ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

మన కళలు, సంస్కృతి సంప్రదాయాల ద్వారా భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేయాలి

• కళాకారులకు ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపు

• సంగీతం, నృత్యం, నాటకం.. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప కానుకలు

• పాఠశాల విద్యలో సంగీతం, నృత్యాన్ని తప్పనిసరిగా చేర్చాలి

• మన సంస్కృతి, వారసత్వ మూలాలను యువత మరవకూడదు

• అంతర్జాల వేదికలను సంపూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కళాకారులకు సూచన

• ఆధునికత, సాంప్రదాయాల మేలుకలయిక చెన్నై నగరం

• ‘యువర్స్ ట్రూలీ మార్గళి’ ఉత్సవాన్ని అంతర్జాల వేదిక ద్వారా ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

• భారతీయ తత్వంతో పాటు ఐకమత్యం, శాంతి సామరస్యాలకు మన నృత్యం, సంగీతం ప్రతిబింబాలని వెల్లడి

Posted On: 15 DEC 2020 6:30PM by PIB Hyderabad

మన కళలు, సంస్కృతి-సంప్రదాయాలు, విలువలు, నిగూఢంగా ఉన్న శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని, కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేసేందుకు కృషిచేయాలని కళాకారులకు గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అంతర్జాల వేదికలను సద్వినియోగం చేసుకుంటూ వీలైనంత ఎక్కువమంది ప్రేక్షకులకు మన సంగీత, నృత్య మాధుర్యా్న్ని అందించాలని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి అంతర్జాల వేదిక ద్వారా ‘యువర్స్ ట్రూలీ మార్గళి’ ఉత్సవాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. నత్యం, సంగీతాలను ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన విలువైన కానుకలుగా అభివర్ణించిన ఆయన, ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని తిరిగి యావత్ ప్రపంచానికి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవశ్యకత ఎంతగానో ఉందన్నారు. మన సంగీత, నృత్య సంప్రదాయాన్ని కొనసాగించేందుకు ‘యువర్స్ ట్రూలీ మార్గళి’ ఓ చక్కని వేదికని ప్రశంసించారు.

భారతదేశ విధానాలైన అహింస, శాంతి సామరస్యాలను మన సంప్రదాయ నృత్యం, సంగీతాలు ప్రతిబింబిస్తాయన్న ఉపరాష్ట్రపతి, వీటి ద్వారా భారతదేశ ‘వసుధైవ కుటుంబకం’ తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తారం చేయడంలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వాల పరిమితులను ప్రస్తావించిన ఆయన, నృత్య, సంగీత కళాకారులు, పోషకులు, కార్యక్రమాల నిర్వాహకులు.. భారతదేశ సంస్కృతిని, ఆలోచనావిధానాన్ని, మన జీవన విధానాన్ని ప్రపంచానికి పరిచయడం చేయడంలో చొరవతీసుకోవాలని తెలిపారు.

చెన్నైతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఉపరాష్ట్రపతి, కర్నాటక సంగీతానికి రాజధానిగా చెన్నపట్టణం విరాజిల్లుతోందన్నారు. సంప్రదాయ, వారసత్వ విధానాలకు ఆధునిక జీవన విధానాన్ని జోడించుకుంటూ ముందుకెళ్లడమే చెన్నై నగర ప్రత్యేకత అని తెలిపారు.

కరోనా సమయంలో కళాకారుల సమాజం కూడా ప్రతికూల ప్రభావానికి గురైందన్న ఆయన.. ‘యువర్స్ ట్రూలీ’ వంటి వినూత్నమైన అంతర్జాల వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రేక్షకులకు చేరువకావాలని అభిలషించారు. భవిష్యత్తులోనూ అంతర్జాల వేదికల ద్వారా కళాకారులు తమ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పాలని ఆకాంక్షించారు. కరోనా కారణంగా నెలకొన్న ఆందోళన, మానసిక ఒత్తిడికి సంగీత, నృత్యాలనుంచి ఉపశమనం లభిస్తుందని.. భారత శాస్త్రీయ సంగీతం, నృత్యం ద్వారా మానసిక సంతులనం ఏర్పడుతుందని.. తద్వారా మనిషికి, ప్రకృతికి మధ్య అనుబంధానికి బాటలు పడతాయని తెలిపారు.

సామవేదం, నటరాజ నృత్యం వంటి వాటిని  ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, భారత పురాణేతి హాసాల్లో వీటికున్న ప్రాధాన్యతను.. మానవ జీవితంలో వీటి పాత్రను వివరించారు. వేల ఏళ్లనాటి నటరాజ నృత్యరూపకం నేటికీ భారతీయ కళగా నిలిచి ఉండటమే మన సంస్కృతి గొప్పదనమని తెలిపారు. నృత్యం, సంగీతం, నాటకాలు ప్రపంచానికి భారతదేశం అందించిన అపూర్వమైన కానుకలని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. వీటిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత భారతీయులందరిదన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంప్రదాయ కళలపై ఆసక్తి పెరుగుతోందన్న ఆయన,

భారతదేశ విద్యావిధానంలో కళలు అంతర్భాగంగా ఉండేవని, వాటిని తిరిగి విద్యావిధానంలోకి తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఈ దిశగా నూతన జాతీయ విద్యావిధానంలో తీసుకొచ్చిన సంస్కరణలను ఆయన అభినందించారు. 

శాస్త్రీయ సంగీతం, నృత్యాన్ని అభ్యసించడం ద్వారా విద్యార్థుల్లో గ్రహణ శక్తి పెరగడంతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సహనం పెరుగుతాయన్న ఉపరాష్ట్రపతి, ఇవి భవిష్యత్ భారతానికి అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. నేటి యువత వివిధ సంస్కృతుల ప్రసార, ప్రచారానికి ప్రతిబింబాలుగా ఉన్నారన్న ఆయన.. వివిధ దేశాల్లో భారతదేశ ప్రాచీన వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యత.. నేటి ప్రపంచ సమాజానికి వీటి అవసరాన్ని అందించడంలో మన దేశ యువత ప్రత్యేక పాత్ర పోషించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో భారత శాస్త్రీయ కళల రంగం అభివృద్ధికి కృషిచేస్తున్న కళాకారులు, ఇతర ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

****



(Release ID: 1680933) Visitor Counter : 464