యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

స్వదేశీ ఆటలకు ప్రోత్సాహకంగా గట్కా, కలరిపాయట్టు, థాంగ్-టా, మల్లఖంబ లను ఖేలో ఇండియా యువజన క్రీడలు-2021 లో చేర్చిన - కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ


Posted On: 20 DEC 2020 5:31PM by PIB Hyderabad

హర్యానాలో జరగనున్న ఖెలో ఇండియా యువజన క్రీడలు - 2021 లో భాగంగా నాలుగు స్వదేశీ ఆటలను చేర్చడానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.  ఆ ఆటల్లో - గట్కా, కలరిపాయట్టు, థాంగ్-టా తో పాటు, మల్లఖంబ ఉన్నాయి.

ఈ నిర్ణయం గురించి, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, ఈ నిర్ణయం గురించి తెలియజేస్తూ, "భారతదేశానికి స్వదేశీ క్రీడల యొక్క గొప్ప వారసత్వం ఉంది, ఈ ఆటలను సంరక్షించి, ప్రోత్సహించడంతో పాటు ప్రాచుర్యం కల్పించడానికి క్రీడా మంత్రిత్వ శాఖ ప్రధమ ప్రాధాన్యతనిస్తోంది. ఈ ఆటల క్రీడాకారులు పోటీపడి, తమ ప్రతిభను ప్రదర్శించడానికి, ఖేలో ఇండియా క్రీడల కంటే మంచి వేదిక మరొకటి లేదు.  ఈ ఆటలకు భారీ ప్రజాదరణ ఉంది.  ఈ ఆటలను "స్టార్ స్పోర్ట్స్" ఛానెల్" దేశవ్యాప్తంగా ప్రసారం చేస్తుంది.  కాబట్టి 2021 ల ఓ నిర్వహించే ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాల్లో యోగాసనాలతో పాటు ఈ నాలుగు విభాగాల చేరికతో, క్రీడా ప్రియులు మరియు దేశంలోని యువత కు సరైన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుందని, నాకు నమ్మకం ఉంది.  భవిష్యత్తులో  ఖెలో ఇండియా క్రీడోత్సవాల్లో మరిన్ని దేశీయ క్రీడలను జోడించగలుగుతాము. " అని చెప్పారు.

ఎంపిక చేసిన ఈ  నాలుగు ఆటలు దేశంలోని వివిధ ప్రాంతాలను సూచిస్తాయి. కేరళకు చెందిన కలరిపాయట్టు క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు; వీరిలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్వాల్ ఒకరు.  అదే సమయంలో, మల్లఖంబ, భారతదేశం అంతటా ప్రసిద్ది చెందింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ క్రీడ చాలా ప్రాచుర్యం పొందింది.  గాట్కా పంజాబ్ రాష్ట్రానికి చెందిన క్రీడ.  నిహాంగ్ సిక్కు వారియర్స్ యొక్క ఈ సాంప్రదాయ పోరాట శైలిని ఆత్మరక్షణగా మరియు క్రీడగా ఉపయోగిస్తారు.  థాంగ్-టా, మణిపూర్ కి చెందిన యుద్ధ క్రీడ.  ఇటీవలి దశాబ్దాలలో ఇది చాలా ఉపేక్షకు గురైంది. అయితే ఖేలో ఇండియా యువజన క్రీడలు - 2021 సహాయంతో ఈ క్రీడకు మళ్లీ జాతీయ గుర్తింపు లభిస్తుంది.

భారత జాతీయ గాట్కా అసోసియేషన్ అధ్యక్షుడు, హర్జీత్ సింగ్ గ్రెవాల్ మాట్లాడుతూ,  "ఖేలో ఇండియా యువజన క్రీడల్లో భారత పురాతన యుద్ధ కళ గట్కాను క్రీడా మంత్రిత్వ శాఖ చేర్చినందుకు మాకు సంతోషం. ఖేలో ఇండియా యొక్క ఈ ప్రయత్నం చారిత్రక ప్రాముఖ్యత కలిగిన, మరచిపోయిన భారతీయ సాంప్రదాయ యుద్ధ కళలను ప్రోత్సహించడానికి మరియు పునరుద్ధరించడానికి ఖచ్చితంగా సహాయపడుతుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. అదనంగా, దేశవిదేశాల్లో అవగాహన కల్పించడానికి భారత జాతీయ గాట్కా అసోసియేషన్ ప్రయత్నాలకు, ఈ చర్య, ప్రోత్సాహాన్ని ఇస్తుంది,” అని పేర్కొన్నారు.

ఈ పోటీల ద్వారా, ఈ క్రీడ బాగా ప్రాచుర్యం పొందుతుందని, థాంగ్-టా సమాఖ్య కూడా ధృవీకరించింది.  భారత థాంగ్-టా సమాఖ్య కార్యదర్శి శ్రీ వినోద్ శర్మ మాట్లాడుతూ, "ఈ పోటీలో వివిధ రాష్ట్రాల నుండి 400 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటారు. మేము పోటీలో చాలా విజయవంతం కావాలని కోరుకుంటున్నాము.  ఇది జాతీయంగా, అంతర్జాతీయంగా మరింత గుర్తింపు పొందటానికి మాకు సహాయపడుతుంది,” అని పేర్కొన్నారు.

 

*****



(Release ID: 1682314) Visitor Counter : 414