శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2020పై అవగాహన సదస్సులు, 35 చోట్ల విజ్ఞానయాత్రల నిర్వహణ

Posted On: 07 DEC 2020 1:04PM by PIB Hyderabad

ఈ ఏడాది జరగబోయే భారతీయ, అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర ఉత్సవం (ఐ.ఐ.ఎస్.ఎఫ్-2020) కోసం   దేశవ్యాప్తంగా పలు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధ పరిశోధనాగారాలు, విజ్ఞానశాస్త్ర సంస్థలు, విజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. విజ్ఞాన శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలికి (సి.ఎస్.ఐ.ఆర్.కి) అనుబంధించిన, హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎన్‌.జి.ఆర్‌.ఐ.) ఒక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించింది. సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్, విజ్ఞానశాస్త్ర పారిశ్రామిక పరిశోధనా విభాగం కార్యదర్శి డాక్టర్ శేఖర్ సి. మాండే ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రసంగం చేశారు. 2015నుంచి ఐ.ఐ.ఎస్.ఎఫ్. వేడుకలను జరుపుతూ వస్తున్నామని,  వివిధ విజ్ఞానశాస్త్ర విభాగాల ఔత్సాహికులను, నిపుణులను ప్రజలతో అనుసంధానం చేయడంలో ఈ ఉత్సవం కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు. విజ్ఞానశాస్త్ర ప్రయోజనాలను మరింత విస్తృతంగా సమాజానికి చేర్చడానికి ఇలాంటి కార్యక్రమాలు, చర్చలు దోహదపడతాయని, విభిన్నమైన విజ్ఞానశాస్త్ర అంశాలను ఇలా ఉమ్మడి వేదికపైకి తీసుకురావడంతో మన జీవితాలను సుసంపన్నం కాగలవని అన్నారు.

  సముద్ర వనరులపై సమాచార సేవల జాతీయ కేంద్రం మాజీ డైరెక్టర్ డి. సతీష్ షెనాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మనదేశం నేపథ్యంగా ‘సముద్రగర్భంలో పరిశోధనలు-సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. భూమిపై జీవరాసుల విభిన్నత్వం అన్న భావనను ఆయన పరిచయం చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సవాళ్లను, అవకాశాలను ఆయన వివరించారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతకు సంబంధించి ఎల్. నినో, లా నినో పరిణామాలను, హిందూమహా సముద్ర ఉపరితలంపై పరిస్థితులను, ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదల, విపరీత వాతావరణ పరిణామాలు తదితర అంశాలను ఆయన సరళమై రీతిలో వివరించారు.  ఇవన్నీ మన జీవితాలను,  ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నవేనన్నారు.  

 

  విజ్ఞాన భారతి (విభా) నిర్వహణా కార్యదర్శి జయంత్ సహస్రబుధే మాట్లాడుతూ, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చడంలో ఐ.ఐ.ఎస్.ఎఫ్. కీలకపాత్ర, అందులో హేతుబద్ధత గురించి వివరించారు. స్వావలంబనతో కూడిన భారతదేశం కోసం విజ్ఞాన శాస్త్రం, ప్రపంచ సంక్షేమం అన్న ఇతివృత్తంతో ఐ.ఐ.ఎస్.ఎఫ్. జరగబోతోందని, నిర్వహణ బాధ్యతను సి.ఎస్.ఐ.ఆర్. చేపట్టిందని అన్నారు.

  అంతకు ముందు సి.ఎస్.ఐ.ఆర్.-ఎన్.జి.ఆర్.ఐ. డైరెక్టర్ డాక్టర్ వి.ఎం. తివారీ స్వాగతోపన్యాసం చేశారు.  విజ్ఞాన శాస్త్రం సామాన్య ప్రజల ఆదరణ పొందేలా తమ సంస్థ అన్ని రకాల చర్యలూ తీసుకుంటుందని, ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2020 గురించి ప్రజలకు తగిన అవగాహన కల్పిస్తామని చెప్పారు.

 ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2020పై అవగాహనా కృషిలో భాగంగా, ఘజియాబాద్ లోని సి.ఎస్.ఐ.ఆర్. మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (హె.ఆర్.డి.సి.) కూడా ఒక వెబినార్ నిర్వహించింది. “సామాన్య ప్రజలు, అట్టడుగు స్థాయిలో ఆవిష్కరణలకోసం విజ్ఞానశాస్త్రం” అన్న అంశంపై ఈ వెబినార్ సదస్సులో చర్చించారు. ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2020కి నోడల్ సంస్థగా వ్యవహరిస్తున్న జాతీయ సైన్స్ టెక్నాలజీ, అభివృద్ధి అధ్యయనాల సంస్థ (ఎన్.ఐ.ఎస్.టి.డి.ఎస్.) సహభాగస్వామ్యంతో ఈ వెబినార్ సదస్సును నిర్వహించారు.

 

  ఈ వెబినార్ లో సి.ఎస్.ఐ.ఆర్.-హెచ్.ఆర్.డి.సి. అధిపతి డాక్టర్ ఆర్.కె. సిన్హా స్వాగతోపన్యాసం చేస్తూ, ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2020ని గురించి క్లుప్తంగా వివరించారు. విజ్ఞాన భారతి (విభా) నిర్వహణా కార్యదర్శి జయంత్ సహస్రబుధే మాట్లాడుతూ, శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రాంతీయ భాషల్లో వ్యక్తీకరించాల్సిన అవసరం ఉందని, విభిన్నమైన భాషలు, సంస్కృతుల, ప్రాంతాల, జీవన విధానాల నిలయమైన భారతదేశంలో ఇది అసరమని అన్నారు. ఐ.ఐ.ఎస్.ఎఫ్. పయనం కొనసాగుతోందని, సమాజంలోని ప్రతి వర్గానికి విజ్ఞానశాస్త్రం చేరుతుందన్న విశ్వాసం తమకుందని అన్నారు. భారతీయ శాస్త్రవేత్తల సామాజిక బాధ్యతలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. విజ్ఞాన శాస్త్రాన్ని స్థానిక, ప్రాంతీయ భాషల్లో వ్యక్తీకరించిపుడే, దేశంలోని ప్రతి పౌరుడీకీ విజ్ఞాన శాస్త్ర ప్రయోజనాలు చేరతాయన్నారు. నవభారత పునర్నిర్మాణానికి ఇది దోహదపడుతుందన్నారు.

  డాక్టర్ శేఖర్ సి. మాండే ఈ సందర్భంగా మాట్లాడుతూ, వర్చువల్ పద్ధతిలో ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2020 నిర్వహణ అనేది మనకు అందివచ్చిన గొప్ప అవకాశమని, భారీస్థాయిలో ప్రజాసమూహానికి విజ్ఞాన శాస్త్రాన్ని అనుసంధానం చేయడానికి దోహదపడుతుందని అన్నారు.  పరిశోధనాగారాల్లో ఎలాంటి కృషి జరుగుతోందో అన్న కుతూహలం సామాన్య ప్రజలకు ఉందని, పరిశోధనా కార్యకలాపాలను ప్రజలకు తెలియజెప్పడం మన విద్యుక్త ధర్మమని అన్నారు. సమాజంలో ప్రతిఒక్కరికీ ప్రయోజనం అందేలా ఐ.ఐ.ఎస్.ఎఫ్.ను ప్రోత్సహించాలన్నారు. కోవిడ్-19 ప్రబలిన ప్రస్తుతం తరుణంలో ప్రభుత్వ మార్గదర్శ సూత్రాలను అందరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. జనసమూహంలోకి వెళ్లాల్సి వచ్చినపుడు మాస్కులను ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనదన్నారు.

 

  మీరట్ లోని చౌధరీ చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ వై. విమల మాట్లాడుతూ, అవగాహనా కార్యక్రమాన్నినిర్వహించిన సి.ఎస్.ఐ.ఆర్.-హెచ్.ఆర్.డి.సి.ని అభినందించారు. ప్రకృతిలో దాగిన శాస్త్రీయ విజ్ఞానం గురించి ఆమె వృక్షశాస్త్ర శాస్త్రవేత్తగా వివరించారు. ప్రకృతి అధ్యయనంపై యువకులు, చిన్న పిల్లలు తమ దృష్టిని కేంద్రీకరించేలా చూడాలన్నారు. సామాన్య ప్రజలతో తమ విజ్ఞానాన్ని, అనుభవాలను పంచుకునేందుకు శాస్త్రవేత్తలు ముందుకు రావాలన్నారు. హనీబీ నెట్వర్క్, సృష్టి, గియాన్, ఎన్.ఐ.ఎఫ్. సంస్థల వ్యవస్థాపకుడు, సి.ఎస్.ఐ.ఆర్. భట్నాగర్ ఫెలోషిప్ గ్రహీత అయిన ప్రొఫెసర్ అనిల్ గుప్తా ప్రధాన ప్రసంగం చేశారు. జాతి అభివృద్ధిలో సైన్స్, టెక్నాలజీ ప్రాముఖ్యత గురించి ప్రజలు, విద్యార్థులు తెలుసుకోవడానికి ఐ.ఐ.ఎస్.ఎఫ్. వంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. భారతదేశంలో అట్టడుగు స్థాయిలో జరిగిన ఆవిష్కరణలను ఆయన సోదాహరణంగా వివరించారు. సి.ఎస్.ఐ.ఆర్.-హెచ్.ఆర్.డి.సి. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శోభనా చౌదరి వందన సమర్పణ చేశారు.

