రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

‘స్వర్ణిం విజయ్ మషాల్’ వెలిగించి, భారత-పాకిస్తాన్ యుద్ధం 50వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించనున్న - ప్రధానమంత్రి నరేంద్రమోదీ

Posted On: 15 DEC 2020 6:48PM by PIB Hyderabad

1971 డిసెంబర్ నెలలో, భారత సాయుధ దళాలు పాకిస్తాన్ సైన్యంపై నిర్ణయాత్మక మరియు చారిత్రాత్మక విజయాన్ని సాధించాయి.  ఇది ఒక దేశం - బంగ్లాదేశ్ ఏర్పడటానికి దారితీసింది.  అదేవిధంగా, ఇది, రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం, అతిపెద్ద సైనిక లొంగుబాటుకు దారితీసింది.  భారత-పాకిస్థాన్ యుద్ధం జరిగి 50 సంవత్సరాలైన సందర్భంగా,  డిసెంబర్, 16వ తేదీ నుండి, దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనిని ‘స్వర్ణిం విజయ్ వర్ష్’ అంటే - విజయానికి స్వర్ణోత్సవ సంవత్సరం - గా పాటించనున్నారు. 

న్యూ ఢిల్లీ లోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం (ఎన్.‌డబ్ల్యు.ఎం) వద్ద రేపు జరిగే ప్రారంభ కార్యక్రమంలో, ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు.  ప్రధానమంత్రి కార్యక్రమ వేదిక వద్దకు రాగానే, రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్,  ఆయనకు స్వాగతం పలుకుతారు. 

ప్రధానమంత్రి, రక్షణ సిబ్బంది అధిపతి, త్రివిధ దళాల అధిపతులు, యుద్ధ స్మారకం వద్ద, అమరవీరులకు పుష్పాంజలి ఘటించి, నివాళులర్పిస్తారు.  ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, జాతీయ యుద్ధ స్మారకం వద్ద నున్న అమర జ్యోతి నుండి ‘స్వర్ణిం విజయ్ మషాల్’ ను వెలిగిస్తారు.  జాతీయ యుద్ధ స్మారకం వద్ద నున్న అమర జ్యోతి నుండి నాలుగు విజయ్ జ్యోతి కాగడాలను వెలిగిస్తారు.  ఈ నాలుగు విజయ్ జ్యోతి కాగడాలను,  1971 యుద్ధానికి చెందిన పరమ వీర చక్ర, మహా వీర చక్ర అవార్డు గ్రహీతల గ్రామాలతో సహా, దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకుని వెళతారు.  ఈ అవార్డు గ్రహీతల గ్రామాల నుండి మరియు 1971 లో ప్రధానంగా యుద్ధం జరిగిన ప్రాంతాల నుండి మట్టిని సేకరించి, జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్దకు తీసుకువస్తారు. 

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఈ సందర్భంగా స్మారక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  యుద్ధంలో పాల్గొన్న అనుభవజ్ఞులను, అమరవీరులైన సైనికుల భార్యలను ఈ సందర్భంగా సత్కరించనున్నారు.  బ్యాండు ప్రదర్శనలు, సెమినార్లు, ఎగ్జిబిషన్లు, యుద్ధ పరికరాల ప్రదర్శనలు, చలన చిత్రోత్సవాలు, సదస్సులు, సమావేశాలు, సాహస కార్యక్రమాలు వంటి వివిధ అంశాలను ఏర్పాటు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి శ్రీ శ్రీపాద యెస్సో నాయక్ తో పాటు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ పౌర, సైనిక అధికారులు కూడా పాల్గొంటారు.

 

*****


(Release ID: 1680941) Visitor Counter : 220