పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి

ఉద్యోగులకు కేంద్రమంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపు

ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు ఆత్మనిర్భర్ శక్తికి రూపకల్పన

Posted On: 17 DEC 2020 3:08PM by PIB Hyderabad

ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణం కోసం ఇంధన రంగంలో స్పష్టమైన వ్యూహంతో పనిచేస్తున్నామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి శ్రీ ధర్మేందర్ ప్రధాన్ అన్నారు. దీనిలో భాగంగా ఆత్మ నిర్భర్ శక్తికి రూపకల్పన చేస్తున్నామని ఆయన తెలిపారు. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా { అసోచమ్ ) 2020 వ్యవస్థాపక వారోత్సవాలలో భాగంగా ' భారతదేశ అభివృద్ధిలో ఇంధన రంగ పాత్ర' అనే అంశంపై ఈ రోజు మంత్రి ప్రసంగించారు. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణం కోసం ఇంధన రంగాన్ని బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇంధన కొరత లేకుండా చూసి ప్రతి ఒక్కరి ఇంధన అవసరాలను తీర్చడానికి చర్యలను అమలుచేయవలసి ఉంటుందని మంత్రి స్పష్టం చేసారు. కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ ప్రజల జీవనప్రమాణాలు మెరుగు పరచడానికి దోహదపడే ఇంధన వనరులను అందుబాటులోకి తేవాలని మంత్రి సూచించారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యావరణ సమతుల్యతకు భంగం కలగకుండా పరిశ్రమల ఇంధన అవసరాలను తీర్చే విధంగా ఇంధన రంగం అభివృద్ధి చెందవలసి ఉంటుందని మంత్రి అన్నారు. భారతదేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంధనరంగం అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధికవ్యవస్థ సాధనకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నదని శ్రీ ప్రధాన్ పేర్కొన్నారు.
అందుబాటులో ఉన్న వనరులు దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుస్థిర అభివృద్ధిని సాధించడానికి ప్రభుత్వం పథకాలను రూపొందిస్తున్నదని మంత్రి వివరించారు. 2047లో స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలను జరుపుకొనే సమయానికి భారతదేశం ఆశించిన దాని కంటే ఎక్కువగా అభివృద్ధి సాధించి తీరుతుందంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ వాతావరణ అంశాలపై జరిగిన సదస్సులో చేసిన ప్రకటనను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఇంధన రంగంలో సమూల మార్పులను తీసుకునివచ్చి దేశ అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందించిందని శ్రీ ప్రధాన్ తెలిపారు. ' కొవిడ్ రూపంలో ఎదురైనా సవాళ్ళను ప్రభుత్వం అవకాశాలుగా మలచుకొంటున్నది. ప్రధానమంత్రి పిలుపు మేరకు ఆత్మ నింబార్ భారత్ నిర్మాణం కోసం సంస్కరణలను అమలు చేస్తున్నాము. భారతదేశం ఇదివరకటి మాదిరిగా వస్తువులకు మార్కెట్ గా కాకుండా ప్రపంచ దేశాలకు అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేసే శక్తిగా మారేవిధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నాము. ఈ లక్ష్య సాధనకు మేము పరిశ్రమలు సంబంధిత వర్గాలతో కలసి పనిచేస్తున్నాం' అని మంత్రి వివరించారు.
పేదరికాన్ని నిర్మూలించి ఇంధన కొరత లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశం ప్రపంచములో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థను కలిగివున్నదని మంత్రి పేర్కొన్నారు. ఆర్థికవ్యవస్థ అభివృద్దిలో ఇంధన వినియోగం, ఇంధన భద్రత కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి అన్నారు. ఈ రెండు అంశాలకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.
గత ఆరేళ్ళ కాలంలో భారతదేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వివరించిన మంత్రి ప్రపంచంలో అమెరికా, చైనా ల తరువాత మనదేశంలో ఇంధన వినియోగం ఎక్కువగా ఉందని అన్నారు.
