బొగ్గు మంత్రిత్వ శాఖ

30000 కోట్ల రూపాయల పెట్టుబడితో నాల్కో విస్తరణ : ప్రల్హడ్ జోషి వెల్లడి ఘనంగా నాల్కో 41వ వ్యవస్థాపక దినోత్సవం

Posted On: 07 JAN 2021 2:49PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాల్కోని 2027-28 నాటికి 30000 కోట్ల రూపాయల పెట్టుబడితో విస్తరించనున్నట్టు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ ప్రల్హడ్ జోషి వెల్లడించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఈ రోజు జరిగిన నాల్కో 41వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మంత్రి ప్రసంగించారు. ప్రతిపాదిత పెట్టుబడిలో 7000 కోట్ల రూపాయలను 5వ స్టీమ్ రిఫైనరీ, పొత్తంగి బాక్సైట్ గనులు, సౌత్ బ్లాక్ మరియు ఉత్కల్ డి, ఇ బొగ్గు గనుల నుంచి బాక్సైట్ ను రవాణా చేయడానికి ఖర్చు చేస్తారని మంత్రి వివరించారు. మిగిలిన 22000 కోట్ల రూపాయలను స్మెల్టర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల విస్తరణకు ఖర్చు చేస్తామని మంత్రి తెలిపారు. దీనిలో ఒడిశా లోని అంగుల్ జిల్లాల్లో 1400 మెగావాట్ల ఫీడెర్ విద్యుత్ సౌకర్యంతో నిర్మించనున్న స్మెల్టర్ ప్లాంటు కూడా ఉందని అన్నారు.

' నాల్కో భవిష్యత్తులో అమలు చేయనున్న విస్తరణ కార్యక్రమాల వల్ల దేశంలో అల్యూమినా, అల్యూమినియం రంగాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయి. ఈ లోహాల వినియోగం పెరగడం వల్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ ఆశిస్తున్నఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యం నెరవేరుతుంది' అని మంత్రి పేర్కొన్నారు.

అపారమైన ఖనిజ సంపద కలిగివున్న ఒడిశా రాష్ట్ర అభివృధికి కేంద్రప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. దేశంలో ఖనిజ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒడిషాకు అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన అభ్యర్థనలను పరిశీలిస్తున్న కేంద్రం ఖనిజ ఉత్పత్తి సజావుగా సాగడానికి అనవసర సంస్థలను తొలగించడానికి నిబంధనలను సవరించడానికి సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.

' ఒడిశాలో ఇనుప ఖనిజ ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ప్రతిపాదన మేరకు రెండు ఇనుప ఖనిజ బ్లాకులను ఒడిశా మినరల్ కార్పొరేషన్ కు ఒక బ్లాక్ ను ఒడిశా మినరల్ ఎక్సప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కు కేటాయించాలని కేంద్రం నిర్ణయించిందని శ్రీ జోషి అన్నారు.

ఒడిశా మినరల్ ఎక్సప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన బ్లాకులలో ఖనిజ అన్వేషణ చేపట్టడానికి ఒడిశా మినరల్ కార్పొరేషన్ , ఒడిశా మినరల్ ఎక్సప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీనివల్ల రాష్ట్రంలో ఖనిజ సంపదపై సర్వేలను నిర్వహించి వాటిని వెలికి తీయడానికి అవకాశం కలుగుతుంది. ఇంతేకాకుండా ఖనిజ బ్లాకుల వేలం ప్రక్రియను వేగవంతం చేయడానికి నిబంధనల్లో మార్పులు తీసుకుని వచ్చే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.

2015 లో ఎంఎండిఆర్ చట్టంలో చేసిన సవరణ ద్వారా భారతదేశంలో ఖనిజ బ్లాకులను కేటాయించడం కోసం గనుల మంత్రిత్వ శాఖ వేలం పాట విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సవరణ ద్వారా చేసిన విధానాల ప్రకారం, 46 ఖనిజ బ్లాకుల లీజులు గడువు మార్చి 2020 లో ముగిసింది. వాటిలో ఎక్కువ భాగం ఒడిశాలో ఉన్నాయి. ఖనిజ ఉత్పత్తి నిరంతరాయంగా సాగడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 2020 లో ది మినరల్ లాస్ (సవరణ) ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది. దీనిప్రకారం ఖనిజ బ్లాకుల వేలం కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది, దీనివల్ల లీజు గడువు ముగిసేలోపు కొత్త లీజు దారులను గుర్తించడానికి అవకాశం కలుగుతుంది. కొత్త లీజు మంజూరు చేసిన తేదీ నుండి రెండేళ్ల కాలానికి ఖనిజ బ్లాకుల కొత్త యజమానులకు ఆమోదాలు మరియు అనుమతులు స్వయంచాలకంగా బదిలీ చేయబడతాయని కూడా చట్టంలో పేర్కొన్నారు. కాలంలో కొత్త యజమానులు తాజా అనుమతులకు దరఖాస్తు చేసుకోడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల లీజుదారులు ఇబ్బందులు లేకుండా తవ్వకాలను చేపట్టడానికి అవకాశం కలుగుతుంది.

ఒడిషా రాష్ట్రంలో అనుబంధ పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించడానికి నాల్కో తన అంగుల్ స్మెల్టర్ ప్లాంట్ కు సమీపంలో ఒడిషా ప్రభుత్వంతో కలిసి ప్రపంచ స్థాయి అల్యూమినియం పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ జోషి చెప్పారు. ఇది ఈ ప్రాంతంలో ఉపాధిని పెంచుతుందని స్థానిక పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.

నాల్కో వివరాలు :

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) అనేది భారత ప్రభుత్వమైన గనుల మంత్రిత్వ శాఖ క్రింద షెడ్యూల్-ఎ నవరత్న సిపిఎస్ ఇ. ఈ సంస్థ ఆసియాలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ బాక్సైట్-అల్యూమినా-అల్యూమినియం- పవర్ కాంప్లెక్స్ లో ఒకటి. భారతదేశంలో 32% బాక్సైట్, 33% అల్యూమినా 12% అల్యూమినియం ఉత్పత్తికి కంపెనీ దోహదం చేస్తుంది. ఇది ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో అల్యూమినా బాక్సైట్ ఉత్పత్తిదారుగా గుర్తించబడింది. కంపెనీకి 15 కి పైగా దేశాలలో వ్యాపారం ఉంది. దేశంలో అత్యధికంగా నికర విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్న సిపిఎస్ ఇ గా నాల్కో గుర్తింపు పొందింది . ఈ సంస్థ ఒడిశా లో గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్న కోరాపుట్ మరియు అంగుల్ జిల్లాలలో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది.

 

****

 

 

 (Release ID: 1686833) Visitor Counter : 105