గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పీఎం-స్వనిధి పథకానికి దాదాపు 25 లక్షలకు పైగా దరఖాస్తులు స్వీకరణ

ఇప్పటివరకు 12 లక్షలకుపైగా దరఖాస్తులకు ఆమోదం

Posted On: 18 NOV 2020 1:15PM by PIB Hyderabad

పీఎం-స్వనిధి పథకం (ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబన నిధి) కింద దాదాపు 25 లక్షలకు పైగా దరఖాస్తులు కేంద్ర ప్రభుత్వానికి అందాయి. వీటిలో, ఇప్పటివరకు 12 లక్షలకుపైగా దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. ఇందులో, దాదాపు 5.35 లక్షల రుణాలు మంజూరయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ నుంచి 6.5 లక్షలకుపైగా దరఖాస్తులు రాగా, 3.27 లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలిపి, 1.87 లక్షల రుణాలు అందించారు. ఆ రాష్ట్రంలో, పథకం రుణ ఒప్పందానికి స్టాంపు డ్యూటీని మిహాయించారు.

    కొవిడ్‌ కారణంగా పట్టణాలు, నగరాల నుంచి స్వగ్రామాలకు తరలివెళ్లి, తిరిగివచ్చిన వీధి వ్యాపారులు ఈ పథకానికి అర్హులు. బ్యాంకు లేదా మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లి, సులభంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యాపారులు తమ వ్యాపారాలను పునఃప్రారంభించడానికి బ్యాంకులు ఇళ్ల వద్దకే వచ్చి రుణాలు అందజేస్తున్నాయి. బ్యాంకు సిబ్బంది కృషిని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. "వీధి వ్యాపారులు బ్యాంకు గేటులోకి అడుగు కూడా పెట్టలేకపోయిన కాలం ఒకప్పుడు ఉండగా, ఇప్పుడు బ్యాంకులే వీధి వ్యాపారుల గడప వద్దకు వస్తున్నాయి" అని అన్నారు.

    ఈ పథకాన్ని వేగంగా, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, స్థిరంగా కొనసాగించడానికి వీలుగా వెబ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌తో డిజిటల్‌ వేదికను అభివృద్ధి చేశారు. వీధి వ్యాపారులకు ఇచ్చే అప్పుల నిర్వహణ కోసం 'సిడ్బి'కి చెందిన 'ఉద్యమిమిత్ర' పోర్టల్‌తో, వడ్డీ రాయితీ నిర్వహణ కోసం 'కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ'కు చెందిన 'పైసా' పోర్టల్‌తో ఈ పథకం వెబ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ను డిజిటల్‌ వేదిక అనుసంధానిస్తుంది. రూపే డెబిట్‌ కార్డులు లేదా డిజిటల్‌ రూపంలో నగదు స్వీకరణ, చెల్లింపులు జరిపితే, వీధి వ్యాపారులకు ఈ పథకం ద్వారా ప్రోత్సాహకాలు అందుతాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించేలా ఈ ప్రక్రియను సాఫీగా జరిపించేందుకు సంబంధిత వర్గాలతో ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నట్లు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ దుర్గాశంకర్‌ మిశ్రా గతంలో ట్వీట్‌ చేశారు.

    స్థానిక వ్యాపారులపై కొవిడ్‌ ప్రభావం చూపినా, కేంద్ర సాయంతో వారు తిరిగి వ్యాపారాలను పూర్వస్థాయికి చేర్చి, జీవనోపాధిని బలోపేతం చేసుకోగలరు. పీఎం స్వనిధి కింద నిధులు తీసుకుంటున్న వ్యాపారులు నిజాయితీగా, గడువులోగా వాటిని తిరిగి చెల్లిస్తున్నారు. ఈ పథకంపై సమీక్షించిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ హర్‌దీప్‌ సింగ్‌ పూరి; దేశ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వామి అవుతారని, ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధన దిశగా ఇది సానుకూల అడుగని ట్వీట్‌ చేశారు.

    పీఎం-స్వనిధి పథకం అమల్లో పట్టణ స్థానిక యంత్రాంగాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ పథకాన్ని విజయవంతంగా నిర్వహించడంలో వీధి వ్యాపారుల సంఘాలు, బిజినెస్‌ కరస్పాండెంట్లు, బ్యాంకు ఏజెంట్లు, సూక్ష్మ రుణ సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, డిజిటల్‌ చెల్లింపుల విధానాల వంటి అన్ని వర్గాలను స్థానిక యంత్రాంగాలు చైతన్యవంతం చేస్తున్నాయి.

***



(Release ID: 1673756) Visitor Counter : 223