పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

మిషన్ పూర్వోదయ తూర్పు భారతదేశాన్ని స్వావలంబన వైపు నడిపిస్తుందని, అలాగే ఆత్మనిర్భర్ భారత్ తయారీకి దోహదపడుతుందని మర్చంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏజీఎంలో శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు

Posted On: 19 NOV 2020 1:54PM by PIB Hyderabad

కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మరియు ఉక్కుశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు మాట్లాడుతూ.. భారతదేశాన్ని పాసివ్‌మార్కెట్‌ నుండి ప్రపంచస్థాయి క్రీయాశీల ఉత్పాదక కేంద్రంగా తయారు చేసేందుకు ‘ఆత్మనిర్భర్ భారత్’ దోహదపడుతుందని చెప్పారు. ఈ రోజు మర్చంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క 119 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ఆయన.. ఆత్మనిర్భర్ అంటే బలమైన ఉత్పాదక రంగం, స్వావలంబన మరియు సమగ్ర ఆర్థిక వ్యవస్థతో కూడిన  భారతదేశమని అన్నారు. స్వావలంబన సాధించిన భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తుందని వెల్లడించారు. భారతదేశ స్వావలంబన  స్వయం కేంద్రీకృత వ్యవస్థను సమర్థించదని..భారతదేశం యొక్క స్వావలంబన ప్రపంచం యొక్క ఆనందం, సహకారం మరియు శాంతి గురించి ఆలోచన చేస్తుందని మంత్రి చెప్పారు.

తూర్పు భారతదేశం స్వావలంబన సాధించకుండా భారతదేశం ఆత్మనిర్భర్ కాలేదని మంత్రి అన్నారు. భారతదేశ జాతీయ వృద్ధికి పూర్వోదయ తూర్పు భారత్ ప్రాంతాల అభివృద్ధి,సహకారం ముఖ్యమన్నారు. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ తూర్పు భారతదేశం యొక్క అభివృద్ధి అవసరాన్ని గుర్తించారని..జాతీయ అభివృద్ధిలో ఇంతవరకూ ఉపయోగించుకోని ఈ ప్రాంత సామర్ధ్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారని అన్నారు. మిషన్ పూర్వోదయ యొక్క సారాంశం ఇదేనన్నారు. మిషన్ పూర్వోదయలో పెట్రోలియం మరియు ఉక్కు రంగం రెండూ ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంది ”అని ఆయన అన్నారు.


శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ.."మిషన్ పూర్వోదయ ఆధ్వర్యంలో తూర్పు భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ హబ్‌ను నిర్మిస్తున్నాం, ఇది ఉక్కు రంగంలో పోటీతత్వాన్ని పెంచుతుంది. తద్వారా ఉద్యోగ కల్పనతో ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుంది.స్టీల్ క్లస్టర్లు విస్తరించిన ప్రాంతం అంతటా ఉపాధి అవకాశాలను అందిస్తాయి. ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాల కల్పనతో పాటు తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాల అభివృద్ధికి, వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తాయి. ఇది ఇతర ఉత్పాదక పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేస్తుంది. అలాగే నగరాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, శిక్షణా కేంద్రాలు మొదలైన రూపాల్లో  సామాజిక మౌలిక సదుపాయాల వృద్ధికి ఉపయోగపడుతుందని" చెప్పారు.

ప్రభుత్వ సహకారంతో ఇంద్రధనుష్ నార్త్ ఈస్టర్న్ గ్యాస్ గ్రిడ్ ప్రాజెక్టుల కింద  భారత గ్యాస్ గ్రిడ్‌ను దేశంలోని తూర్పు మరియు ఈశాన్య భాగాలలో కొత్త మార్కెట్లకు విస్తరిస్తున్నట్లు శ్రీ ప్రధాన్ తెలిపారు. ప్రధాన మంత్రి ఉర్జా గంగా (పిఎంయుజి) ప్రాజెక్టు తూర్పు రాష్ట్రాల్లోని లక్షలాది గృహాలకు  పైపుల ద్వారా వంట గ్యాస్‌ను అందించాలని నిర్దేశించినట్టు తెలిపారు.


