వ్యవసాయ మంత్రిత్వ శాఖ
దిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఎనిమిదో దఫా చర్చలు ఈనెల 15న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం
प्रविष्टि तिथि:
08 JAN 2021 7:25PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలపై; కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఎనిమిదో దఫా చర్చలు దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్, రైతుల తరపున 41 రైతు సంఘాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. రైతుల అభ్యంతరాలపై, వ్యవసాయ చట్టాల్లోని అంశాలవారీగా చర్చిద్దామని మంత్రులు మరోసారి విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ చట్టాలు చేసినట్లు శ్రీ తోమర్ వెల్లడించారు. ప్రభుత్వం రైతుల పట్ల సానుభూతితో ఉందని, వారి ఉద్యమాన్ని ముగించాలని కోరుకుంటోందని చెప్పారు.
ఆందోళనను రైతు సంఘాలు ఎంతో క్రమశిక్షణతో చేయిస్తున్నాయని, ఇది అభినందనీయమని అన్నారు. సానుకూల దృక్పథంతో చర్చలు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోందని, అదే జరిగితే, తార్కిక మార్గంలో పరిష్కారాలను కనుగొనవచ్చని వ్యవసాయ మంత్రి చెప్పారు.
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు కోరగా, సవరణలు చేద్దామని కేంద్రం మరోమారు సూచించింది. ఇరువర్గాల మధ్య సుదీర్ఘ చర్చ జరిగినా పరిష్కారం లభించలేదు. దీంతో, ఈనెల 15న మరోమారు సమావేశమై చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు.
***
(रिलीज़ आईडी: 1687322)
आगंतुक पटल : 223