రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

కర్ణాటకలో రూ.11 వేల కోట్ల విలువైన, 1200 కి.మీ. పొడవైన 33 ఎన్‌హెచ్‌ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన శ్రీ నితిన్‌ గడ్కరీ; కర్ణాటకలో భవిష్యత్తులో రూ.1,16,144 కోట్లను కేంద్రం వ్యయం చేయనుందని వెల్లడి


దేశంలో చెరకును అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి కాబట్టి, ఇథనాల్‌ ఉత్పత్తిని భారీగా చేపట్టాలని మంత్రి పిలుపు

Posted On: 19 DEC 2020 3:44PM by PIB Hyderabad

కర్ణాటకలో 33 జాతీయ రహదారి ప్రాజెక్టులకు వర్చువల్‌ పద్ధతిలో, కేంద్ర రహదారి రవాణా&హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇవి రూ.10,904 కోట్ల విలువైన, 1197 కి.మీ. పొడవైన ప్రాజెక్టులు. కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ యెడియూరప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని శ్రీ దేవెగౌడ, కేంద్ర మంత్రులు శ్రీ ప్రహ్లాద్‌ జోషి, శ్రీ సదానంద గౌడ, వి.కె.సింగ్‌, రాష్ట్ర మంత్రులు, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

గత ఆరేళ్లలో కర్ణాటకలో 900 కి.మీ. పొడవైన హైవేలు నిర్మించామని శ్రీ గడ్కరీ తెలిపారు. మొత్తం 7652 కి.మీ.కు చేరిందన్నారు. రూ.37,311 కోట్ల విలువైన, 2,384 కి.మీ. పొడవైన 71 ప్రాజెక్టుల్లో ప్రస్తుతం పనులు సాగుతున్నాయని చెప్పారు. వీటిలో, 1127 కి.మీ. పొడవుతో, 12,286 కోట్ల విలువైన 26 ప్రాజెక్టుల్లో 70 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయని వివరించారు. రూ.25,025 కోట్ల విలువైన, 1257 కి.మీ. పొడవైన 45 ప్రాజెక్టుల్లో 70 వరకు పనులు పూర్తయిందని తెలిపారు.

వర్తకం, ఆర్థిక వ్యవస్థకు లబ్ధిని చేకూర్చేలా నౌకాశ్రయాల సునాయాస అనుసంధానం కోసం; బెలెకెరి, కార్వార్‌, మంగళూరును కలుపుతూ గోవా సరిహద్దు నుంచి కేరళ సరిహద్దు వరకు, రూ.3443 కోట్ల ఖర్చుతో సముద్ర తీరం వెంబడి 4 వరుసలతో 278 కి.మీ. రహదారి నెట్‌వర్క్‌ నిర్మాణం చేపట్టినట్లు, పనులు చాలావరకు పూర్తి చేసినట్లు గడ్కరీ చెప్పారు. వాహనదారుల భద్రత కోసం, ఎన్‌హెచ్‌-75పై షిరడీ ఘాట్‌, ఎన్‌హెచ్‌-73పై చర్మాడీ ఘాట్‌, ఎన్‌హెచ్‌-275పై సంపజే ఘాట్‌ వద్ద 3 ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.115 కోట్లు విడుదలైనట్లు మంత్రి వెల్లడించారు.

కర్ణాటకలో భవిష్యత్తులో రూ.1,16,144 కోట్లను కేంద్రం వ్యయం చేయనున్నట్లు శ్రీ గడ్కరీ తెలిపారు. రూ.5083 కోట్ల విలువైన 275 కి.మీ. పొడవైన 11 రహదారి ప్రాజెక్టులను 2019-20 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసినట్లు చెప్పారు.

రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.8330 కోట్ల విలువైన సీఆర్‌ఎఫ్‌ పనులు మంజూరయ్యాయన్నారు. ఈ ఏడాది రూ.435 కోట్లకు ఆమోదం రాగా, ఇప్పటివరకు రూ.217 కోట్లు విడుదలయ్యాయని, మిగిలిన రూ.218 కోట్లు సీఆర్‌ఎఫ్‌ కింద విడుదలవుతాయని స్పష్టం చేశారు.

దేశంలో చెరకును అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి కాబట్టి, ఇథనాల్‌ ఉత్పత్తిని భారీగా చేపట్టాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. దేశం ఇప్పటికే అవసరానికి మించి చెరకు, వరిని పండిస్తోందని, కేంద్రం వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని వివరించారు. మిగులు పంటను ఇథనాల్‌గా మార్చి, వాహనాల్లో ప్రత్యామ్నాయ ఇంధనంగా వినియోగించుకోవచ్చన్నారు. దీనివల్ల రైతుల ఆదాయం పెరగడం మాత్రమేగాక, దేశీయ ఇంధన వనరుగా కూడా ఉంటుందన్నారు.

కర్ణాటకలో రహదారుల అభివృద్ధికి కేంద్ర పెట్టిన శ్రద్ధను మాజీ ప్రధాని శ్రీ దేవెగౌడ ప్రశంసించారు. సాంకేతికత పూర్తిగా మారిందని, ఇప్పుడు చూస్తున్నది నమ్మశక్యం కాకుండా ఉందని వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రి ఇచ్చిన సలహాలన్నింటినీ ఆచరణలోకి తెస్తామని ముఖ్యమంత్రి యెడియూరప్ప హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజలకు మెరుగైన జీవనం అందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. లక్ష్యాల సాధనకు కేంద్రంతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

కర్ణాటకలో గత ఆరేళ్లలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనుల గురించి కేంద్ర మంత్రి శ్రీ సదానంద గౌడ వివరించారు. గోవా నుంచి తిరువనంతపురం వరకు తీర రహదారి నెట్‌వర్క్‌ నిర్మాణంపై శ్రీ గడ్కరీని ప్రశంసించారు. జాతీయ రహదారి రంగంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మరో కేంద్రమంత్రి శ్రీ ప్రహ్లాద్‌ జోషి కూడా అభినందించారు. ఆహారం, వస్త్రాలు, ఆవాసం లాగానే రహదారులు కూడా ప్రాథమిక అవసరంగా మారాయని అన్నారు.

ఎంపీ, కాంగ్రెస్‌ మాజీ లోక్‌సభాపక్ష నేత శ్రీ మల్లికార్జున్‌ ఖర్గే కూడా ప్రధాని సహకార గుణాన్ని మెచ్చుకున్నారు. అభివృద్ధి కాముకుడిగా ఆయనను అభివర్ణించారు.

ఇప్పుడు ప్రారంభించిన రహదారులు కర్ణాటక నగరాల మధ్య ఉత్తమ అనుసంధానాన్ని అందిస్తాయని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ సహాయ మంత్రి శ్రీ వి.కె.సింగ్‌ అన్నారు. రాష్ట్రాల అనుసంధానం వేగంగా, ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పారు. వ్యవసాయం, ఆక్వా, ఆరోగ్య రంగాలపై ఇది ప్రగతి కారక ప్రభావం చూపుతుందన్నారు. భద్రతతో కూడిన ప్రజా, సరకు రవాణాతోపాటు, ఆర్థిక నడవాలు, తీర, మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టులను చేపట్టినట్లు వివరించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఓడరేవుల అనుసంధానికి ఎన్‌హెచ్‌-66 అభివృద్ధి మార్గంగా మారుతుందని వి.కె.సింగ్‌ వ్యాఖ్యానించారు.

 

****



(Release ID: 1682005) Visitor Counter : 158