ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీకి శ్రీకారం

దేశవ్యాప్తంగా 125 జిల్లాలలో విస్తరించి ఉన్న 286 కేంద్రాల్లో నమూనా పంపిణీకి భారీ విన్యాసం

సుమారు 1,14,100 మందికి వాక్సిన్ ఇవ్వటంలో శిక్షణ

కో-విన్ సాఫ్ట్‌వేర్‌లో 75 లక్షలకు పైగా లబ్ధిదారుల నమోదు

Posted On: 02 JAN 2021 9:21PM by PIB Hyderabad

కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో  భారతదేశం అనేక శిఖరాలను అధిరోహిస్తోంది. వ్యాక్సిన్ పంపిణీకి కోసం దేశం సిద్ధమవుతున్న తరుణంలో, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గత రెండు నెలలుగా ఈ సన్నాహాలలో చురుగ్గా పాల్గొంది. ఈ రోజు దేశవ్యాప్తంగా చేపట్టిన  భారీ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల్లోని 125 జిల్లాల్లో 286 కేంద్రాలలో టీకాలిచ్చారు.  ప్రతి జిల్లా మూడు లేదా అంతకంటే ఎక్కువ చోట ఈ నమూనా టీకాల కార్యక్రమం నడిచింది.  టీకాల పంపిణీ కోసం నిర్దేశించిన యంత్రాంగాన్ని పరీక్షించడం క్షేత్ర  స్థాయిలో సమస్యలు గుర్తించటం ధ్యేయంగా దీన్ని చేపట్టారు.  

దేశవ్యాప్తంగా ఉదయం 9:00 గంటల నుండి నిర్విరామంగా టీకాల కార్యక్రమం నడిపారు.  లబ్ధిదారుల సమాచారం అప్‌లోడ్ చేయటం, టీకా ప్రదేశం కేటాయింపు & మైక్రో ప్లానింగ్, టీకా కేటాయింపు, నిర్దిష్ట ప్రదేశంలో టీకాలివ్వటం, ఆ సమాచారాన్ని నివేదించటం లాంటి అన్ని దశలూ సమర్థంగా నిర్వహించటానికి వాస్తవంలో ఎదురయ్యే సమస్యలు తెలుసుకోవటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడింది.  టీకాల తరువాత ఏదైనా పర్తికూల ప్రభావం కనబడితే తెలియజేయటానికి కాల్ సెంటర్లను కూడా పరీక్షించి చూశారు.  ఈ మొత్తం కార్యక్రమాన్ని ఆయా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించారు. వారి అనుభవాన్ని తెలుసుకోవటానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ  రోజంతా రాష్ట్రాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వచ్చింది. నమూనా టీకాల కార్యక్రమం  విజయవంతమైనట్టు  రాష్ట్రాలు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశాయి.

టీకా మందు నిల్వ, సరైన ఉష్ణోగ్రత కాపాడటం, వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్న లబ్ధిదారుల తో సంప్రదింపు అవకాశాలు ట్రాకింగ్ కోసం కో-విన్ సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఈ సాఫ్ట్‌వేర్ ముందుగా రిజిస్టర్ చేసుకున్న  లబ్ధిదారులకు టీకా ప్రదేశం కేటాయింపు, ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వటం  లాంటి పనులు క్రమం తప్పకుండా చేస్తుంది. టీకాల షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిన తర్వాత వారి ధృవీకరణ, డిజిటల్ సర్టిఫికేట్ కూడా తయారవుతాయి. నేటి వరకు 75 లక్షలకు పైగా లబ్ధిదారులు కో-విన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదయ్యారు.

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రత నియంత్రిత వాతావరణంలో  వ్యాక్సిన్ మారుమూలకు కూడా పంపిణీ అయ్యేలా శీతల గిడ్డంగి వ్యవస్థ సిద్ధమైంది. సిరంజిలు తదితర పరికరాలు తగినంత సరఫరాకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. లబ్ధిదారుల ధృవీకరణ, టీకాలుఇవ్వటం, శీతల గిడ్డంగులలో నిల్వ, రవాణా , బయో-మెడికల్ వ్యర్థాల నిర్వహణ, కో-విన్ సాఫ్ట్‌వేర్‌ లో సమాచారాన్ని అప్‌లోడ్ చేయడం వంటి వాటిపై అనుసరించాల్సిన ప్రక్రియ గురించి  సుమారు 1,14,100 వ్యాక్సినేటర్లకు శిక్షణ ఇచ్చారు.

మొత్తం కార్యాచరణ ప్రణాళిక, ఐటి ప్లాట్‌ఫాం  ముందుగా నాలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పరీక్షించబడింది. 2020 డిసెంబర్ 28 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, పంజాబ్,  గుజరాత్ రాష్ట్రాల్లో ఈ తొలివిడత నమూనా టీకాల కార్యక్రమం జరిగింది. అక్కడినుంచి అందిన సమాచారం ఆధారంగా, ఐటి వ్యవస్థలో చిన్న చిన్న మార్పులు చేశారు.

నమూనా టీకాల కార్యక్రమం నిర్వహించిన జిల్లాలు , టీకా ప్రదేశాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

***


(Release ID: 1685765) Visitor Counter : 214