రాష్ట్రప‌తి స‌చివాల‌యం

రాజ్యాంగ దినోత్సవం ప్రారంభోత్సవంతో రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం

Posted On: 26 NOV 2020 7:46PM by PIB Hyderabad

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మీ అందరితో మాట్లాడడం నాకు ఆనందంగా ఉంది. మీ అందరినీ వ్యక్తిగతంగా కలిసి మాట్లాడి ఉంటే మరింత ఆనందంగా ఉండేది కాని ప్రస్తుత మహమ్మారి కారణంగా మనపై పరిమితులు విధించారు. 

ఈ రోజు భారత రాజ్యాంగం ఆమోదించిన 71వ వార్షికోత్సవం. 1979 నుంచి మన న్యాయశాస్త్ర సోదర సోదరీమణులందరూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నవంబర్ 26ని న్యాయ దినోత్సవం లేదా “లా డే”గా నిర్వహించుకుంటున్నారు. 2015లో బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మన స్వాతంత్ర్యోద్యమాన్ని ముందుకు నడిపిన దూరదృష్టి గల నాయకులే మన రాజ్యాంగాన్ని రచించడం మన అదృష్టం. ప్రజల కోసం భారత జాతి సంఘటిత భవిష్యత్తుకు ఒక పత్రం రచిస్తున్నాం అనే వాస్తవం వారందరికీ తెలుసు.  ప్రజాస్వామ్యం మన రాజ్యాంగానికి గుండె వంటిదే కాదు, రాజ్యాంగ సభ కూడా ప్రజాస్వామికంగానే ఏర్పాటయింది. దేశంలోని అన్ని ప్రాంతాల వారికి అందులో ప్రాతినిథ్యం కల్పించారు. వారిలో కొందరు పురోగమనశీలురైన మహిళలు కూడా ఉన్నారు. రాజ్యాంగ సభ సమావేశాల సందర్భంగా జరిగిన చర్చల విషయంలో ప్రజలు కూడా ఎంతో ఆసక్తి కనబరిచారు. చర్చలు జరుగుతున్న మూడు సంవత్సరాలూ 53 వేల మంది వరకు పౌరులు విజిటర్స్ గ్యాలరీలో కూచుని ఆ కార్యక్రమాలను తిలకించినట్టు రికార్డులు తెలుపుతున్నాయి.

అందుకే మన ముందున్న ఈ పవిత్ర గ్రంథం ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజలే తయారుచేసుకున్న పత్రం అని నేను చెబుతున్నాను. అబ్రహాం లింకన్ మాటల్లోనే చెప్పవలసివస్తే ఎంతో మంది భారతీయ మేథావుల మేథస్సు, నైపుణ్యం రంగరించి రూపుదిద్దుకున్న ఈ గ్రంధం భూమిపై నుంచి ఎన్నటికీ అంతరించిపోదు, ప్రజలు ఎప్పుడూ దానిపై విశ్వాసం పునరుద్ధరిస్తూనే ఉంటారు.

సోదరసోదరీమణులారా,
మనది అత్యంత సుదీర్ఘమైన రాజ్యాంగంగా చెబుతూ ఉంటారు. ఈ రాజ్యాంగం ఎంత భారీగా ఉందనేది కాదు, అందులో ఉన్న అంశాలన్నీ ఎంతో ఆలోచించి పొందుపరిచినవి అని అప్పట్లో రాజ్యాంగ సభ అధ్యక్షుడు శ్రీ రాజెన్ బాబు అన్నారు. మన కాలం నాటి మహాకావ్యంగా చెప్పదగిన ఈ రాజ్యాంగ స్ఫూర్తి అంతా రాజ్యాంగ పీఠికలో పొందుపరిచారు. కేవలం 85 పదాలే అందులో ఉన్నప్పటికీ మన స్వాతంత్ర్య పోరాటం విలువలు, మన రాజ్యాంగ నిర్మాతల  దూరదృష్టి, ప్రతీ ఒక్క భారతీయుని ఆశలు అందులో ప్రతిబింబించాయి. పీఠికలో పొందుపరిచిన పదాలను కూడా 1949 అక్టోబర్ 17వ తేదీన ఎంతో లోతుగా చర్చించిన అనంతరం సిద్ధం చేశారు.

