పర్యటక మంత్రిత్వ శాఖ

"వారసత్వ దత్తత: మీ వారసత్వం, మీ గుర్తింపు" ప్రాజెక్టుపై సమీక్షించిన శ్రీ ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌

Posted On: 28 DEC 2020 5:42PM by PIB Hyderabad

కేంద్ర పర్యాటకం, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌, "వారసత్వ దత్తత: మీ వారసత్వం, మీ గుర్తింపు" ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ యోగేంద్ర త్రిపాఠి, డీజీ శ్రీ మీనాక్షి శర్మ, జేఎస్‌ శ్రీ సంజుక్త ముద్గల్‌, ఏడీజీ శ్రీ రూపేంద్ర బ్రార్‌, పురావస్తు సర్వే విభాగం ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

    వివిధ స్మారక కట్టడాల ప్రస్తుత పరిస్థితి, పురోగతిపై ఈ సమావేశంలో సవివర ప్రజంటేషన్‌ ఇచ్చారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న మంత్రి, నోడల్ విభాగాలతో ఎప్పటికప్పుడు చర్చించి, స్మారక కట్టడాల్లో ఎంవోయూల ప్రకారం ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై సమీక్షించాలని అధికారులకు సూచించారు.
    
    "వారసత్వ దత్తత" చక్కటి కార్యక్రమమన్న శ్రీ ప్రహ్లాద్‌, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)ను ప్రోత్సహించడం ద్వారా, ఎక్కువమందికి తెలియని వారసత్వ ప్రాంతాల్లో కనీస అవసరాలైన పరిశుభ్రత, మంచినీరు, విద్యుత్‌, సంగీతం అందించడంలో సాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ, పురావస్తు సర్వే విభాగం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సహకార ప్రాజెక్టుగా "వారసత్వ దత్తత: మీ వారసత్వం, మీ గుర్తింపు"ను భారత ప్రభుత్వం తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న వారసత్వ, సహజ, పర్యాటక ప్రాంతాల్లో ప్రణాళికబద్ధంగా, విడతలవారీగా సౌకర్యాలు కల్పించి, వాటిని పర్యాటక అనుకూల ప్రాంతాలుగా వృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, ట్రస్టులు, ఎన్జీవోలు, వ్యక్తులు, ఇతర సంబంధిత వర్గాలను "మాన్యుమెంట్‌ మిత్రాస్‌"గా మార్చి; సీఎస్‌ఆర్‌ కింద స్థిర పెట్టుబడి నమూనా రూపంలో, ఆయా వర్గాల ఆసక్తి, స్థోమతకు అనుగుణంగా కట్టడ ప్రాంతాల్లో కనీస, ఆధునిక పర్యాటక సౌకర్యాలు కల్పించే బాధ్యతను తీసుకునేలా చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ వసతుల నిర్వహణను కూడా ఆయా వర్గాలు చూస్తాయి.

    ఈ ప్రాజెక్టు కింద, దేశవ్యాప్తంగా ఉన్న 25 ప్రాంతాలు, 2 సాంకేతిక కార్యక్రమాల కోసం, 12 "మాన్యుమెంట్‌ మిత్రాస్‌"తో 27 ఎంవోయూలు కుదుర్చుకున్నారు. 

    చెత్తడబ్బాలు, ప్రజా సౌకర్యాలు, పరిశుద్ధ తాగునీరు, శోభ, సులభతర రవాణా, పరిశుభ్రత, సేదతీరే బల్లలు, వ్యర్థాల నిర్వహణ, విశేషాలను బహుళ భాషల్లో వినిపించే యాప్‌, డిజీ కియోస్క్‌, టిక్కెట్ల కియోస్క్‌, వివరణాత్మక సంకేతాలు, వైఫై వంటి కనీస సౌకర్యాలను ఈ ఎంవోయూల కింద ఏర్పాటు చేస్తారు.

    సందర్శకుల సౌకర్య కేంద్రం, సౌండ్‌&లైట్‌ షో-త్రీడీ ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌, అల్పాహార శాల, స్మారక వస్తువులు అమ్మే దుకాణం; ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ (360 డిగ్రీల అనుభవం) వంటి ఆధునిక సౌకర్యాలు కూడా ఎంవోయూలో భాగంగా ఉన్నాయి.

***


(Release ID: 1684225) Visitor Counter : 127