వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్రపంచ వాణిజ్య సంస్థలో భారతదేశం ఏడవ వాణిజ్య విధాన సమీక్ష ప్రారంభమయింది.

వాణిజ్య , ఆర్థిక విధానాలను మరింత సమగ్రంగా , స్థిరమైన రీతిలో మెరుగుపరచడానికి భారతదేశం తీసుకున్న చర్యలను సభ్యులు ప్రశంసించారు.

Posted On: 07 JAN 2021 9:18AM by PIB Hyderabad

భారతదేశం  ఏడవ వాణిజ్య విధాన సమీక్ష (టిపిఆర్) 2021 జనవరి 6 బుధవారం జెనీవాలోని ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రారంభమైంది. టీపీఆర్... ప్రపంచ వాణిజ్య సంస్థ  పర్యవేక్షణ విభాగంలో ఒక ముఖ్యమైన యంత్రాంగం. సభ్యుల జాతీయ వాణిజ్య విధానాలను ఇది పూర్తిగా సమీక్షిస్తుంది. భారతదేశం  చివరి టిపిఆర్ 2015 లో జరిగింది. టిపిఆర్ కోసం భారత అధికారిక ప్రతినిధి బృందం వాణిజ్య కార్యదర్శి డాక్టర్ అనూప్ వాధవన్ నేతృత్వంలో బృందాన్ని నియమించారు. ఈ సందర్భంగా అనూప్ మాట్లాడుతూ  ప్రపంచం తీవ్రమైన ఆరోగ్య , ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ టిపిఆర్ జరుగుతోందని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా సహా కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించడానికి భారతదేశం చేసిన ప్రయత్నాలను ఆయన ప్రస్తావించారు.

 టీకాలు , కోవిడ్-చికిత్సలను అందరికీ సమానంగా , సరసమైన ధరల్లో అందించడానికి  భారతదేశం నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ విషయంలో బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ పోషించగల కీలక పాత్ర విశిష్టత గురించి మాట్లాడారు. కరోనా మహమ్మారి నుండి వెంటనే బయటపడటానికి,  సమర్థవంతమైన చర్యల  స్వల్పకాలిక ప్యాకేజీ ఇవ్వాలని ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశంలో సూచించారు. ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి , నిర్ధారించడానికి కొన్ని ట్రిప్స్ నిబంధనల తాత్కాలిక మాఫీని భారత్ కోరింది. కరోనాకోసం కొత్త డయాగ్నస్టిక్స్, చికిత్సా , టీకాల సకాలంలో , సరసమైన లభ్యత; ఆహార భద్రతా సమస్యలను పరిష్కరించడం, ఇందుకోసం పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ (పిఎస్హెచ్) కోసం శాశ్వత పరిష్కారం; ఆరోగ్య సంరక్షణ నిపుణుల సరిహద్దుల కదలికను సులభతరం చేయడానికి మోడ్ -4 కింద అనుమతులు ఇవ్వడం వంటి మినహాయింపులను అడిగింది.

భారతదేశం  మునుపటి టిపిఆర్ తరువాత గత 5 సంవత్సరాలలో వంద కోట్ల మందికిపైగా భారతీయుల సామాజిక-ఆర్ధిక ఆకాంక్షలను తీర్చడానికి మొత్తం ఆర్థిక పర్యావరణ వ్యవస్థను సంస్కరించడానికి , మార్చడానికి ప్రభుత్వం శ్రద్ధగా పనిచేసిందని వాణిజ్య కార్యదర్శి నొక్కిచెప్పారు. వస్తువులు , సేవల పన్ను చట్టం, దివాలా చట్టం, కార్మిక రంగ సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎఫ్‌డిఐ పాలసీ , మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా , స్కిల్ ఇండియా వంటి వివిధ జాతీయ కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు.  తమ ఉత్పాదక వాతావరణంలో రంగాలలో వేగంగా మార్పులు వచ్చాయన్నారు. విస్తృత సంస్కరణల కారణంగా ఆర్థిక , వ్యాపార వాతావరణంలో మెరుగుదల కనిపించిందన్నారు. ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో 2015 లో 142గా ఉన్న ర్యాంకు, 2019 లో 63 వరకు పెరిగింది.  మహమ్మారి టైంలోనూ తమ దేశాన్ని పెట్టుబడులకు అనువైన ప్రదేశంగా ఇన్వెస్టర్లు గుర్తించారని పేర్కొన్నారు.   మహమ్మారి సమయంలో కూడా భారతదేశాన్ని కావాల్సిన పెట్టుబడి గమ్యస్థానంగా చూశారని, 2020-21 మొదటి ఆరు నెలల్లో ఎఫ్‌డిఐలు 10 శాతానికి పైగా పెరిగి 40 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2019-20లో, భారతదేశం అత్యధికంగా 74.39 బిలియన్ డాలర్ల ఎఫ్డిఐలను అందుకుంది.

ఈ సందర్భంగా డబ్ల్యుటిఒ సెక్రటేరియట్ జారీ చేసిన సమగ్ర నివేదిక, గత ఐదేళ్ళలో భారతదేశం చేపట్టిన అన్ని ప్రధాన వాణిజ్య , ఆర్థిక కార్యక్రమాలను వివరించింది. గత ఐదేళ్లలో భారతదేశం  7.4 శాతం ఆర్థిక వృద్ధి సాధించిందని ప్రశంసించింది.   సంస్కరణ ప్రయత్నాలను కూడా మెచ్చుకుంది.  బలమైన ఆర్థిక వృద్ధి భారతదేశంలో తలసరి ఆదాయం , ఆయుర్దాయం వంటి సామాజిక-ఆర్థిక సూచికలలో మెరుగుదలకు దారితీసిందని నివేదిక పేర్కొంది. భారతదేశం తన ఎఫ్డిఐ విధానాన్ని సరళీకృతం చేయడం, ట్రేడ్ ఫెసిలిటేషన్ ఒప్పందాన్ని ఆమోదించడం , అనేక వాణిజ్య అనుకూల నిర్ణయాలను అమలు చేసినందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రశంసించింది.