కోవిడ్-19 కారణంగా తలెత్తిన సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు డిమాండ్‌ను దారుణంగా దెబ్బతీసిందని సరఫరా వ్యవస్థలకు నష్టం కలగించిందని ఇది ప్రతిచోటా అర్ధిక తిరోగమనానికి దారితీసిందని మంత్రి చెప్పారు. కొవిడ్ మహమ్మారి సాధారణ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నప్పటికీ.. వివిధ రంగాలు, ప్రాంతాలు, విభాగాల్లో పెరుగుదల సూచనలు దేశీయ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాయని వివరించారు. లాక్డౌన్ పరిమితుల సడలింపుతో దేశవ్యాప్తంగా ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని ఆ క్రమంలో భారతదేశం తిరిగి అభివృద్ధి దిశగా ప్రయాణిస్తోందని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ మరియు ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన సమాజంలోని అన్ని వర్గాలకు ఉపశమనం కలిగించాయని, కోవిడ్ -19 మహమ్మారి సమయంలో అన్ని రంగాలకు అవసరమైన సహకారాన్ని అందించాయని శ్రీ ప్రధాన్ అన్నారు. ఇవి భారతదేశం తిరిగి పుంజుకోవడానికి అలాగే భారతీయ వృద్ధి కథకు తరువాతి అధ్యాయాన్ని రాయడాన్ని ప్రారంభించాయని అన్నారు.


భారతదేశం యొక్క స్థిరమైన ప్రజాస్వామ్యం మరియు బలమైన రాజకీయ నాయకత్వం మరియు  అతిపెద్ద దేశీయ మార్కెట్ అలాగే యువ జనాభా దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యానికి సహాయపడే ముఖ్య కారకాలుగా ఉన్నాయని శ్రీ ప్రధాన్ అన్నారు.

చమురు మరియు గ్యాస్ రంగం గురించి మాట్లాడుతూ శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ వేగంగా మారుతున్న ఇంధనరంగాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నామని చెప్పారు. "గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి డైనమిక్ మరియు దూరదృష్టి నాయకత్వంలో.. బలమైన ఆర్థిక వృద్ధికి శక్తినిచ్చే సురక్షితమైన, సరసమైన మరియు స్థిరమైన ఇంధన వ్యవస్థ కోసం భారత ప్రభుత్వం విప్లవాత్మకమైన సంస్కరణలను ప్రారంభించింది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఇంధన వినియోగం కలిగిన దేశం. భారతదేశ ఇంధన భవిష్యత్తు కోసం ప్రధాని స్పష్టమైన మార్గదర్శకాన్ని ఆవిష్కరించారు. ఇది ప్రధానంగా ఐదు కీలక ఆంశాలపై దృష్టి పెడుతుంది. అవి అందరికీ అందుబాటులో ఇంధనం, నిరుపేదలకు సైతం ఇంధన లభ్యత, ఇంధన వినియోగంలో సామర్ధ్యం, వాతావరణ మార్పులను ఎదుర్కొనే స్థిరత్వం, ప్రపంచ దేశాల్లో అనిశ్చితి నెలకున్న సందర్భాల్లో ఇంధన భద్రత మొదలైనవి. ఈ నెల ప్రారంభంలో సెరావీక్ ఆధ్వర్యంలో జరిగిన నాల్గవ ఇండియా ఎనర్జీ ఫోరంలో ప్రధాని చేసిన ప్రసంగం గురించి మంత్రి ప్రస్తావించారు. అందులో భారతదేశం యొక్క ఇంధన వ్యూహంలోని ఏడు ముఖ్యమైన ఆంశాలను మరియు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ప్రధాన వినియోగదారుగా భారతదేశం ఎదగడంపై ఆయన ఉద్ఘాటించారు. ఈ ఏడు ముఖ్య ఆంశాలు గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్ళే ప్రయత్నాలను వేగవంతం చేయడం, తక్కువ స్థాయిలో శిలాజ ఇంధనాల  ఉపయోగం, దేశీయ ఇంధనాలపై ఎక్కువ ఆధారపడటం, 2030 నాటికి 450 గిగావాట్ల (జిడబ్ల్యు) పునరుత్పాదక శక్తి లక్ష్యాన్ని సాధించడం, విద్యుత్ సహకారాన్ని పెంచడం,  అన్ని వ్యవస్థలలో హైడ్రోజన్ మరియు డిజిటల్ ఆవిష్కరణ వంటివి ప్రోత్సహించడం మొదలైనవి.


