పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 8బీచ్.లలో అంతర్జాతీయ నీలివర్ణ పతాకాల ఆవిష్కరణ
పరిశుభ్రమైన బీచ్.లు తీరప్రాంత పర్యారణ పటిష్టత సూచికలు;
బీచ్.ల శుభ్రత జనోద్యమంగా రూపుదాల్చాలని
కేంద్రమంత్రి జవదేకర్ పిలుపు
మూడేళ్లలో వంద బీచ్.లను పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
Posted On:
28 DEC 2020 3:41PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా 8 ఉన్న సముద్రతీర ప్రాంతాల్లో (బీచ్.లలో) అంతర్జాతీయ నీలవర్ణ పతాకాలను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ రోజు వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించారు. ఈ బీచ్‌లకు సంబంధించి 2020 అక్టోబరు 6న డెన్మార్క్ లోని కోపెన్ హేగన్.లో భారతదేశానికి అంతర్జాతీయ నీలివర్ణ పతాక (బ్లూ ఫ్లాగ్) ధ్రువీకరణను లభించింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యు.ఎన్.ఇ.పి.), ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ, (యు.ఎన్.డబ్ల్యు.టి.ఒ.), ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞానశాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో), అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం (ఐ.యు.సి.ఎన్.), ఐ.ఎల్.ఎస్., ఎఫ్.ఇ.ఇ. వంటి సంస్థల ప్రతినిధులతో కూడిన అంతర్జాతీయ న్యాయ నిర్ణేతల సంఘం ఈ ధ్రువీకరణను ప్రకటించింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ప్రపంచ పర్యావరణ ముద్ర. 33రకాల కఠినమైన ప్రమాణాల ఆధారంగా "డెన్మార్క్‌లోని పర్యావరణ విద్యా ఫౌండేషన్" దీన్ని ప్రదానం చేసింది.
బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ రూపంలో పరిశుభ్రతకు గుర్తింపు పొందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషిని కేంద్రమంత్రి జవదేకర్ ఎంతో ప్రశంసించారు. తీరప్రాంతంలో పర్యావరణం చక్కగా పటిష్టంగా ఉందని చెప్పడానికి పరిశుభ్రమైన తీర ప్రాంతాలే తార్కాణమన్నారు. పర్యావరణ పరిరక్షణ, సుస్ధిర అభివృద్ధికోసం భారత్ చేస్తున్న కృషికి ప్రపంచ స్థాయిలో లభించిన గుర్తింపే బ్లూ ఫ్లాగ్ ధ్రువీకరణ అని కేంద్రమంత్రి అన్నారు.
రానున్న మూడు నాలుగేళ్లలో దేశంలోని మరో వంద బీచ్.లు బ్లూఫ్లాగ్ బీచ్.లుగా గుర్తింపు పొందే అవకాశం ఉందని జవదేకర్ అన్నారు. బీచ్.లను శుభ్రపరచడం “జనోద్యమం”గా మారాలని, సముద్రతీర ప్రాంతాలను అందమైన ప్రదేశాలుగా, పర్యాటక ఆకర్షణలుగా మాత్రమే కాకుండా సముద్ర మాలిన్య రహితంగా, సుస్థిర పర్యావరణ స్థలాలుగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉందని అన్నారు.
ఈ రోజు అంతర్జాతీయ నీలివర్ణ పతాకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగిన సముద్ర తీరాలు బీచ్.లు: కప్పాడ్ (కేరళ), శివరాజ్ పూర్ (గుజరాత్), ఘోఘ్లా (డయ్యూ), కాసర్కోడ్, పడుబిద్రి (కర్ణాటక), రుషికొండ (ఆంధ్రప్రదేశ్), గోల్డెన్ బీచ్ (ఒడిశా), రాధానగర్ బీచ్ (అండమాన్ నికోబార్ దీవులు). రాష్ట్రాల్లో, వివిధ కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని బీచ్.లలో పతాకాలను, ఆయా రాష్ట్రాల మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల సీనియర్ అధికారులు ఆవిష్కరించారు. కోస్తా ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి ప్రక్రియను భారత దేశం 2018 జూన్ నెలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ప్రారంభించింది. నేను నా బీచ్ ను పరిరక్షిస్తున్నాను అన్న నినాదంతో 13 తీర ప్రాంతాల్లో ఒకే సారిగా బీచ్.ల పరిశుభ్రతా కార్యక్రమాన్ని చేపట్టారు. బీచ్ పర్యావరణం, సౌందర్య రక్షణ సేవలు (బీమ్స్) పేరిట కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యక్రమాన్ని కూడా ఈ 13 తీరాల్లో వెంటనే చేపట్టారు.
సముద్ర తీరప్రాంతంలోని పది రాష్ట్రాల్లో బీమ్స్ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమం ఈ రోజున పరిశుభ్రతకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందింది. బీచ్.లలో పేరుకుపోయిన 500టన్నులకు పైగా ఘనవ్యర్థ పదార్ధాలను ఈ కార్యక్రమం కింద సేకరించి, రిసైకిల్ చేసి శాస్త్రీయ పద్ధతిలో బీచ్.లలోనే వదలివేశారు. దీనితో సముద్ర వ్యర్థాల సమస్య 78శాతం, సముద్ర ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య 83శాతం పరిష్కారమైంది. బీమ్స్ కార్యక్రమం కింద చేపట్టిన వ్యర్థాల సీసైక్లింగ్, పునర్వినియోగ ప్రక్రియలతో దాదాపు 11,000 కిలోలీటర్ల నీటిని పొదుపు చేయగలిగారు. దీనితో ఈ బీచ్.లకు సందర్శకుల సంఖ్య ఏకంగా 85శాతానికి పైగా పెరిగింది.
*****
(Release ID: 1684137)
Visitor Counter : 233