పర్యటక మంత్రిత్వ శాఖ
“భారతదేశపు అజ్ఞాత రత్నాల”పై టూరిజం వెబినార్
నిగూఢమైన అపురూప పర్యాటక స్థలాలపై
దేఖో అప్నాదేశ్ వెబ్.నార్ సిరీస్ పేరిట నిర్వహణ
ఏక్ భారత్ శ్రేష్ట భారత్ నినాదమే స్ఫూర్తి
Posted On:
21 NOV 2020 7:16PM by PIB Hyderabad
దేఖో అప్నాదేశ్ పేరిట రూపొందించిన వెబినార్ల సిరీస్.లో భాగంగా భారత పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2020 నవంబరు 21న ఒక వెబినార్ సదస్సు జరిగింది. “భారతదేశపు అజ్ఞాత రత్నాలు” అనే పేరుతో వెబినార్ జరిగింది. దేశంలో అజ్ఞాతంగా దాగిన రత్నాలుగా చెప్పదగిన అపురూప పర్యాటక స్థలాల విశిష్టతపై ఈ వెబినార్ సదస్సులో దృష్టిని కేంద్రీకరించారు. నిజానికి బహురూపాలను అందించే చిత్రదర్శిని (కెలీడో స్కోపు) లాంటిది భారతదేశం. కెలీడో స్కోపును గుండ్రంగా కదిపిన ప్రతిసారీ అందులో చిత్రాతిచిత్రమైన పలు రూపాలు కనిపించినట్టుగానే, దేశంలో కూడా ఎన్నో విభిన్నమైన మనోహర ప్రకృతి దృశ్యాలు, వర్ణాలు, పాకశాస్త్ర నైపుణ్యాలు, సాంస్కృతిక విశేషాలు గోచరిస్తాయి. దేశానికి ఉన్న విభిన్నమైన ఈ స్వభావం,..ఏక్ భారత్ శ్రేష్ట భారత్ అనే స్ఫూర్తిని కూడా కలిగిస్తుంది. ఇంటర్నెట్.లో ప్రజాదరణ పొందని, ఈ పర్యాటక స్థలాలను చూసి ఆనందించాలంటే ఆయా ప్రదేశాలకు వెళ్లడం మాత్రమే ఏకైక ఉత్తమ మార్గం. రోడ్డు ప్రయాణంతో ఎన్ని చూడగలిగితే అన్ని ప్రాంతాలు చూడటమే మీకు మిగిలిన ప్రత్యామ్నాయం.
ప్రముఖ పర్యాటక నిర్వాహకురాలు, విభిన్న సంస్కృతులపై శిక్షకురాలు, కమ్యూనికేషన్ వ్యవహారాల వృత్తి నిపుణురాలు అయిన బిందు మీనన్ ఈ వెబినార్ ను సమర్పించారు. స్వతహాగా భాషా ప్రేమికురాలు, ఔత్సాహిక పర్యాటకురాలు, రచయిత్రి అయిన బిందు మీనన్ తనకు అవకాశం దొరికినపుడల్లా భారతదేశం ప్రత్యేకతను గురించి ప్రపంచానికి చాటి చెబుతూ వస్తున్నారు. “కొత్త దిక్కుల అన్వేషణ కోసం మామూలుగా దారులను వదలి నడక నూతన మార్గాల్లో సాగినపుడు మన జీవితం ఎంతో ఉత్తేజకరంగా, ఉత్సాహభరితంగా ఉంటుంది” అన్న సూక్తిని ఉటంకిస్తూ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఆమె ఈ వెబినార్ ను సమర్పించారు.
