ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

లేడీ హార్డింగ్ వైద్య కళాశాల స్నాతకోత్సవ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించిన - డాక్టర్ హర్ష వర్ధన్

"వైద్య విద్య ఆరోగ్య సంరక్షణ పిరమిడ్ యొక్క శిఖరాన్ని ఏర్పరుస్తుంది"

"వైద్య విద్య యొక్క అత్యున్నత ప్రమాణాలను నిర్ధారించడమే - ఈ ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యం"

వైద్యులు, నిపుణులకు నాణ్యమైన వైద్య విద్యను అందించడం - దేశంలోని ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను రాబోయే తరాలకు నిర్ధారిస్తుంది : డాక్టర్ హర్ష వర్ధన్

Posted On: 12 DEC 2020 12:46PM by PIB Hyderabad

లేడీ హార్డింగ్ వైద్య కళాశాల (ఎల్.‌హెచ్.‌ఎం.సి)  స్నాతకోత్సవ సందర్భంగా, ఈ రోజు,  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్, కళాశాల విద్యార్థులనుద్దేశించి దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు.  గౌరవనీయులు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, డాక్టర్ హర్ష వర్ధన్ తన కృతజ్ఞతలు తెలియజేస్తూ, "ప్రఖ్యాత లేడీ హార్డింగ్ వైద్య కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొనడం విశేషమైన గౌరవంగా భావిస్తున్నాను. ఈ రోజు 99వ బ్యాచ్  ఎమ్.బి.బి.ఎస్. విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయడం, ఈ కళాశాల చరిత్రలో మరొక మైలురాయి సంఘటన." అని వ్యాఖ్యానించారు. 

దేశంలోని పురాతన వైద్య కళాశాలలలో ఎల్.‌హెచ్.‌ఎం.సి. ఒకటని ఆయన ప్రశంసిస్తూ, "లేడీ హార్డింగ్  ఒక చారిత్రక సంస్థ.  ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, పార్లమెంటు భవనం, రాష్ట్రపతి భవనం వంటి  కట్టడాల నిర్మాణం కంటే ముందే, ఎల్.‌హెచ్.‌ఎం.సి. ని స్థాపించారంటే, మీలో కొంతమందికి ఆశ్చర్యం కలగవచ్చు.  స్వాతంత్య్ర సమయంలోనూ, ఆ తరువాత చాలా సంవత్సరాల వరకు, ఢిల్లీలో ఉన్న ఏకైక వైద్య కళాశాల ఇది.” అని తెలియజేశారు.

"గత 104 సంవత్సరాలుగా, ఈ సంస్థ మన దేశంలో మహిళా సాధికారతకు చిహ్నంగా కొనసాగుతోంది. ఈ రోజున, లేడీ హార్డింగ్ పూర్వ విద్యార్థులు దేశ, విదేశాలలో గర్వించదగిన స్థానాలను ఆక్రమించి, ఆరోగ్య సంరక్షణతో పాటు, వైద్య విద్య రంగాలలో ప్రశంసనీయమైన కృషి చేస్తూ, సంస్థకు, దేశానికీ, కీర్తి, ప్రతిష్టలను తీసుకువస్తున్నారు. దేశంలోని మొదటి అత్యుత్తమ 10 వైద్య కళాశాలల్లో కూడా స్థానం పొందిన ఈ సంస్థ,  అత్యుత్తమ వైద్య నిపుణులను స్థిరంగా ఉత్పత్తి చేస్తోంది.” అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

