యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఫిట్ ఇండియా స్కూల్ వీక్ ఆవిష్కరించిన క్రీడామంత్రి కిరణ్ రిజిజు

ఫిట్ ఇండియా ను నడిపించే చోదకశక్తి విద్యార్థులే: కిరణ్ రిజిజు

Posted On: 25 NOV 2020 6:43PM by PIB Hyderabad

ఫిట్ ఇండియా స్కూల్ వీక్ రెండో ఎడిషన్ ను కేంద్ర క్రీడాశాఖామంత్రి  శ్రీ కిరణ్ రిజిజు  ఈ రోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో బాటు ఫిట్ ఇండియా మిషన్ డైరెక్టర్ ఏక్తా విష్ణోయ్, సిబిఎస్ఇ చైర్మన్ మనోజ్ అహుజా, సిఐఎస్ సిఇ చైర్మన్ డాక్టర్ జి. ఇమ్మాన్యుయేల్, కాసర్ గడ్ కు చెందిన ఎంపి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ అబ్దుల్ జలీల్ మార్థ్య, గ్రేటర్ నోయిడా జేపీ పబ్లిక్ స్కూల్ క్రీడాశాఖాధిపతి కుమారి నీరజ్ సింగ్, జేపీ స్కూల్ విద్యార్థి ప్రకృతి ఆదర్శ్, ఎంపి ఇంటర్నేషనల్ విద్యార్థి యాసిర్ అమీన్ అలి పాల్గొనగా స్పోర్ట్స్ యాంకర్ మనీష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమం ప్రధానంగా పిల్లల్లో శారీరక వ్యాయామం పట్ల, క్రీడల పట్ల ఆసక్తి పెంచి, ప్రోత్సహించటం, అలవాటు చేయటం కోసం ఉద్దేశించినది. అలవాట్లు మొదలయ్యే బాల్య దశలోనే పిల్లలను ఈ దిశలో ప్రోత్సహించటం మంచిదనే ఉద్దేశంతో ఫిట్ ఇండియా ను పాఠశాలలకు పరిచయం చేస్తున్నారు.

 

ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ రిజిజు మాట్లాడుతూ, పాఠశాల స్థాయిలోనే ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇవ్వాలసిన అవసరాన్ని చెప్పారు, దేశం ఫిట్ గా ఉండాలంటే విద్యార్థులే దానికి చోదక శక్తి అన్నారు. పెద్ద సంఖ్యలో పాఠశాలలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటానికి ఆసక్తి చూపటం, వారం వారం ఈ సంఖ్య పెరగటం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.  ప్రతి భారతీయుడు ఫిట్ గా ఉండాలన్న లక్ష్య సాధనకు కావాల్సిన శక్తి పాఠశాలల్లోనే తయారవుతోందన్నారు.

నిరుడు నవంబర్ లో మొదలైన ఫిట్ ఇండియా స్కూల్ వీక్  ప్రచారోద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా 15,000 పాఠశాలలు పాల్గొన్నాయి.  లైవ్ సెషన్ లో భాగంగా క్రీడా మంత్రిని ఒక ప్రశ్న అడిగే అవకాశం జేపీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని ప్రకృతి ఆదర్శ్ కు రాగా మంత్రి తన వయసు కంటే తక్కువగా కనబడటానికి ఆయన అనుసరిస్తున్న ఫిట్ నెస్ మంత్ర ఏమితో చెప్పాలని కోరింది.  మంత్రి శ్రీ రిజిజు నవ్వుతూ సమాధానమిచ్చారు. “ నేను 25-30 ఏళ్ళ కుర్రాడినే అనుకుంటూ అందుకు తగినట్టే ఫిట్ గా ఉండటానికి చేయాల్సిందంతా చేస్తా. అలాంటి పట్టుదల, ప్రేమ ఉండాలి” అన్నారు.

ప్రస్తుత కరోనా సంక్షోభ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని  ఈ సారి ఈ కార్యక్రమాన్ని ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. ప్రతిపాదించిన కార్యక్రమాలను ఆయా పాఠశాలలు వర్చువల్ పద్ధతిలోనే నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి పాఠశాలలు తమంతట తాముగా  https://fitindia.gov.in/fit-india-school-week/ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఫిట్ ఇండియా స్కూల్ వీక్ జరుపుకోవటానికి 2020 డిసెంబర్ లో ఏదైనా ఒక వారాన్ని కూడా వారే ఎంచుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో వారికిచ్చే జాబితా నుంచి ఏదైనా అంశాన్నిఎంచుకోవచ్చు. ఈ ఏడాది తలపెట్టిన కొన్ని అంశాల్లో ఏరోబిక్స్, పెయింటింగ్, క్విజ్/డిబేట్, డాన్స్, స్టెప్ అప్ చాలెంజ్ లాంటివి ఉన్నాయి.

***



(Release ID: 1676002) Visitor Counter : 106