అత్యంత కీలకమైన విలువలన్నింటికీ స్థానం కల్పించినందు వల్ల ఈ పీఠిక రాజ్యాంగానికి గుండె వంటిదని చెప్పవచ్చు. ఆ విలువలే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. మనని ఉజ్వల భవిష్యత్తులోకి నడిపించే నైతిక దిక్సూచి ఇది. “సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏమిటి?  స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం జీవన సూత్రాలుగా గుర్తించిన జీవనశైలి. ఈ మూడింటిలోనూ  స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఏదీ ఒకదానితో ఒకటి వేరు చేయడానికి లేదు. వాటిని వేరు చేసినట్టయితే ప్రజాస్వామ్య అసలు ప్రయోజనమే నీరుగారిపోతుంది” అని రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ అంబేద్కర్ తన ముగింపు ప్రసంగంలో సవివరంగా చెప్పారు.

సోదరసోదరీమణులారా,
అత్యంత గౌరవనీయమైన ఈ పదాలనే మన జీవన మార్గంగా గుర్తించడం, వాటిని మన నిత్య జీవనంలో ప్రతీ పనిలోనూ ఒక భాగంగా చేసుకోవడమే మన ముందున్న సవాలు. న్యాయ వ్యవస్థకి అది ఏ విధంగా వర్తిస్తుంది?  పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించాలన్న సూత్రాన్ని పీఠికలో స్పష్టంగా పొందుపరిచారు. అందరికీ న్యాయం సమానంగా అందించాలన్నదే ఆ మాటల భావం అని నేను పునరుద్ఘాటిస్తున్నాను. న్యాయం ఎంతగా అందించగలిగితే అంతగా అది భద్రంగా ఉంటుంది.

అందరికీ న్యాయం అందించే ప్రక్రియ నిరంతరం సాగుతుంది. ఆ ప్రయత్నంలో దాని అసలు స్వభావానికి అది కట్టుబడాలి. ఆ మార్గంలో అవరోధాలున్నాయి. న్యాయం పొందడానికి అయ్యే వ్యయం అన్నింటి కన్నా ఎంతో పెద్దది. నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఎంతో ఆసక్తిగా ప్రో బోనో సర్వీస్ నిర్వహించే వాడిని. అవసరంలో ఉన్న వారికి ఉచిత న్యాయసలహాలందించడమే అందులో ప్రధానం. 

అలాగే భాష అనేది మరో అవరోధం. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని న్యాయ శాఖ మరిన్ని ప్రాంతీయ భాషల్లో తీర్పులు చెప్పడం ప్రారంభించారు. అధిక సంఖ్యలో ప్రజలను న్యాయం పట్ల ఆకర్షితులను చేయడానికి ఇది ఉత్తమ మార్గం. దీని వల్ల వ్యవస్థీకృత న్యాయం ఎక్కువ మందికి చేరువవుతుంది.

దీనికి పరిష్కారాలు కూడా ఎన్నో ఉన్నాయి. టెక్నాలజీ వాటిలో అన్నింటికన్నా ప్రధానమైనది. అందులోనూ మనందరం మహమ్మారి కోరల్లో చిక్కుకుని ఎన్నో ఆంక్షల నడుమ జీవితం గడుపుతున్న ఈ రోజుల్లో టెక్నాలజీ పాత్ర  అపారం. ఈ మహమ్మారి సమయంలో కూడా వీడియో కాన్ఫరెన్సింగ్, ఇ-ఫైలింగ్ వంటి సాంకేతిక సొల్యూషన్లు ఉపయోగించుకుని సుప్రీంకోర్టు నిరంతరాయంగా పని చేస్తూ న్యాయాన్ని అందించడం నాకు ఆనందంగా ఉంది. అందరికీ న్యాయం అందించే ప్రక్రియకు కరోనా వైరస్ అవరోధం కాకుండా చేసినందుకు బార్, బెంచి, న్యాయ శాఖ అధికారులను నేను ప్రశంసిస్తున్నాను. అలాగే కోవిడ్-19 కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో కూడా అందరికీ న్యాయం అందుబాటులో ఉంచే ప్రక్రియ కొనసాగించేందుకు మనం మరిన్ని సృజనాత్మక మార్గాలపై అన్వేషిస్తున్నాం.

