వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

2025 నాటికి 5 ట్రిలియన్ అమెరికా డాల్లర్ల ఆర్ధిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడానికి

పరిశ్రమ ప్రభుత్వం కలసి పనిచేయాలి.

ఐసీసీ ప్లీనరీ సదస్సులో శ్రీ పీయూష్ గోయల్

Posted On: 15 DEC 2020 5:50PM by PIB Hyderabad

భారతదేశ ఆర్ధిక లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వంతో పరిశ్రమ వర్గాలు కలసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి శ్రీ. పీయూష్ గోయల్ పిలుపు ఇచ్చారు. ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ వార్షిక సదస్సులో మంత్రి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. సమావేశంలో మాట్లాడిన మంత్రి కొవిడ్ -19 వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితుల నుంచి బయటపడి దేశ ఆర్ధిక వ్యవస్థ లక్ష్యాలను సాధించడానికి ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ తన వంతు సహకారాన్ని అందించిందని అన్నారు. దీనితో 2025 నాటికి అయిదు ట్రిలియన్ అమెరికా డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి సాధించడానికి అవసరమైన పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి పేర్కొన్నారు.
కొవిడ్-19 ప్రతిఒక్క రంగానికి గుణపాఠం నేర్పిందని మంత్రి అన్నారు. వ్యాపార కార్యకలాపాలు, ఉత్పత్తి ప్రమాణాలు తదితర అంశాలపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ' మీలో ప్రతి ఒక్కరిని చూసి దేశం గర్వపడుతోంది. గడ్డు పరిస్థితి నుంచి బయట పడడానికి తమ సామర్ధ్యాన్ని పెంపొందించుకొని పిపిఇలు, మాస్కులు. వెంటిలేటర్లు భారతదేశంలో ఉత్పత్తి చేశాయి' అని మంత్రి అన్నారు. ' ప్రస్తుతం భారతదేశ మార్గదర్శకత్వం కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఇతర దేశాలకు అవసరమైన అన్ని వస్తువులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉండాలి' అని మంత్రి అన్నారు. ' ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ పిలుపు ఇచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ సాకారం అయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి శిక్షణ పొందిన యువతీయువకుల సేవలను పరిశ్రమ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. పార్మసీ రంగంలో దేశానికి వచ్చిన గుర్తింపు ప్రతి రంగంలో రావాలని ఆయన అన్నారు. 2025 నాటికి అయిదు ట్రిలియన్ అమెరికా డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి సాధించడానికి పరిశ్రమ, ప్రభుత్వం కలసి పనిచేయవలసి అవసరం ఉందని అన్నారు. 2047లో శత వసంతాల స్వతంత్ర వేడుకలకు సిధ్దం అవుతున్న మనం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో అగ్రగామిగా నిలబడగలమని ఆయన అన్నారు.ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం సానుకూల విధానాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ రూపొందించి అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని శ్రీ గోయల్ అన్నారు. వీటివల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడడమే కాకుండా వ్యాపార వాణిజ్య కార్యక్రమాలు నిజాయితీగా సాగుతూ దేశాభివృద్ధికి సహకరిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

135 కోట్ల భారతీయులకు అవసరమైన విద్య, వైద్య అవసరాలను సమకూర్చి ప్రజలజీవన ప్రమాణాలు మెరుగుపడేలా చూడడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు.

***

 



(Release ID: 1680928) Visitor Counter : 95