  పిలానీలోని సి.ఎస్.ఐ.ఆర్.-కేంద్రీయ ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ (సి.ఇ.ఇ.ఆర్.ఐ.), విజ్ఞానభారతి రాజస్థాన్ విభాగం, కూడా ఐ.ఐ.ఎస్.ఎఫ్.2020 సన్నాహక కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ఈ సందర్భంగా, ఐ.ఐ.ఎస్.ఎఫ్. ముఖ్యమైన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ జరిగింది. “ఇంజనీరింగ్ విద్యార్థుల నమూనా పోటీ, ప్రదర్శన” పేరిట కార్యక్రమం జరిగింది.

 భారతీయ, అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్ర ఉత్సవం (ఐ.ఐ.ఎస్.ఎఫ్.)లో విజ్ఞాన యాత్ర ప్రముఖమైన సంఘటన. విద్యార్థుల్లో, ప్రజల్లో శాస్త్రీయ అవగాహన, ఆసక్తిని కలిగించే లక్ష్యంతో చేపట్టిన విజ్ఞానశాస్త్ర పయనం ఇది.  దేశవ్యాప్తంగా జరగనున్న విజ్ఞాన యాత్రకోసం 35 ప్రధాన ప్రాంతాలను గుర్తించారు. 2020 డిసెంబర్ 2న కేరళకు చెందిన స్వదేశీ విజ్ఞానశాస్త్ర ఉద్యమ సంస్థ ఒక కార్యక్రమం నిర్వహించింది. డాక్టర్ అబ్దుల్ కలామ్ విజ్ఞాన యాత్ర పేరిట వర్చువల్ వేదికపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, కేంద్ర పర్యాటక శాఖ మాజీమంత్రి ఆల్ఫోన్స్ కన్నాంథనం, కొచ్చిన్ సైన్స్, టెక్నాలజీ ఇన్.స్టిట్యూట్ (సి.యు.ఎస్.ఎ.టి.), ఫొటానిక్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ వి.పి.ఎన్. నంపూరి ప్రత్యేక ఉపన్యాసాలు చేశారు.

 

  పుణెలోని భారతీయ ఉష్ణమండల వాతావరణ శాస్త్ర అధ్యయన సంస్థ (ఐ.ఐ.టి.ఎం.) కూడా,.. విజ్ఞాన భారతి సంస్థ పుణె విభాగంతో కలసి విజ్ఞాన యాత్రను నిర్వహించింది. విజ్ఞాన శాస్త్ర కార్యకలాపాలను వర్చువల్ పద్ధతిలో తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

  ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2020 పేరిట ఈ ఉత్సవాన్ని డిసెంబరు 22నుంచి 25వరకూ వర్చువల్ పద్ధతిలో నిర్వహించనున్నారు. వర్చువల్ వేదికపై అతిపెద్ద కార్యక్రమంగా ఈ ఉత్సవాన్ని చేపడుతున్నారు. “స్వావలంబతో కూడిన భారతదేశం, ప్రపంచ సంక్షేమం” అన్న ప్రధాన ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఐ.ఐ.ఎస్.ఎఫ్.లో 9 విభాగాలకు సంబంధించిన 41 కార్యక్రమాలు చేపడుతున్నారు. ఐదు విభిన్న కేటగిరీల్లో గిన్నిస్ ప్రపంచ రికార్డులకోసం ఎంట్రీలను కూడా  ఐ.ఐ.ఎస్.ఎఫ్. సందర్బంగా పంపిస్తారు.

 

****


(Release ID: 1678879) Visitor Counter : 289