సోదరసోదరీమణులారా,
ఈ ప్రత్యేక సమయంలో మనం మరిన్నిపవిత్ర ఆదర్శాలను జీవితంలో భాగం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఈ సందర్భంగా ప్రథమ రాష్ట్రపతి శ్రీ రాజెన్ బాబు మాటలు గుర్తు చేస్తున్నాను. 1950 జనవరి 24వ తేదీన రాజ్యాంగ సభ చివరిసారిగా సమావేశమయింది. ఆ సమావేశంలోనే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పేరును తొలి రాష్ట్రపతిగా ప్రకటించారు. తోటి సభ్యులందరూ హర్షధ్వానాలు చేస్తుండగా “ఒక మనిషి ఒక పదవికి నియమితుడైన సమయం శుభాకాంక్షలు చెప్పాల్సిన సమయం కాదని నేనెప్పుడూ భావిస్తూ ఉంటాను. ఆ వ్యక్తి పదవీ విరమణ చేసిన కాలమే అందుకు సరైనది. ఆ క్షణం వచ్చే వరకు నేను వేచి ఉండాలనుకుంటున్నాను. నేను పదవీ విరమణ చేసి అన్ని వర్గాల ప్రజలు, మిత్రులు చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నప్పుడే ఆ సుహృద్భావానికి  నేను అర్హుడినా, కాదా అని పరీక్షించుకోవాలనుకుంటున్నాను” అని ఆయన అన్నారు.

సంత్ కబీర్ మాటలను దృష్టిలో ఉంచుకునే రాజెన్ బాబు ఈ మాటలు అని ఉంటారని నేను భావిస్తున్నాను. మనం ప్రజాజీవనంలో  దాన్ని మార్గదర్శిగా చేసుకోవాలని నేను విశ్వసిస్తున్నాను. అత్యున్నతమైన రాజ్యాంగ పదవి చేపట్టిన వారి ఆశయం ఇదే కావాలి కదా?  పక్షపాతం, దురభిమానానికి అతీతంగా వ్యవహరించి ఒక ఉదాహరణగా మారేందుకు శ్రమించాలి.  రాజెన్ బాబు ప్రస్తావించిన మాటలు మనందరికీ వర్తిస్తాయి. నేను బాధ్యతలు నిర్వర్తించే సమయంలో ఆయన మాటలే మార్గదర్శక సూత్రంగా అనుసరించేందుకు ఎప్పుడూ కృషి చేశాను. రాజ్యాంగంలోనూ, రాజ్యాంగ పీఠికలోనూ మన రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన ఆదర్శాలకు మనం కట్టుబడ్డామా లేదా అనే అంశాన్ని మనం ఎప్పుడూ ఆత్మావలోకనం చేసుకోవాలి.

సోదరసోదరీమణులారా,
అత్యున్నత ప్రమాణాలు, విస్తారమైన ఆదర్శాలను పాటించే వ్యవస్థగా సుప్రీంకోర్టు ఎంతో ప్రతిష్ఠ సాధించింది. సుప్రీంకోర్టు ప్రకటించిన ఎన్నో విశిష్టమైన తీర్పులు మన న్యాయ వ్యవస్థను, రాజ్యాంగాన్నిశక్తివంతం చేశాయి. సుప్రీంకోర్టు బెంచి, బార్ రెండో లోతైన మేథస్సుకు, న్యాయపాండిత్యానికి ప్రతీకలుగా గుర్తింపు పొందాయి. ఈ కోర్టు ఎప్పుడూ న్యాయాన్ని కాపాడే అత్యున్నత శక్తిగా నిలుస్తుందన్న విశ్వాసం నాకుంది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అభినందనలు తెలియచేస్తున్నాను. అలాగే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులకు కూడా శుభాభినందనలు తెలియచేస్తున్నాను. 

నా అభిప్రాయాలు పంచుకునే ఈ అవకాశం  కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు.
జైహింద్!

***



(Release ID: 1676406) Visitor Counter : 1465