ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

కృష్ణపట్నం, తుమకూరు పారిశ్రామిక కారిడార్ పనులకు సి.సి.ఇ.ఎ. ఆమోదం

చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలో నిర్మాణం

గ్రేటర్ నోయిడా మల్టీ మోడల్ లాజిస్టిక్ కేంద్రం,..
మల్టీ మోడల్ రవాణా కేంద్రం ఏర్పాటు పనులకూ ఆమోదం

ప్రతిపాదనల మొత్తం అంచనా వ్యయం రూ. 7,725 కోట్లు
2.8లక్షలమందికి ఉద్యోగాల కల్పనకు అవకాశం

Posted On: 30 DEC 2020 3:47PM by PIB Hyderabad

  దేశంలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంకోసం పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య వ్యవహారాల శాఖ (డి.పి.ఐ.ఐ.టి.) చేసిన ప్రతిపాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతలోని  కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సి.సి.ఇ.ఎ.) ఆమోదించింది. సి.సి.ఇ.ఎ. ఆమోదించిన ప్రాజెక్టులు ఇవి:

  1. రూ. 2,139.44 కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతం ఏర్పాటు;
  2. రూ. 1,701.81 కోట్ల అంచనా వ్యయంతో కర్ణాటక రాష్ట్రంలో తుమకూరు పారిశ్రామిక ప్రాంతం ఏర్పాటు;
  3. రూ. 3,883.80 కోట్ల అంచనా వ్యయంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో మల్టీ మోడల్ లాజిస్టిక్ కేంద్రం (ఎం.ఎం.ఎల్.హెచ్.), మల్టీ మోడల్ రవాణా కేంద్రం (ఎం.ఎం.టి.హెచ్.) ఏర్పాటు.

   సుస్థిరమైన అధునాతన సదుపాయాలతో నూతన పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేయడం, పరిశ్రమలకు నాణ్యమైన, విశ్వసనీయమైన, పటిష్టమైన మౌలిక సదుపాయాలతో తయారీ రంగంలో పెట్టుబడులకు అవకాశం కల్పించడం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వినియోగానికి అవకాశాలు కల్పించడం లక్ష్యాలుగా ఈ పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సరకు రవాణా ప్రాంతాలు, ఎక్స్.ప్రెస్ వేలు, జాతీయ రహదారులు, ఓడరేవులకు, విమానాశ్రయాలకు అనుసంధాన ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటుచేయబోయే పారిశ్రామిక నగరాల్లో సత్వర కేటాయింపునకు వీలుగా భూములను కూడా సిద్ధంగా ఉంచుతారు. తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షింపజేసేందుకు తగిన చర్యలు తీసుకుంటారు. ప్రపంచ స్థాయి విలువల వ్యవస్థలో భారతదేశాన్ని బలమైన భాగస్వామిగా చూపించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఆత్మనిర్భర్ భారత్కార్యక్రమ లక్ష్యాన్ని సాధించే దిశగా పారిశ్రామిక కారిడార్ల కార్యక్రమాన్ని అమలు చేస్తారు. దేశవ్యాప్తంగా పరిశ్రమలను అభివృద్ధి చేయడం, పెట్టుబడులను రాబట్టే ప్రాంతాలను విస్తరింపజేయడం ఈ కార్యక్రమ లక్యంగా నిర్దేశించారు. 

 బహుళ మార్గాల అనుసంధానంతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడమే ప్రాతిపదికగా ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ (సి.బి.ఐ.సి.) పరిధిలో, కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతం, తుమకూరు పారిశ్రామిక ప్రాంతం నిర్మాణానికి ఇపుడు ఆమోదం లభించింది. దీనితో సి.బి.ఐ.సి. పరిధిలో అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. కొత్తగా నిర్మించే ఈ పారిశ్రామిక నగరాలను స్వయంసమృద్ధితో తీర్చిదిద్దుతారు. అవి ప్రపంచ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను కలిగి ఉంటాయి. సరకుల రవాణాకోసం రహదారులు, రైలు మార్గాలు ఓడరేవులతో అనుసంధానమై ఉంటాయి. నాణ్యమైన సామాజిక మౌలిక సదుపాయాలు, విశ్వసనీయమైన విద్యుత్ సదుపాయం ఈ నగరాలకు అందుబాటులో ఉంటాయి.    

