హోం మంత్రిత్వ శాఖ
“నివార్” తుఫాను పై నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన - కేబినెట్ కార్యదర్శి
ప్రాణ నష్టం లేకుండా, నష్టం అతి తక్కువగా ఉండేలా చూడడమే మన లక్ష్యమని పేర్కొన్న - శ్రీ రాజీవ్ గౌబా
రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి సహాయం అందించడానికి - కేంద్రప్రభుత్వం భరోసా
Posted On:
24 NOV 2020 9:24PM by PIB Hyderabad
తీవ్రమైన తుఫాను “నివార్” నేపథ్యంలో, జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్.సి.ఎం.సి), ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్వహించిన సమావేశానికి, కేబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో పాటు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్రాణ నష్టం లేకుండా చూసుకోవడం, ఆస్తి నష్టం అతి తక్కువగా ఉండేలా చూడడంతో పాటు, విద్యుత్తు, టెలికాం మరియు ఇతర ముఖ్యమైన రంగాలలో సేవలను సాధ్యమైనంత తక్కువ సమయంలో పునరుద్ధరించడం మన లక్ష్యమని, శ్రీ గౌబా ఈసందర్భంగా పేర్కొన్నారు.
ప్రధాన కార్యదర్శులు తమ సంసిద్ధత గురించి ఎన్.సి.ఎం.సి. కి తెలియజేశారు. ఐ.ఎం.డి. డైరెక్టర్ జనరల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “నివాార్” తుఫాను తాజా పరిస్థితి గురించి, కమిటీ కి వివరించారు. వచ్చే మూడు రోజుల్లో పరిస్థితిని ఎదుర్కోడానికి అవసరమైన సంసిద్ధత గురించి ఎన్.డి.ఆర్.ఎఫ్. డైరెక్టర్ జనరల్ తెలియజేశారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇప్పటివరకు ఎన్.డి.ఆర్.ఎఫ్. కు చెందిన 30 దళాలను మోహరించామనీ, మరో 20 దళాలను అందుబాటులో ఉంచామనీ ఆయన చెప్పారు.
మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దనీ, తీరప్రాంతాల్లోని ప్రజలను కూడా సహాయ శిబిరాలకు తరలించాలని సూచించారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన పూర్తి సహాయాన్ని కేంద్రప్రభుత్వం అందజేస్తుందని కేబినెట్ కార్యదర్శి హామీ ఇచ్చారు.
*****
(Release ID: 1675512)