కోవిడ్ కి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటంలో కళాశాల అందిస్తున్న సహకారాన్ని కేంద్రమంత్రి ప్రశంసిస్తూ, "కోవిడ్-19 యొక్క అసాధారణమైన సవాలుకు ఎల్.హెచ్.ఎమ్.సి. స్పందించిన విధానాన్నీ, ఈ ఘోరమైన వైరస్ కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్నీ నేను అభినందిస్తున్నాను.  ఆర్.టి-పి.సి.ఆర్.  పరీక్షలను నిర్వహించడానికి అత్యాధునిక సదుపాయాన్ని స్థాపించిన ఢిల్లీ లోని మొట్టమొదటి ప్రభుత్వ సంస్థలలో లేడీ హార్డింగ్ ఒకటి.  ఈ వైరస్ కు వ్యతిరేకంగా మహమ్మారి వ్యాప్తి మరియు వివిధ చికిత్సా పద్ధతులను పరీక్షిస్తున్న సమయంలో, స్వస్థమైన ప్లాస్మా చికిత్స యొక్క ఉపయోగాన్ని అంచనా వేయడానికి ట్రయల్స్ నిర్వహించే కేంద్రాలలో ఎల్.హెచ్.ఎం.సి. ఒకటి.” అని చెప్పారు. 

హర్ష వర్ధన్ మాట్లాడుతూ, "ఈ కాలంలో కూడా, ఎల్.‌హెచ్.‌ఎం.సి. క్యాన్సర్ శస్త్రచికిత్స, క్యాన్సర్‌ కు కీమో థెరపీ సేవలు మరియు తలసేమిక్స్‌కు రక్త మార్పిడితో సహా పూర్తి అవసరమైన సేవలను అందిస్తూనే ఉందని, ఇతర నాన్-కోవిడ్ రోగులకు చికిత్సను అందిస్తుందని నేను ప్రత్యేకంగా పేర్కొంటున్నాను.  కోవిడ్ బారిన పడిన అనేక మంది వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తలు ఉన్నప్పటికీ, ఈ భయంకరమైన వ్యాధితో పోరాటం కొనసాగించిన ఎల్.హెచ్.ఎం.సి. సిబ్బంది స్ఫూర్తిని నేను అభినందిస్తున్నాను.” అని పేర్కొన్నారు. 

కళాశాల విస్తరణ మరియు అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను డాక్టర్ హర్ష వర్ధన్ పునరుద్ఘాటిస్తూ, "ఈ సంస్థ వంద సంవత్సరాల ప్రతిష్టాత్మక వారసత్వాన్ని పెంపొందించి, వైద్య విద్య మరియు ఆరోగ్య సంరక్షణలో ముందంజలో ఉంచడంతో పాటు, సంస్థ మౌలిక సదుపాయాలను ప్రపంచంలోని ఉత్తమ సంస్థలతో సమానంగా తీసుకురావాలనే ఉద్దేశ్యంతో, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ సంస్థ యొక్క అభివృద్ధిని విస్తరించడానికి మరియు వేగవంతం చేయడానికి కట్టుబడి ఉంది." అని తెలియజేశారు.   సమగ్ర పునరాభివృద్ధి ప్రణాళిక మొదటి దశ దాదాపు పూర్తి అయ్యింది. అకాడెమిక్ మరియు ఆంకాలజీ బ్లాక్‌ ను ఈ నెలలోనే వినియోగం కోసం అప్పగించనున్నారు. మిగిలిన యాక్సిడెంట్ & ఎమర్జెన్సీ, ఇన్‌-పేషెంట్, ఔట్  పేషెంట్ బ్లాక్‌లు వేగంగా పూర్తయ్యే దశలో ఉన్నాయనీ, 2021 మార్చి, 31వ తేదీ నాటికి ఇవి కూడా వినియోగంలోకి వస్తాయని, ఆయన తెలిపారు. ఈ విషయాలను ఆయన మరింతగా వివరిస్తూ, "మొదటి దశ కింద చేపట్టిన ఆసుపత్రి భవనం యొక్క ఈ మూడు బ్లాకుల నిర్మాణాన్ని పూర్తి చేసి, వినియోగంలోకి తీసుకురావడానికి అవసరమైన పూర్తి ఆర్థిక సహాయం, మద్దతు అందజేస్తామని, భారత ప్రభుత్వం తరపున నేను మీకు భరోసా ఇస్తున్నాను.  అదేవిధంగా, నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ, న్యూరో సర్జరీ వంటి ప్రత్యేక సేవలు ఎల్.‌హెచ్.‌ఎం.సి. లో అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా, సంస్థ, పునరాభివృద్ధి బృహత్ ప్రణాళిక కు చెందిన II, III మరియు IV దశలు త్వరగా అమలౌతాయని కూడా నేను ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను." అని పేర్కొన్నారు.

