter : 191