ఉప రాష్ట్రపతి సచివాలయం
ఏలూరు ఘటనపై ఉపరాష్ట్రపతి చొరవతో రంగంలోకి కేంద్ర బృందం
- కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి శ్రీ హర్షవర్ధన్‌తో మాట్లాడిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
- సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచన
- ప్రత్యేక నిపుణులు, వైరాలజిస్టులతో ఓ బృందాన్ని ఏర్పాటుచేసిన కేంద్ర మంత్రి
- ఏలూరు వైద్యులు, వైద్యాధికారులతో మాట్లాడిన కేంద్ర బృందం
Posted On:
07 DEC 2020 6:00PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు పట్టణంలో అంతుచిక్కని వ్యాధి సృష్టిస్తున్న అయోమయంపై ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన విషయం తెలవగానే కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక వైద్యులతోపాటు మంగళగిరి ఎయిమ్స్ వైద్య బృందం పరిశీలించారని.. అయితే వైద్యపరీక్షల్లో ఈ పరిస్థితికి కారణమేంటనేది మాత్రం తెలియడం లేదని అధికారులు ఉపరాష్ట్రపతికి తెలియజేశారు.
ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్‌తో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. బాధితులకు ఉన్నతస్థాయి వైద్యం అందించడంతోపాటు.. ఈ ఘటనకు కారణమేంటనే దాన్ని గుర్తించి.. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు రాష్ట్రప్రభుత్వంతో సహకరించాలని, ప్రత్యేక చొరవతీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి ముగ్గురు వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేశారు. ఏయిమ్స్ అత్యవసరవైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్, పుణే ఎన్ఐవీ వైరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ దేవష్టవర్, ఎన్డీసీసీ డిప్యూటీ డైరెక్టర్, డాక్టర్ సంకేత్ కులకర్ణిలతో కూడిన ఈ బృందం.. ఏలూరు వైద్యులతో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఏలూరులో నాలుగైదు రోజులుగా పలువురు మూర్ఛ, కళ్లుతిరగడం, నోట్లు నురగ వంటి లక్షణాలతో వివిధ ఆసుపత్రుల్లో చేరుతూ చికిత్స తీసుకుని రెండ్రోజుల్లో కోలుకోగానే ఇంటికి వెళ్లిపోతున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా కేసుల తీవ్రత పెరగడం ఇందులోనూ చిన్నారులు, మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆందోళన మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఇది సంక్రమణ వ్యాధి లాగా అనిపించడం లేదని వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నా.. అసలు కారణాలేంటనేది మాత్రం అంతుచిక్కడం లేదు. పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని విజయవాడ, విశాఖపట్టణం పంపి చికిత్సనందిస్తున్నారు.
డైరక్టర్లతో మాట్లాడిన అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. ఉపరాష్ట్రపతి చొరవతో ఏర్పాటైన ఢిల్లీ ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ కు చెందిన వైద్య నిపుణులు, వైరాలజిస్టుల బృందం ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు వచ్చి, ల్యాబ్ నివేదికలను పరిశీలించి తగిన వైద్య సలహాలు అందజేస్తారని ఉపరాష్ట్రపతికి కేంద్ర మంత్రి తెలియజేశారు.
***
(Release ID: 1678887)
Visitor Counter : 266