వైద్య విద్య ఆరోగ్య సంరక్షణ పిరమిడ్ యొక్క శిఖరాన్ని ఏర్పరుస్తుందని, డాక్టర్ హర్ష వర్ధన్ పేర్కొంటూ, "వైద్య విద్యను అభ్యసిస్తున్న వైద్యులు, నిపుణుల నాణ్యత, రాబోయే తరాలకు, దేశంలోని ఆరోగ్య సేవల నాణ్యతను నిర్ధారిస్తుంది. ఈ నేపథ్యంలో, వైద్య విద్య యొక్క అత్యున్నత ప్రమాణాలను నిర్ధారించడం ఈ ప్రభుత్వానికి ప్రధమ ప్రాధాన్యత.” అని తెలియజేశారు. 

వైద్యం చేయడం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదనీ, అది ఒక సామాజిక బాధ్యతగా భావించాలని, డాక్టర్ హర్ష వర్ధన్, విద్యార్థులందరికీ గుర్తు చేశారు.  "మీరు ఎప్పటికీ నేర్చుకోవడం ఆపకూడదు. మీ జ్ఞానాన్నీ, నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకుంటూ ఉండాలి.  అదే విధంగా, రోగులకు చికిత్స చేసే సమయంలో, వారిపట్ల కరుణ చూపడం చాలా ముఖ్యం.  మీ మానవత్వాన్నీ, మీ రోగులనూ, మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు.  వారిని, కేవలం, ప్రత్యేకమైన శరీర భాగాల సమాహారంగా మాత్రమే చూడవద్దు.  వారు, తమ కుటుంబాలు, సంఘాలు మరియు సమాజాలతో అనుసంధానమై, ప్రత్యేకమైన జీవిత గాథలను కలిగి ఉంటారు. వీరిలో ముఖ్యంగా, మహిళలు, బాలికలు తరచూ ప్రతికూల అనుభవాలను కలిగి ఉంటారు.  ఈ పరిస్థితులు, వారి అనారోగ్యం మరియు వారికి మనం అందించే  వైద్య చికిత్స మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.” అని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్ష వర్ధన్, తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ,  "ఈ రోజు ఇక్కడ పట్టాలు స్వీకరించిన విద్యార్థులు, కళాశాల పూర్వ విద్యార్థుల వారసత్వాన్ని, ప్రాభవాన్నీ ముందుకు తీసుకువెళ్ళి, వైద్య శాస్త్ర రంగంలో మంచి పేరును సంపాదించుకుంటారనీ, సంస్థ గర్వించేలా కృషి చేస్తారనీ, నాకు ఖచ్చితంగా తెలుసు.  దేశ సర్వతోముఖాభివృద్ధి, పురోగతి, శ్రేయస్సులలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గ్రాడ్యుయేటింగ్ వైద్య విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఈ విషయంలో కీలక పాత్ర పోషించవలసి ఉంటుంది.  మీరు, ఈ పనిని, అత్యంత భక్తి, శ్రద్ధలతో, కరుణతో చేయాలి. ఈ రోజు మీ అధ్యయన కోర్సుకు ముగింపుగా భావించకూడదు, ఇది మీ పురోగతికి ఆరంభంగా స్వీకరించాలి." అని సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా - 197 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 129 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులతో పాటు, 7 గురు  పోస్ట్ డాక్టరల్స్ ఈ రోజు పట్టాలు స్వీకరించారు. 

డాక్టర్ హర్ష వర్ధన్ చివరిగా మాట్లాడుతూ,  కళాశాల ప్రస్తుత, భవిష్యత్తు కార్యక్రమాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా పూర్తి సహాయ, సహకారాలతో పాటు నిరంతర మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో - కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీ రాజేష్ భూషణ్; ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్,  డాక్టర్ సునీల్ కుమార్ కూడా దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్నారు.

 

*****


(Release ID: 1680327) Visitor Counter : 139