కేరళ ఉత్తర ప్రాంతంలోని అమరాంబళం, నీలబూర్ ప్రాంతాలనుంచి ఈ వెబినార్ పయనం మొదలైంది. కేరళ రాష్ట్రం, మల్లప్పురం జిల్లాలో చలియార్ నదీ తీరంలో నీలంబూర్ అనే చిన్న గ్రామం ఉంది. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన ‘కోనలీ ప్లాట్’ అనే విశిష్టమైన టేకు తోటకు నీలంబూర్ పేరు పొందింది. టేకు కలప రవాణాకోసం కేరళలో తొలి రైలు మార్గాన్ని కూడా ఇక్కడే ప్రవేశపెట్టారు. పర్యాటకులు ఈ మార్గం వెంబడి షోర్నూర్ నుంచి నీలంబూర్ వరకూ రైలులో ప్రయాణిస్తూ ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు. చలియార్ నదిపై వేలాడే వంతెన కూడా ఇక్కడ మరో ఆకకర్షణ. అమరాంబళం కొత్త అటవీ ప్రాంతాన్ని పడమటి కనుమల్లోనే రిజర్వ్ ఫారెస్టుగా ప్రకటించారు. చలోనాయికన్ గిరిజన తెగలకు ఇది నిలయం. ఇక్కడున్న అమరాంబళం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పర్యావరణ ప్రేమికులకు బాగా అలరిస్తుంది. దేశంలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో ఇది 18వది అవుతుంది.
గ్రేట్ హార్న్ బిల్ రిజార్ట్స్- ఒక బ్యాంకర్ యాజమాన్యంలో ఉండే ఈ ప్రాంతం కేరళలోని అమరాంబళం, నీలంబూర్ లో ఉంది. గ్రేట్ హార్న్.బిల్ పక్షులకు ఇది నిలయం గ్రేట్ హార్న్.బిల్ (వేళంబాల్) అనే ఈ పక్షిని కేరళ రాష్ట్ర అధికార పక్షిగా ఎంపికైంది. మూడు చెరగులా రెండేసి పర్వతాలు ఆవరించిన ఏడెకరాల ఈ రిసార్ట్స్ జీవవైవిధ్యానికి చక్కని కేంద్రం. పెద్దపెద్ద కొండల మధ్య ఎంతో సుందరంగా కనిపించే అమరాంబళం అడవి చోళనాయకర్ గిరిజన తెగలకు ఆవాసం. సంవత్సర కాలమంతా ఎన్నో సహజ ఔషధ లక్షణాలతో కూడిన నీటి పాయలు మనోహరంగా సాగుతూ దర్శనమిస్తాయి. కొన్ని వందల రకాల సీతాకోక చిలుకలు, లక్షలాది మిణుగురు పురుగులు, అద్భుతమైన, అరుదైన మొక్కలు, సంపూర్ణమైన కూరగాయల తోట..ఇలాంటి ఆహ్లాదకరమైన దృశ్యాలెన్నో కనువిందు చేస్తాయి. ఈ ప్రాంతాన్ని ఓ రహస్య స్వర్గంగా చెప్పవచ్చు. ప్రకృతి మనోరహమైన ఈ దృశ్యాలు చూడటం మనకు ఓ గొప్ప అనుభూతిని మిగిలిస్తాయి. మానసిక శాంతికి దోహదపడతాయి.
అమరాంబళం తర్వాత దూద్ సాగర్ వనం గురించి బిందు మీనన్ వివరించారు. ఇక్కడ మాండవీ నది నీరు నాలుగంచెల జలపాతంలా కనిపిస్తుంది. నదీ జలాలు పాలధారల్లాగా దిగువకు దూకుతూ కనిపిస్థాయి. అమరావతి ఎక్స్ ప్రెస్ నుంచి ఈ దృశ్యాన్ని కన్నుల పండువగా తిలకించవచ్చు. ఈ స్థలం పూర్తిగా మాల్కర్నేకర్ వంశీకులు యాజమాన్యంలో ఉంది. గోవా తూర్పు ప్రాంతంలో పశ్చిమ కనుమల దిశగా ఉన్న బంజరు భూమిని వారు గతంలో కొనుగోలు చేసి ఇలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. గోవాలో ఇసుక నేల మధ్య హరిత ఒయాసిస్ వలే ఇది కనిపిస్తుంది. దూద్ సాగర్ వనం 50ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. జీడిమామిడి వనం, సుగంధ మొక్కల తోట, తాళవృక్షాల క్షేత్రం, సహజంగా ఏర్పడిన నీటి మడుగు వంటివి ఇక్కడి ప్రత్యేకతలు. ప్రకృతి సౌందర్య దృశ్యాల మధ్యలో ఇక్కడ బసచేసే అతిథులకు గొప్ప అనుభవం అందించి, ఆనందం కలిగించేందుకు మాల్కర్నేకర్లు అనేక ఏర్పాట్లు చేశారు. భగవాన్ మహావీర్ వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం, వారసత్వ కట్టడం బ్రగాంజా హౌస్, 12వ శతాబ్దానికి చెందిన తాంబ్దీ సుర్లా శివాలయం వంటివి ఇక్కడ ప్రధాన పర్యాటక ఆకర్షణలు.
