ఉప రాష్ట్రపతి సచివాలయం
భవిష్యత్తు సేంద్రియ వ్యవసాయానిదే - ఉపరాష్ట్రపతి
• మన సంప్రదాయ వ్యవసాయ విధానాలపై రైతులు దృష్టిపెట్టాలి
• భూసారాన్ని కాపాడుకుంటూ.. సంప్రదాయ పద్ధతుల్లో చక్కటి ఫలితాలు సాధిస్తున్న రైతులను స్ఫూర్తిగా తీసుకోవాలి
• రైతు సమస్యల పరిష్కారానికి చర్చలే సరైన ప్రత్యామ్నాయం
• వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే పరిశోధనల అంతిమ లక్ష్యం కావాలి
• జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులతో ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు మాటామంతి
• వారి అనుభవాలను, అనుసరిస్తున్న విధానాలను, ఫలితాలను అడిగి తెలుసుకున్న ఉపరాష్ట్రపతి
Posted On:
23 DEC 2020 5:45PM by PIB Hyderabad
భారతీయ సంప్రదాయ వ్యవసాయ విధానమైన సేంద్రియ పంట విధానాన్ని తిరిగి వాడుకలోకి తీసుకురావాలని, అదే దేశ వ్యవసాయానికి భవిష్యత్ దిక్సూచి అని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు హైదరాబాద్‌లోని తమ నివాసంలో.. వ్యవసాయ రంగంలో విశేష కృషిచేస్తున్న ఐదుగురు రైతులతో సంభాషించారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని రైతులతో చేస్తున్న మాటామంతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉపరాష్ట్రపతి ఈ రైతులతో గంటన్నరసేపు మాట్లాడి వారి అనుభవాలను, అనుసరిస్తున్న విధానాలను, ఫలితాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వీరందరూ తమ అనుభవాలను, ఫలితాలను తెలియజేస్తూ ఈ పద్ధతుల్లో వ్యవసాయం లాభసాటిగా ఉందని.. కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు.
వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా చేయడంలో చేపట్టాల్సిన చర్యలను, సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయం ద్వారా ఎదురౌతున్న సమస్యలు, అనంతర ఫలితాల గురించి కూడా ఉపరాష్ట్రపతి చర్చించారు.
ఈ సందర్భంగా.. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయంపై మరింత దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ప్రస్తుతం దేశంలో ఆహార భద్రత, ఆహార నిల్వలు ఉన్నప్పటికీ పెరుగుతున్న దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా ఆహారోత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని రైతులకు ఉపరాష్ట్రపతి సూచించారు.
వ్యవసాయరంగంలో మార్పులతోపాటు పౌష్టికాహారాన్ని ఇచ్చే పంటలపైనా దృష్టిసారించాల్సిన ఆవశ్యతను ఆయన ప్రస్తావించారు. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల ఉత్పత్తిపైనా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. మేలు రకాలైన వంగడాలను కనుగొని, వాటిని అందరికీ అందుబాటులోకి తెచ్చే విషయంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలకు చర్చలే సరైన పరిష్కారమని అభిప్రాయపడిన ఆయన, రాజకీయపార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలోనూ వ్యవసాయరంగ అభివృద్ధికి వారి ఆలోచనలను నిర్దిష్టంగా, స్పష్టంగా వెల్లడించాలని.. తదనంతరం వాటిని పాటించాలని సూచించారు.
ఇప్పటివరకు అనుసరించిన విధానాలను.. ఒకసారి అవలోకనం చేసుకుని.. అధునాతన పద్ధతులను, సాంప్రదాయ విధానాలను మేళవించి మన వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టపరుచుకోవాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, రైతులకు అవసరమైన శీతల గిడ్డంగులు, రవాణా సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరాన్నీ నొక్కిచెప్పారు. దేశవ్యాప్తంగా తరచూ వివిధ రంగాల్లో విశేష కృషిచేస్తున్న వారితో మాటామంతి జరుపుతూ వారి ద్వారా వచ్చిన అభిప్రాయాలను తరచుగా ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఏడాది కరోనా ఉపద్రవం నేపథ్యంలోనూ మన రైతులు చేసిన కృషిని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా అభినందించారు. మన దేశ ప్రజలకు అవసరమైన పౌష్టికాహారాన్ని ఉత్పత్తి చేయడంతోపాటు ప్రపంచానికి అవసరమైన ఆహారధాన్యాలను ఉత్పత్తి చేయడంపైనా దృష్టిపెట్టాలని ఆయన సూచించారు.
