హోం మంత్రిత్వ శాఖ
డిజిపిలు/ ఐజిపిల వార్షిక సమావేశం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా
వర్చువల్ విధానంలో జరిగిన తొలి సమావేశం
గత సమావేశంలో తీసుకున్న కార్యాచరణ ప్రణాళికల అమలును సమీక్షించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
పౌరుల భద్రత, ఆత్మగౌరవానికి భరోసా ఇవ్వాలని సూచిస్తూ ఉగ్రవాదాన్ని ఏ రీతిలోనూ సహించరాదన్న కేంద్ర హోం మంత్రి
50 మందికి ఇండియన్ పోలీస్ మెడల్స్ బహూకరించిన కేంద్ర హోం మంత్రి
జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని భద్రతా సంస్థలన్నీ సమన్వయపూర్వకమైన వైఖరి అనుసరించాలని శ్రీ అమిత్ షా ఆదేశం
కోవిడ్-19 మహమ్మారి కాలంలో పోలీసుల పాత్ర, పోలీసులు అనుసరించిన భద్రతా చర్యలపై చర్చ
Posted On:
02 DEC 2020 10:49PM by PIB Hyderabad
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్/ ఇన్ స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ 55వ వార్షిక సమావేశం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. వివిధ కేంద్ర పారామిలిటరీ దళాల అధిపతులు, రాష్ర్టాల పోలీసు డైరెక్టర్ జనరల్స్, ఇన్ స్పెక్టర్ జనరల్స్ వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా రాష్ర్టాల నుంచి పాల్గొన్నారు. కేంద్ర గూఢచారి విభాగం ఇలాంటి సమావేశం వర్చువల్ విధానంలో నిర్వహించడం ఇదే ప్రథమం. 50 మంది పోలీసు అమరవీరులకు ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి నివాళి అర్పించి 50 మందికి ఇండియన్ పోలీస్ మెడల్స్ బహూకరించారు. వారు సాధించిన విజయాల పట్ల వారిని అభినందించారు.
జాతీయ భద్రత ప్రాధాన్యత గురించి శ్రీ అమిత్ షా ప్రముఖంగా ప్రస్తావిస్తూ విపత్తు, సంక్షోభ నిర్వహణలో ముందువరుసలో నిలిచి పని చేసిన పోలీసు అధికారుల పాత్రను శ్రీ అమిత్ షా కొనియాడారు. ఉగ్రవాదాన్ని ఏ రీతిలోనూ సహించరాదని ఆయన ఉద్బోధించారు. పౌరుల భద్రత, ఆత్మగౌరవాన్ని కాపాడవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా పోలీసు విభాగాల సామర్థ్యాలను పెంచాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా సంస్థలన్నీ సమన్వయపూర్వకంగా పని చేయాలని ఆదేశిస్తూ భారత్ ను అభివృద్ధి చెందిన, సురక్షితమైన దేశంగా చేయడానికి కృషి చేయాలని సూచించారు.
తదుపరి ఈ వర్చువల్ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొని గత సమావేశంలో తీసుకున్న కార్యాచరణ ప్రణాళికల అమలు తీరును సమీక్షించారు. అంతర్గత భద్రత స్థితిగతులపై అధికారులు ప్రధానమంత్రికి, కేంద్ర హోం మంత్రికి నివేదించారు. మరిన్ని ప్రజామిత్ర కార్యక్రమాల ద్వారా స్థూలంగా భద్రతా వాతావరణం మెరుగుపరిచే అంశంపై చర్చించారు.
వామపక్ష తీవ్రవాదం (ఎల్ డబ్ల్యుఇ) ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన వివిధ భద్రతా చర్యలతో పాటుగా ఆయా ప్రాంతాల్లో భద్రతను మెరుగుపరచడంపై విస్తృతంగా చర్చించారు. ఎల్ డబ్ల్యుఇని అదుపు చేసేందుకు సమన్వయపూర్వకమైన కార్యాచరణ చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో పోలీసుల పాత్ర, పోలీసులు అనుసపరించిన భద్రతా నిబంధనల గురించి చర్చించారు. వివిధ రకాల అత్యవసర పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు అమలుపరచాల్సిన ఎస్ఓపిలపై తదుపరి కార్యాచరణ గురించి చర్చించారు.
****
(Release ID: 1678001)
Visitor Counter : 242