దేశంలోని అజ్ఞాత రత్నంవంటి మరో దర్శనీయ స్థలం,.. సావే వ్యవసాయ క్షేత్రం. మహారాష్ట్రలోని దహానూ ప్రాంతంలో ఇది ఉంది. ప్రభాకర్ సావే అనే వ్యక్తి తన జీవితాన్ని పర్యావరణం కోసమే అంకితం చేశారు. సావే క్షేత్రంలో తార్పా ఆగ్రో ఎకో టూరిజం వినూత్నమైన పర్యాటక సదుపాయం. వర్లీ తెగవారి సంగీత వాయుద్య పరికరం తార్పా పేరిట దీన్ని ఏర్పాటు చేశారు. ముంబై నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉత్తర కొంకణ్ తీరంలో సావే క్షేత్రం ఉంది. బంజరు భూమిగా ఉన్న స్థలంలో 1970లో దీన్ని ఏర్పాటు చేశారు. భూసారం కోల్పోయి, బీడువారిపోయిన స్థలాన్ని ఒక సవాలుగా తీసుకుని సుందరమైన హరిత క్షేత్రంగా, చక్కని ఉద్యానవంగా తీర్చిదిద్దారు. ఇపుడు అక్కడ అక్కడ కొబ్బరి, అవకాడో, సుంధ మొక్కలు, వృక్షాలు, 400 రకాల మెక్కల సమూహం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో అలరిస్తున్నాయి. ప్రకృతి సౌందర్యం నేపథ్యంలో సాహస కృత్యాలను కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని సందర్శనతో గ్రామీణ జీవనాన్ని గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడి మినీ మ్యూజియంను సందర్శించి, జామ్, ఊరగాయలు వంటి ఉత్పత్తులను ఇంటికి తీసుకెళ్లవచ్చు.
తాజాగా జరిగిన వెబినార్.లో వివరించిన మూడు అజ్ఞాత పర్యాటక స్థలాలకూ ఉమ్మడిగా ఒకే స్వభావం ఉంది. తండ్రీ కొడుకుల ద్వయం కలసి కట్టుగా నిర్వహిస్తూ ఉండటం ఈ మూడు ప్రాంతాల ప్రత్యేకత. మనకు ఎంతో ప్రేమతో ఎన్నో అందించిన ప్రకృతికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలన్న తపన వారిలో సమాన స్థాయిలో ఉండటం విశేషం.
కేంద్ర పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రూపీందర్ బ్రార్, ఈ వెబినార్.లో ముగింపు ప్రసంగం చేశారు. విభీన్నమైన సంస్కృతీ సంప్రదాయాలు, వివిధ మాండలికాలు, పాకశాస్త్ర నైపుణ్యాల గురించి ఆయన ప్రస్తావించారు. ఆయా దర్శనీయ స్థలాల్లో పర్యాటకులెవరికైనా అద్భుతమైన అనుభూతి సొంతమవుతుందన్నారు.
కేంద్ర ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇ గవర్నెన్స్ శాఖ అందించే సాంకేతిక భాగస్వామ్యంతో దేఖో అప్నా దేశ్ పేరిట ఈ వెబినార్ సదస్సులను, నిర్వహిస్తూ వస్తున్నారు. వివిధ వెబినార్ లపై వివరాల కోసం.. https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured
అనే యూ ట్యూబ్ వెబ్ లింకును సంప్రదించవచ్చు. అలాగే.., కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు సంబంధించిన అన్ని సామాజిక మీడియా హ్యాండిల్స్.పై కూడా వెబినార్ల వివరాలు అందుబాటులో ఉంటాయి. టూరిజంపై తదుపరి వెబినార్,.. 2020 నవంబరు 28వ తేదీన జరుగుతుంది.
**************
(Release ID: 1674885)
Visitor Counter : 210