వ్యవసాయం భారతీయ మూల సంస్కృతి అని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతోపాటు యువతరం కూడా వ్యవసాయంపై ఆసక్తి చూపించేలా ప్రోత్సహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గుడివాడ నాగరత్నం నాయుడు, వారి కుమార్తె హర్షిణి, శ్రీ సుఖవాసి హరిబాబు, శ్రీ దేవరపల్లి హరికృష్ణ, శ్రీ బైరపాక రాజు దంపతులు, శ్రీమతి లావణ్యారెడ్డి, శ్రీ రమణారెడ్డి దంపతులు వారి కుమారుడు, రైతునేస్తం సంపాదకుడు పద్మశ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
శ్రీ గుడివాడ నాగరత్నం నాయుడు.. ‘గోమాత, భూమాత, సూర్యరశ్మి’ ఈ మూడింటి అనుసంధానమే వ్యవసాయమని ప్రగాఢంగా విశ్వసిస్తూ.. ఆ దిశగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సమగ్ర వ్యవసాయ విధానాన్ని, జీవ వైవిధ్యాన్ని విజయవంతంగా ఆచరిస్తూ చక్కటి ఫలితాలు తీసుకొస్తున్నారు.
శ్రీ సుఖవాసి హరిబాబు.. ఆయురారోగ్యాలకోసం ప్రకృతికి ప్రణమిల్లాలనే లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో జీవవైవిధ్య ఉద్యాన ప్రకృతి వ్యవసాయ క్షేత్రానికి రూపకల్పన చేశారు. 10 ఎకరాల క్షేత్రంలో.. పండ్లమొక్కలు, ఔషధ మొక్కలు, కలప మొక్కలను నాటారు. దేశీ ఆవు జాతులను, గొర్రెలు, కోళ్లు, బాతులను కలిపి సమీకృత వ్యవసాయం చేస్తున్నారు.
శ్రీ దేవరపల్లి హరికృష్ణ.. వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్నా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదులుకుని వచ్చి మళ్లీ వ్యవసాయం వైపే దృష్టి సారించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. రసాయనాల్లేకుండా సేంద్రియ వ్యవసాయంతో దిగుబడి ఎలా పెంచాలనేదానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆధునిక సాంకేతికతను.. భారతీయ వ్యవసాయ పరిజ్ఞానంతో జోడించి చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు.
శ్రీ బైరపాక రాజు.. వ్యవసాయం సరిగా నడవక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న పరిస్థితినుంచి ఇవాళ పదిమందికి ఆదర్శంగా నిలిచే స్థితికి ఎదిగారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన రాజు.. దేశవాళీ విత్తనాల రకాలను సొంతగా సిద్ధం చేస్తూ.. హైబ్రిడ్ రకాలతో సమానంగా ఉత్పత్తి జరిగేలా ఇతర రైతులనూ ప్రోత్సహిస్తున్నారు.
శ్రీమతి లావణ్యారెడ్డి, శ్రీ రమణారెడ్డి దంపతులు.. వ్యవసాయ నేపథ్యమే ఉన్నప్పటికీ.. పదేళ్లుగా సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తూ.. తమ ఉత్పత్తులకు వారే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఇందుకుగానూ పలు రాష్ట్ర, జాతీయ అవార్డులు అందుకున్నారు.
రైతు దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతితో కలిసి తమ అనుభవాలను పంచుకోవడంపై వీరంతా ఆనందం వ్యక్తం చేశారు.
***
(Release ID: 1683201)
Visitor Counter : 213