రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూలు వ్యవస్థ సిద్ధం: నితిన్‌ గడ్కరీ

జీపీఎస్‌ పరిజ్ఞానం ద్వారా టోల్‌ ఆదాయం ఐదేళ్లలో రూ.1.34 లక్షల కోట్లకు చేరుతుంది

Posted On: 17 DEC 2020 4:50PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా అవాంతరాలు లేని రవాణా కోసం, జీపీఎస్‌ సాంకేతికతో టోల్‌ వసూలు చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. దీనివల్ల వచ్చే రెండేళ్లలో దేశంలో ఎక్కడా టోల్‌ బూత్‌లు కనిపించవన్నారు.

    'అసోచామ్‌ ఫౌండేషన్‌ వీక్‌ ప్రోగ్రాం'ను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి, "అన్ని రంగాల్లో ఆర్థిక పునరుజ్జీవనం కోసం జాతీయ మౌలిక సదుపాయాల అనుసంధానం కీలకం" అనే అంశంపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. వాహనాల కదలికలను బట్టి బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ సొమ్ము తగ్గుతుందని గడ్కరీ వెల్లడించారు. ప్రస్తుతం అన్ని వాణిజ్య వాహనాలు ట్రాకింగ్‌ వ్యవస్థతో వస్తున్నందున, పాత వాహనాల్లో జీపీఎస్‌ బిగింపుపై ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు.

    వచ్చే మార్చి నాటికి దేశవ్యాప్తంగా టోల్‌ వసూళ్లు రూ.34 వేల కోట్లకు చేరతాయన్న గడ్కరీ, జీపీఎస్‌ పరిజ్ఞానం ద్వారా ఐదేళ్లలో ఇది రూ.1.34 లక్షల కోట్లకు చేరుతుంది చెప్పారు.

    ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలనకు పారిశ్రామిక వృద్ధి కీలకమని వ్యాఖ్యానించిన మంత్రి, ప్రస్తుతం పరిశ్రమలన్నీ పట్టణ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యాయన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా దిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో తీవ్రమైన సమస్యలు వస్తున్నందున, వృద్ధి రేటును పెంచడానికి పారిశ్రామిక వికేంద్రీకరణ అత్యవసరమని చెప్పారు. మౌలిక సదుపాయాల వృద్ధిలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం అవసరాన్ని కూడా స్పష్టం చేశారు. ఆర్థిక ప్రయోజనం ఉండని ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం సాయం చేస్తుందని శ్రీ గడ్కరీ భరోసా ఇచ్చారు.

***



(Release ID: 1681615) Visitor Counter : 148