భారతదేశంలో మహిళల సాధికారతతో పాటు సామాజిక ఆర్థిక మార్పులకు ఉజ్జ్వల యోజన దారితీసిందని, దేశంలో ఎల్‌పిజి కనెక్షన్ల సంఖ్యను రెట్టింపు చేసిందని శ్రీ ప్రధాన్ అన్నారు. ఎల్‌పిజి కవరేజ్ 55 శాతం నుంచి 98 శాతానికి పెరిగిందని చెప్పారు. ఎస్‌ఎటిఎటి(సస్టైనబుల్ అల్టర్‌నేటివ్ టువర్డ్స్ అఫర్డబుల్ ట్రాన్స్‌పోర్టేషన్‌) అందరికీ అందుబాటులో ప్రత్యామ్నాయ రవాణా అందుబాటులోకి తెచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకుందని తద్వారా వాహనరంగ వినియోగదారులతో పాటు రైతులు, వ్యవస్థాపకులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. మున్సిపాలిటీల్లో ఘన వ్యర్ధాల కాల్చివేయడం వంటి చర్యలతో కర్బన్ ఉద్గారాల వెలువడుతున్నాయని దాంతో పట్టణాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరుగుతోందని అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మంత్రి అన్నారు. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి మరియు వ్యవస్థాపకత పెంచేందుకు ప్రధాన మంత్రి చేస్తున్న కృషికి కూడా సిబిజి వాడకం సహాయపడుతుందని అన్నారు. వ్యవసాయ రంగంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా తూర్పు భారతదేశానికి అపారమైన అభివృద్ధి అవకాశాలున్నాయన్నారు. గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ సాకారం దిశగా చమురు మరియు గ్యాస్ మౌలిక సదుపాయాల కల్పనలో 100 బిలియన్ డాలర్ల భారీ వ్యయాన్ని ప్రభుత్వం పెడుతోందని ఆయన అన్నారు. పైప్‌లైన్‌లు, ఎల్‌ఎన్‌జి టెర్మినల్స్, సిజిడి నెట్‌వర్క్‌లతో పాటు గ్యాస్ మౌలిక సదుపాయాలను భారత్ అభివృద్ధి చేస్తోందని.. సిటీ గ్యాస్ ప్రాజెక్టుల పరిధి 400 కి పైగా జిల్లాలకు విస్తరించబడుతోందని, దేశ జనాభాలో 70% మందికి అది ఉపయోగపడుతుందని చెప్పారు.


ఉక్కు పరిశ్రమపై, శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ.. ఇది దేశానికి వెన్నెముకగా పనిచేస్తుందని, మనదేశంలో ఆధునిక ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో  స్టీల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు ప్రపంచ స్థాయిలో భారతీయ ఉక్కు రంగం  ప్రధాన భూమిక పోషించింది. ప్రపంచంలో భారతదేశం రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు అయినప్పటికీ...దేశంలో వార్షిక తలసరి ఉక్కు వినియోగం 74.1 కిలోలు మాత్రమే. అంటే ప్రపంచ సగటు (224.5 కిలోలు)లో మూడింట ఒక వంతు మాత్రమే.  తద్వారా దేశంలో ఉక్కు వినియోగాన్ని పెంపొందించుకోవడానికి అలాగే ఎక్కువ ఉక్కు వాడకం ద్వారా పర్యావరణ సుస్థిరత వంటి  ప్రయోజనాలను పొందటానికి అద్భుతమైన అవకాశం ఉందని ఆయన అన్నారు.


దేశంలో  ఉక్కు వాడకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్టీల్ మంత్రిత్వ శాఖ ‘ఇస్పతి ఇరాడా’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని శ్రీ ప్రధాన్ తెలిపారు. సులభమైన, తక్కువ ఖర్చుతో కలిగిన, పర్యావరణ హితమైన, దృడమైన ఉక్కువాడకాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. "కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఇనుము మరియు ఉక్కు ఉత్పత్తుల వాడకానికి ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా దేశీయంగా ఉక్కు ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. డిఎంఐ & ఎస్పి పాలసీ ద్వారా ఇప్పటివరకూ రూ. 20,000 కోట్ల విలువైన స్టీల్‌ ఉత్పత్తుల దిగుమతులను అరికట్టామని పేర్కొన్నారు. ఈ రంగానికి ముడిసరుకు భద్రత ఉండేలా కృషి చేస్తున్నామన్నారు. కోకింగ్ బొగ్గు దిగుమతుల వనరులను వైవిధ్యపరుస్తున్నామని.. వివిధ వనరుల నుండి మరియు వివిధ రకాల ఉత్పత్తుల నుండి ఉత్పత్తి చేయబడిన ఫెర్రస్ స్క్రాప్ యొక్క శాస్త్రీయ ప్రాసెసింగ్ & రీసైక్లింగ్ కోసం భారతదేశంలో మెటల్ స్క్రాపింగ్ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహించడానికి స్టీల్ స్క్రాప్ విధానాన్ని చేపట్టామని తెలిపారు. ఈ  విధానం  సురక్షితమైన మరియు పర్యావరణపరంగా మంచి పద్ధతిలో సేకరణ, కూల్చివేత మరియు ముక్కలు చేసే చర్యలకు ప్రామాణిక మార్గదర్శకాలను అందిస్తుందని మంత్రి తెలిపారు.

చమురు మరియు గ్యాస్ మరియు ఉక్కు రంగాలలో ఉన్న అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని, ఆత్మనిర్భర్ భారత్ సాకారం చేయడానికి దోహదపడాలని మర్చంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యులకు శ్రీ ప్రధాన్ పిలుపు నిచ్చారు.

 

******


(Release ID: 1674105) Visitor Counter : 202