కొవిడ్ మహమ్మారి వల్ల ఇప్పటికీ సాధారణ పరిస్థితులు ఏర్పడలేదని పేర్కొన్న ప్రధాన్ త్వరలోనే అభివృద్ధి సాధనకు అవసరమైన పరిస్థితులు ఏర్పడతాయన్న ధీమాను వ్యక్తం చేశారు. ' ఇప్పటికే ఇంధన రంగంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంధన వినియోగం కోవిద్ ముందు ఉన్న స్థాయికి దాదాపుగా చేరింది. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం సాధారణ స్థాయికి చేరడంతో ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి' అని మంత్రి పేర్కొన్నారు.
ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ ఇంధన రంగానికి దశ దిశలను నిర్దేశించారని శ్రీ ప్రధాన్ తెలిపారు. గ్యాస్ ఆధారిత ఆర్ధిక వ్యవస్థ, వాతావరణాన్ని కలుషితం చేయని ఇంధన వినియోగం,2030నాటికి 450 గెగా వాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధించాలని, హైడ్రోజన్ వినియోగం ఎక్కువ చేయాలని, ఇంధన వ్యవస్థలో డిజిటల్ విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి సూచించారని మంత్రి తెలిపారు.
ఇంధనరంగంలో అభివృద్ధి సాధించడానికి ఉన్న అవకాశాలను ప్రరిశ్రమలు అందిపుచ్చుకోవాలని మంత్రి పిలుపు ఇచ్చారు. ఇంధన రంగాన్ని ఆదాయ వనరుగా చూడకుండా ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుని ముడి చమురు,సహజ వాయువుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. ఉత్పత్తి పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సంస్కరణలను తీసుకుని వచ్చిందని మంత్రి వివరించారు. దీనిలో భాగంగా చమురు తవ్వకాలు, ఉత్పత్తిలో 100 శాతం విదేశే పెట్టుబడులకు అనుమతి ఇచ్చామని తెలిపిన మంత్రి ప్రభుత్వ రంగ చమురు సంస్థల్లో కూడా 49 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చామని తెలిపారు. పన్నుల విధానాన్ని సులభతరం చేయడం వల్ల విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని మంత్రి తెలిపారు.
సహజ వాయువు ఆధారిత ఆర్ధిక వ్యవస్థకు రూపకల్పన చేయాలన్న లక్ష్యంలో భాగంగా 2030 నాటికి ఇంధన రంగంలో సహజ వాయువు వినియోగం 6. 2% నుంచి 15%కి చేరేలా చూడడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. గత ఏడాది ప్రధానమంత్రి ప్రకటించిన ఒక దేశం ఒక గ్యాస్ గ్రిడ్ కార్యక్రమంలో భాగంగా 17000 కిలోమీటర్ల పొడవునా కొత్తగా పైపులను వేసి గ్యాస్ గ్రిడ్ ను 34,5000 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తామని అన్నారు. 2022 నాటికి గ్యాస్ ఆధారిత ఇంధన ఉత్పత్తి ప్రస్తుతం ఉన్న 42 ఎంఎంటిపిఏ నుంచి 61ఎంఎంటిపిఏ లకు పెంచుతామని అన్నారు. సహజవాయువు వినియోగాన్ని ప్రోత్సహించడానికి పారదర్శక విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ప్రతి ప్రాంతాలలో ప్రతి ఒక్కరికి అందుబాటులో సహజవాయువు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. దేశంలోని 232 భౌగోళిక ప్రాంతాలలో 400 జిల్లాలలో సహజవాయువు సరఫరాకు ప్రణాళిక రూపొందించామని అన్నారు. దీనితో సహజవాయువు వినియోగం 70% ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఎల్ఎన్ జి వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. 2024 నాటికి పైపులైనులు,ఎల్ఎన్ జి టెర్మినళ్లు సీజీడి వ్యవస్థ నిర్మాణం కోసం 60 బిలియన్ అమెరికా డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించామని మంత్రి వివరించారు.

ఇంధన రంగంలో స్వయంసమృద్ధి సాధించడానికి ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపిన మంత్రి దీనికోసం జాతీయ విధానానికి రూపకల్పన చేశామని తెలిపారు. బయో రిఫైనరీలు,ఇథనాల్ మిశ్రీత పెట్రోల్ ను ఉత్పత్తి చేయడానికి చమురు సంస్థలు అంగీకారం తెలిపాయని మంత్రి అన్నారు. వ్యర్ధాలను ఇంధనంగా మారుస్తూ గ్రామీణ రంగ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం చేస్తున్నామని మంత్రి అన్నారు. సౌర శక్తిని ఇంధనంగా మార్చడానికి ఆయిల్ గ్యాస్ కంపెనీలు ప్రణాళికలను రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు.

***

 (Release ID: 1681596) Visitor Counter : 91