  ప్రపంచ వాణిజ్య సంస్థ  టీపీఆర్ బాడీ చైర్, ఐస్లాండ్  రాయబారి మిస్టర్ హరాల్డ్ అస్పెలుండ్  మాట్లాడుతూ భారతదేశం  బలమైన ఆర్థిక వృద్ధి సాధించినందుకు అభినందనలు తెలిపారు. వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి , భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి వివిధ కార్యక్రమాలు , చట్టాలను రూపొందించడానికి భారతదేశం చేసిన కృషిని అభినందించారు. టిటిఆర్ కంటే ముందే డబ్ల్యుటిఒ సభ్యుల నుండి 700 కి పైగా వచ్చిన ప్రశ్నలకు భారతదేశం సకాలంలో , సమగ్రంగా స్పందించినందుకు ఆయన ప్రశంసించారు. భారతదేశం  టిపిఆర్ డిస్కటంట్ థాయిలాండ్ రాయబారి (శ్రీమతి) సునంతా కంగ్వల్కుల్కిజ్ మాట్లాడుతూ ఈ టిపిఆర్ చాలా ముఖ్యమైన సభ్యులలో ఒకరని, ఇండియా కూడా డబ్ల్యుటిఒకు కీలకమైన , అమూల్యమైన సహకారం అందిస్తున్నదని పేర్కొన్నారు. భారతదేశం  బలమైన ఆర్థిక వృద్ధి , సమీక్షించిన కాలంలో తీసుకున్న విస్తృత ఆర్థిక , నిర్మాణాత్మక సంస్కరణలను ఆమె ప్రశంసించారు. ఈ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థ  సామర్థ్యాన్ని , సమగ్రతను పెంచాయని, 2019 లో భారతదేశం 5 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు. భారతదేశం తన ఎఫ్డిఐ విధానాలను సరళీకృతం చేసినందుకు , వ్యవసాయ రంగంలో గణనీయమైన సంస్కరణలను చేపట్టినందుకు ఆమె అభినందించారు.  ఈ సందర్భంగా ప్రసంగించిన 50 మందికి పైగా ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యులు ఇండియా నిర్ణయాలను అభినందించారు. మనదేశ బలమైన, స్థితిస్థాపక ఆర్థిక వృద్ధిని మెచ్చుకున్నారు. ఈజ్ ఆఫ్ బిజినెస్ ర్యాంకును మెరుగుపరుచుకున్న విషయాన్ని ప్రస్తావించారు. వాణిజ్యం,ఆర్థిక విధానాలను మరింత సమగ్రంగా మెరుగుపరచడానికి భారతదేశం అద్భుతమైన నిర్ణయాలు తీసుకుందని సభ్యులు పేర్కొన్నారు. కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా జరిగిన ప్రయత్నాలలో భారతదేశ నాయకత్వ పాత్రను చాలా మంది సభ్యులు ప్రశంసించారు. భారతదేశాన్ని ‘ప్రపంచ ఫార్మసీ’ గా గుర్తించారు.  ఎఫ్డిఐ విధానాల సరళీకరణ, అనేక వాణిజ్య సులభతర చర్యల అమలు, భారతదేశ జాతీయ మేధో సంపత్తి హక్కుల (ఐపిఆర్) విధానాన్ని అమలు చేయడం, ప్రపంచ వాణిజ్య సంస్థ  ప్రశంసలను పొందిన ఇతర సంస్కరణ చర్యలను మెచ్చుకున్నారు. డబ్ల్యూటీఓలో భారత్కు మంచి రికార్డు ఉందని వివరించారు.   ప్రముఖ పారిశ్రామిక, అభివృద్ధి చెందిన దేశాలు భారతదేశ వాణిజ్య విధానంలో, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మరిన్ని సరళీకరణలను కోరాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం  డంపింగ్ వ్యతిరేక, ఇతర వాణిజ్య చర్యలు తీసుకోవాలని విన్నవించాయి. అనేక మంది సభ్యులు తమకు వ్యూహాత్మక, వాణిజ్య భాగస్వామిగా భారతదేశ ప్రాముఖ్యత గురించి ప్రస్తావించారు. మనదేశంతో వారి ద్వైపాక్షిక లేదా ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలలో పురోగతిని కొనసాగించాలని కోరుకున్నారు. డబ్ల్యూటీఓ లో భారతదేశ నాయకత్వ పాత్రను చాలా మంది సభ్యులు ప్రశంసించారు తక్కువ అభివృద్ధి చెందిన దేశాల (ఎల్డీసీలు) సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహకరిస్తున్నందుకు భారతదేశాన్ని ప్రశంసించారు. ఈ టీపీఆర్ సమావేశం 2021 జనవరి 8  వరకు కొనసాగుతుంది. భారతదేశ వాణిజ్య, ఆర్థిక విధానాలపై తదుపరి చర్చలు ఉంటాయి. 

***



(Release ID: 1687122) Visitor Counter : 657