ప్రధాన మంత్రి కార్యాలయం

లక్సెంబర్గ్ ప్రధాన మంత్రి గౌరవనీయులు జేవియర్ బెట్టెల్ తో భారత-లక్సెంబర్గ్ వర్చువల్ సదస్సులో పాల్గొన్న - ప్రధానమంత్రి

Posted On: 19 NOV 2020 6:55PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వర్చువల్ మాధ్యమంలో లక్సెంబర్గ్ ప్రధాన మంత్రి గౌరవనీయులు జేవియర్ బెట్టెల్ తో ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నారు.   

కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి కారణంగా లక్సెంబర్గ్ ‌లో పౌరులు ప్రాణాలు కోల్పోయినందుకు ప్రధానమంత్రి సంతాపం వ్యక్తం చేశారు.  ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో గౌరవనీయులు జేవియర్ బెట్టెల్ నిర్వహించిన నాయకత్వ పాత్రను ప్రధానమంత్రి అభినందించారు.

కోవిడ్ అనంతర ప్రపంచంలో, ముఖ్యంగా ఆర్ధిక సాంకేతికత, హరిత ఆర్ధిక వ్యవస్థ, అంతరిక్ష అప్లికేషన్లు, డిజిటల్ ఆవిష్కరణలు, అంకుర సంస్థల రంగాలలో భారత-లక్సెంబర్గ్ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇద్దరు ప్రధానమంత్రులు, తమ అభిప్రాయాలను పంచుకున్నారు.  రెండు దేశాలకు చెందిన ఫైనాన్షియల్ మార్కెట్ రెగ్యులేటర్లు, స్టాక్ ఎక్స్ఛేంజీలు మరియు ఇన్నోవేషన్ ఏజెన్సీల మధ్య కుదిరిన వివిధ ఒప్పందాలను వారు స్వాగతించారు.

సమర్థవంతమైన బహుపాక్షికతను గ్రహించడంతో పాటు, కోవిడ్-19 మహమ్మారి, ఉగ్రవాదం, వాతావరణ మార్పు వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోడానికి, ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు.  అంతర్జాతీయ సౌర కూటమి (ఐ.ఎస్.ఏ) లో చేరాలని లక్సెంబర్గ్ చేసిన ప్రకటనను ప్రధానమంత్రి స్వాగతించారు.  విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సి.డి.ఆర్.ఐ) లో చేరమని ఆయన ఆహ్వానించారు.  

కోవిడ్-19 పరిస్థితి మెరుగుపడిన అనంతరం, భారతదేశంలో లక్సెంబర్గ్ రాజు, అలాగే ప్రధాన మంత్రి బెట్టెల్ కు స్వాగతం పలకాలని ఎదురుచూస్తున్నట్లు ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.  ప్రధానమంత్రి బెట్టెల్ కూడా, తమ సౌలభ్యం మేరకు లక్సెంబర్గ్ సందర్శించాలని ప్రధానమంత్రి మోదీ ని ఆహ్వానించారు.

 

*****


(Release ID: 1674220) Visitor Counter : 212