వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

మేధో సంపత్తి సహకారంపై భారత్‌, అమెరికా అవగాహన ఒప్పందం


Posted On: 03 DEC 2020 2:58PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వర్తక ప్రోత్సాహం విభాగం (డీపీఐఐటీ) మేధో సంపత్తిపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా వాణిజ్య శాఖకు చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ పేటెంట్‌ అండ్‌ ట్రేడ్‌మార్క్‌ ఆఫీస్‌ (యూఎస్‌పీటీవో)తో ఈ ఎంవోయూ కుదిరింది. డీపీఐఐటీ కార్యదర్శి డా.గురుప్రసాద్‌ మహాపాత్ర, యూఎస్‌పీటీవో డైరెక్టర్‌ ఆండ్రీ ఇయాన్కు వర్చువల్‌ పద్ధతిలో బుధవారం నాడు ఈ ఒప్పంద కార్యక్రమం నిర్వహించారు.

అమెకారితో మేధో సంపత్తి సహకారంపై ఒప్పందానికి ఈ ఏడాది ఫిబ్రవరి 19న జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ క్రింద సూచించిన రీతిలో, ఇరు దేశాల మధ్య సహకారం పెంపు ఈ ఒప్పందం ఉద్దేశం:

  1. పాల్గొనేవారు విడిగా లేదా సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రజల మధ్య, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, ఆర్‌&డీ సంస్థలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మధ్య ఐపీ ఉత్తమ పద్ధతులు, అనుభవాలు, పరిజ్ఞానాన్ని మార్చుకోవడం లేదా వ్యాప్తి చేయడానికి వీలు కల్పించడం
  2. శిక్షణ కార్యక్రమాలు, నిపుణుల మార్పిడి, సాంకేతికత మార్పిడి, సంబంధిత కార్యక్రమాల్లో సహకారం
  3. పేటెంట్లు, ట్రేడ్‌మార్కులు, కాపీరైట్లు, భౌగోళిక సూచికలు, పారిశ్రామిక డిజైన్ల కోసం దరఖాస్తుల పరిశీలన, నమోదు విధానాలతోపాటు ఐపీ హక్కుల రక్షణ, అమలు, ఉపయోగంపై సమాచారం, ఉత్తమ పద్ధతుల మార్పిడి
  4. ఐపీలో స్వయంచాలిత, ఆధునిక ప్రాజెక్టులు; కొత్త డాక్యుమెంటేషన్‌, సమాచార వ్యవస్థలు; ఐపీ కార్యాలయ సేవల నిర్వహణ విధానాలపై సమాచార మార్పిడి
  5. సంప్రదాయ విజ్ఞానానికి సంబంధించిన వివిధ సమస్యలను అర్థం చేసుకునేందుకు సహకారంతోపాటు సంప్రదాయ విజ్ఞానానికి సంబంధించిన ఉత్తమ పద్ధతుల మార్పిడి, సంప్రదాయ విజ్ఞాన రక్షణ కోసం ఇప్పటికే ఉన్న ఐపీ వ్యవస్థల వాడకంపై అవగాహన పెంచడం
  6. పాల్గొనేవారు కలిసి నిర్ణయించే ఇతర సహకార కార్యకలాపాలు

ఎంవోయూ అమలు కోసం; కార్యాచరణ పరిధితోపాటు, సహకార కార్యకలాపాల నిర్వహణకు సవివర ప్రణాళిక గల ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రెండు వర్గాలు రూపొందిస్తాయి.

భారత్‌, అమెరికా మధ్య సహకారాన్ని వేగవంతం చేయడంలో ఈ ఎంవోయూ సహాయకారిగా మారుతుంది. ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకోవడానికి, ముఖ్యంగా ఒక దేశం పాటిస్తున్న ఉత్తమ విధానాలను మరొక దేశం తెలుసుకోవడానికి అవకాశాలు కల్పిస్తుంది. అంతర్జాతీయ ఆవిష్కరణల్లో ప్రధాన భూమిక పోషించే దిశగా భారతదేశ ప్రయాణంలో ఇదొక కీలక అడుగుగా మారడంతోపాటు, జాతీయ ఐపీఆర్‌ విధానం-2016 లక్ష్యాలను పెంచుతుంది.

****


(Release ID: 1678039) Visitor Counter : 314