పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

యమున నదిలో అమ్మోనియాకల్‌ నైట్రోజన్‌ తనిఖీ కోసం ఉమ్మడి అధ్యయన బృందం, నిఘా బృందం ఏర్పాటు

Posted On: 05 JAN 2021 6:30PM by PIB Hyderabad

దిల్లీ కాలుష్య నియంత్రణ మండలి (డీపీసీసీ), హరియాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (హెచ్‌ఎస్‌పీసీబీ), దిల్లీ జల మండలి (డీజేబీ), హరియాణా నీటి పారుదల &జల వనరుల విభాగం, దిల్లీ నీటి పారుదల & వరద నియంత్రణ విభాగంతో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) సోమవారం సమావేశం నిర్వహించింది. యమున నదిలో అమ్మోనియాకల్‌ నైట్రోజన్‌ పెరుగుదల, స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిష్కార మార్గాలపై చర్చించడానికి ఆ సమావేశం ఏర్పాటు చేసింది. 

    హరియాణాలో, నదికి ఎగువన ఉన్న పట్టణాల నుంచి శుద్ధి చేయని మురుగునీటిని నదిలోకి వదలడం, పారిశ్రామిక యూనిట్లు, సాధారణ వ్యర్థ జలాల శుద్ధి కేంద్రాలు (సీఈటీపీలు), మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్‌టీపీలు) నుంచి వ్యర్థాలు కలవడం, దిల్లీ వెలుపలవున్న  మురికివాడల నుంచి అక్రమంగా ట్యాంకర్లతో మురుగునీటిని నదిలో పారబోయడం, ప్రవాహం తగ్గడం, నది ఒడ్డున పేరుకుపోయిన బురద కుళ్లిపోవడం వంటివి యుమున నదిలో అమ్మోనియా పెరుగుదలకు కారణాలుగా సమావేశంలో తేల్చారు.

    సమస్య పరిష్కారం కోసం; దిల్లీ జల మండలి, హరియాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, దిల్లీ కాలుష్య నియంత్రణ మండలి, హరియాణా నీటి పారుదల &జల వనరుల విభాగం, దిల్లీ నీటి పారుదల & వరద నియంత్రణ విభాగం నుంచి అధికారులను ఎంపిక చేసి అధ్యయన బృందంగా ఏర్పాటు చేశారు. ఒకే విధమైన పర్యవేక్షణ ప్రోటోకాల్‌, పర్యవేక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరంపై ఈ బృందం సమీక్షిస్తుంది. గత సమాచారం విశ్లేషణ, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయి సర్వే, అమ్మోనియా ఎక్కువగా ఉంటున్న కాలాల గుర్తింపు వంటివి చేపడుతుంది. శాశ్వత పరిష్కారం కోసం తీసుకోవాల్సిన స్వల్ప, దీర్ఘకాలిక చర్యలను సూచించాలని, నెలలోగా నివేదిక సమర్పించాలని ఈ ఉమ్మడి బృందానికి ఉన్నతాధికారులు సూచించారు.

    దిల్లీ జల మండలి, దిల్లీ కాలుష్య నియంత్రణ మండలి, దిల్లీ నీటి పారుదల & వరద నియంత్రణ విభాగం, హరియాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, హరియాణా నీటి పారుదల &జల వనరుల విభాగాల నుంచి ఒక ఉమ్మడి నిఘా బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆ సమావేశంలో నిర్ణయించారు. 
     

 

***


(Release ID: 1686436) Visitor Counter : 173