హోం మంత్రిత్వ శాఖ

మాదకద్రవ్యాల నియంత్రణ సహకారంపై భారత్–మైన్మార్ ఐదో ద్వైపాక్షిక సమావేశం వర్చువల్ పద్ధతిలో జరిగింది

మాదకద్రవ్యాల స్వాధీనం కేసులు, కొత్త సైకోట్రోపిక్ పదార్థాలు , వాటి పూర్వపదార్థాలపై (ప్రీకర్సర్స్) తదుపరి దర్యాప్తు జరిపేందుకు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సకాలంలో మార్పిడి చేసుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

Posted On: 11 DEC 2020 1:19PM by PIB Hyderabad

భారత మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్‌సిబి) , మైన్మార్ మాదకద్రవ్యాల దుర్వినియోగ నియంత్రణపై కేంద్ర కమిటీ మధ్య మాదకద్రవ్యాల నియంత్రణ సహకారంపై చర్చల కోసం 5 వ భారత- మైన్మార్ ద్వైపాక్షిక సమావేశం 2020 డిసెంబర్ 10 న వర్చువల్ పద్ధతిలో జరిగింది. భారత ప్రతినిధి బృందానికి నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ రాకేశ్ అస్థానా నాయకత్వం వహించారు.  మైన్మార్ ప్రతినిధి బృందానికి డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డివిజన్ (డిఇడి) కమాండర్, మాదకద్రవ్యాల దుర్వినియోగ నియంత్రణ కేంద్ర కమిటీ సంయుక్త కార్యదర్శి, పోల్. బ్రిగేడియర్ జనరల్ విన్ నాయింగ్ నాయకత్వం వహించారు.

రాకేశ్ అస్తానా మాట్లాడుతూ దేశంలో హెరాయిన్ , యాంఫేటమిన్ టైప్ స్టిమ్యులెంట్స్ (ఎటిఎస్) అక్రమ రవాణా సమస్యల గురించి వివరించారు.. మైన్మార్ సరిహద్దుల వెంట ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో మాదకద్రవ్యాల వినియోగం అధికంగా ఉండటం భారతదేశానికి ఆందోళన కలిగించే విషయమని అన్నారు. భారతదేశం-మైన్మార్ సరిహద్దు ల నుంచే కాకుండా, బంగాళాఖాతంలో సముద్ర మార్గం ద్వారా మాదకద్రవ్యాల రవాణా రెండు దేశాలకు కొత్త సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో మాదకద్రవ్యాల రవాణాను ఎదుర్కోవటానికి మయన్మార్‌తో సమాచారాన్ని పంచుకుంటామని, ఇందుకోసం ఉద్దేశించిన  ప్రస్తుత యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి ఎన్‌సిబి కట్టుబడి ఉందని రాకేశ్ స్పష్టం చేశారు.

  గత సంవత్సరాల్లో మైన్మార్ , భారతదేశం మధ్య సహకార యంత్రాంగాన్ని మెరుగుపరిచినప్పటికీ, ఈ ప్రాంతంలో యాబా టాబ్లెట్ల (మెథాంఫేటమిన్) ఉత్పత్తి పెరుగుతుండటం గురించి జనరల్ విన్ నాయింగ్ వివరించారు. ప్రతి స్థాయిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా , పూర్వగామి అక్రమ రవాణా కార్యకలాపాలపై తరచూ సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని ఆయన కోరారు. మాదకద్రవ్యాల ముప్పును ఎదుర్కోవటానికి నిరంతర కృషి చేసినందుకు ఎన్సీబీని ఆయన అభినందించారు.

మాదకద్రవ్యాల స్వాధీనం కేసులు, కొత్త సైకోట్రోపిక్ పదార్థాలు , వాటి పూర్వగాములలో తదుపరి పరిశోధనలు నిర్వహించడానికి సకాలంలో ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలన్న ప్రతిపాదనకు ఇరు దేశాలు అంగీకరించాయి. మాదకద్రవ్యాల చట్ట అమలుపై ప్రస్తుతం ఉన్న సహకారాన్ని బలోపేతం చేయడానికి సరిహద్దు స్థాయి అధికారులు / క్షేత్రస్థాయి అధికారుల సమావేశాలను  ఃమధ్య రోజూ నిర్వహించడానికి అంగీకరించారు. మైన్మార్-ఇండియా సరిహద్దుల్లో అక్రమ మాదకద్రవ్యాల అక్రమ రవాణా , ఎగ్జిట్ పాయింట్ల సమాచారం , మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడానికి సాంకేతిక పరిజ్ఞానం తదితర సమాచారాన్ని కూడా బదిలీ చేసుకోవాలని నిర్ణయించారు. భారతదేశంలో మాదకద్రవ్యాల నియంత్రణ సహకారంపై  భారత్ – మైన్మార్ ఆరో ద్వైపాక్షిక సమావేశాన్ని వచ్చే ఏడాది నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నిర్మాణాత్మక , అర్ధవంతమైన చర్చలపై ఇరువర్గాలు కృతజ్ఞతలు తెలియజేసుకోవడంతో శుభాకాంక్షలతో సమావేశం ముగిసింది. భవిష్యత్తులో ఇటువంటి సహకారానికి కట్టుబడి ఉన్నామని ఇరు దేశాల అధికారులు ప్రకటించారు.

***(Release ID: 1680162) Visitor Counter : 213