    పారిశ్రామికీకరణ ప్రక్రియలో ఈ ప్రాజెక్టులన్నీ భారీగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయి. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులో తొలి దశ అభివృద్ధి ప్రక్రియ పూర్తయితే, 98వేల మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రాజెక్టు స్థలంలోనే 58వేలమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయంటున్నారు. తుమకూరు ప్రాజెక్టుతో 88,500మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు. వారిలో 17,700మందికి అభివృద్ధి ప్రక్రియ తొలిదశలోనే ఉపాధి లభిస్తుందంటున్నారు. వారికి రిటైల్ వ్యాపారం, కార్యాలయాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాల్లో ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి.

  గ్రేటర్ నోయిడా ప్రాంతంలో చేపట్టే మల్టీ మోడల్ లాజిస్టిక్ కేంద్రం, మల్టీ మోడల్ రవాణా కేంద్రం పలు మార్గాలతో అనుసంధానమై ఉంటుంది.  తూర్పు ఎక్స్.ప్రెస్ వే, 91వ జాతీయ రహదారి, నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్.ప్రెస్ వే, యమునా ఎక్స్.ప్రెస్ వే, తూర్పు, పశ్చమ సరకు రవాణా కారిడార్లతో గ్రేటర్ నోయిడా కేంద్రాలు అనుసంధానమై ఉంటాయి.  గ్రేటర్ నోయిడాలో లాజిస్టిక్ కేంద్రం నిర్మాణ ప్రాజెక్టును ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చేపడుతున్నారు. సరుకు రవాణా కారిడార్లలో సరకుల నిల్వకు పటిష్టమైన ఏర్పాట్లు ఉంటాయి. అలాగే, ఆ కారిడార్లనుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలనుంచి కారిడార్లకు పటిష్టమైన సరకు రవాణా ఏర్పాట్లు కూడా చేస్తారు. 

   గ్రేటర్ నోయిడా పరిధిలో బొరాకీ రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసే మల్టీ మోడల్ రవాణా కేంద్రం ఇకపై ప్రధాన రవాణా కేంద్రంగా పనిచేస్తుంది. రైలు, రోడ్డు మార్గాల్లో ప్రయాణించేవారికి, ఎం.ఆర్.టి.ఎస్. వ్యవస్థకు ఈ కేంద్రం అనుసంధానమై ఉంటుంది. ఇక్కడే అంతర్రాష్ట్ర బస్సు టెర్మినల్ (ఐ.బి.ఎస్.టి.), స్థానిక బస్ టెర్మినల్ (ఎల్.బి.టి.), మెట్రో సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. వాణిజ్య ప్రాంతాలు, హోటళ్లు, హరిత ప్రాంతాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఉత్తరప్రదేశ్.లో, జాతీయ రాజధాని ఉపప్రాంతం పరిధిలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల రవాణాకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఏర్పాట్లను ఈ ప్రాజెక్టులో పొందుపరిచారు. కిక్కిరిసిన జనాభానుంచి ఢిల్లీకి ఉపశమనం కల్పించేందుకు కూడా ఇది దోహదపడుతుంది. గ్రేటర్ నోయిడా పరిధిలో చేపట్టబోయే రెండు ప్రాజెక్టులతో 2040 నాటికి సుమారు లక్షమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. దీనితో చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా అభివృద్ధి వేగవంతం కావడానికి మరింత సానుకూలత ఏర్పడుతుంది.

 

***


(Release ID: 1684898) Visitor Counter : 368